ఈ స్థాయికి వచ్చేందుకు 30 ఏళ్లు పట్టింది
close
Published : 27/01/2020 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ స్థాయికి వచ్చేందుకు 30 ఏళ్లు పట్టింది

అల్లు అర్జున్‌ భయంకరమైన నటుడు: మురళీశర్మ

ముంబయి: మురళీశర్మ అంటే ఎక్కువ మంది తెలుగు సినీ అభిమానులకు తెలియకపోవచ్చు. కానీ, వాల్మీకీ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘అల వైకుంఠపురము’లో హీరో తండ్రి పాత్ర అది. మురళీశర్మ తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసినా వాటన్నింటినీ మించిన గుర్తింపును తెచ్చిపెట్టిందీ చిత్రం. హీరో తండ్రిగా ఆయన నటన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాత్ర ఆయనలోని నటుడిని మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు.

త్రివిక్రమ్‌కు రుణపడి ఉంటా

*ఇంతకుముందు ప్రతి రోజూ నేను గంటసేపు నడిచేవాడిని. అల వైకుంఠపురములో చిత్రంతో ఇప్పుడు ఆ నడక 1.45గంటలకు పెరిగింది. నేను నడకకు వెళ్లినప్పుడు.. సినిమా చూసిన వాళ్లు పిలిచి మరీ మాట్లాడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఫోన్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనంతటికీ కారణం దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

*గతంలో ఓసారి ఆయన్ను కలిసినప్పుడు ఒక మంచి హాస్యభరిత చిత్రం చేయాలి అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఒక మంచి కథ దొరికింది. అదృష్టవశాత్తు ఆయన నన్నే ఆ సినిమాకు ఎంచుకున్నారు. సినిమాలోని పాత్రలను ఆయన ఎంతో ఏకాగ్రతతో తీర్చిదిద్దారు. ప్రతి పాత్రనూ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా అంత అద్భుతంగా వచ్చింది.

*అల్లు అర్జున్‌ గురించి చెప్పాలంటే.. ఆయన ఒక భయంకరమైన నటుడు, సెట్లో స్టార్‌హీరోలా అస్సలు భావించడు. తన పాత్ర(బంటు)లోనే లీనమైపోతాడని మురళీశర్మ అన్నారు. 

విజయం కంటే ఆ క్రమంలో పడే కష్టమే సంతోషాన్నిస్తుంది

2007లో మహేశ్‌బాబు హీరోగా నటించిన అతిథి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మురళీశర్మ తొలి సినిమాతోనే ఉత్తమ విలన్‌గా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. నానీ హీరోగా నటించిన భలెభలే మగాడివోయ్‌, నిన్ను కోరి చిత్రాల్లో తండ్రి పాత్రల్లో నటించి తన సత్తా చాటారు.

*సాహో, అజ్ఞాతవాసి, ఎవరు, కృష్ణగాడి వీరప్రేమగాథ, శైలజారెడ్డి అల్లుడుతో పాటు పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

*ఈ స్థాయికి రావడానికి తనకు 175 చిత్రాలు, ముప్పయేళ్ల కాలం పట్టిందని చెప్పుకొచ్చారు. ‘నేను సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉండను. కుటుంబం, సినిమాలతోనే నాకు సరిపోతుంది. రానున్న కాలంలో మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తా. విజయం సాధించడం కంటే విజయం సాధించే క్రమంలో మనం పడే శ్రమే ఎక్కువ సంతోషాన్నిస్తుంద’ని అంటున్నారయన.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని