బాలకృష్ణ-మోక్షజ్ఞలతో సినిమా చేయడానికి రెడీ!
close
Published : 23/03/2020 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ-మోక్షజ్ఞలతో సినిమా చేయడానికి రెడీ!

‘బాహుబలి’కి నా స్టైల్‌ టైటిల్‌ అదే!

‘పటాస్‌’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల టపాసుల మోత మోగించారు. ‘సుప్రీమ్‌’తో సూపర్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నారు. ‘రాజా ది గ్రేట్‌’తో గ్రేట్‌ డైరెక్టర్‌ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ‘ఎఫ్‌2’తో అటు ఫ్రస్ట్రేషన్‌ ఇటు ఫన్‌ను కలగలిపి నవ్వులు విరబూయించారు. ‘సరిలేరు నీకెవ్వరు’తో మహేశ్‌ అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చారు.. ఆయనే యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి. వరుస విజయాలతో జోరుమీదున్న ఆయన తరుణ్‌ భాస్కర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీ ప్లస్‌లో ప్రసారమవుతున్న‘నీకు మాత్రమే చెప్తా’ షోకు విచ్చేసి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన తన కెరీర్‌ రచయితగా ఎలా మారింది? ఎలా దర్శకుడు అయ్యారు? ఇలా అనేక విషయాలను గత వారం ‘పార్ట్‌-1’లో పంచుకున్నారు. దానికి కొనసాగింపుగా ‘పార్ట్‌-2’లో మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

మీరు బ్యాచిలర్‌గా ఉండగా, ఏ హీరోయిన్‌ ఫొటోలు మీ గదిలో ఉండేవి?

అనిల్‌ రావిపూడి: నాకు శ్రీదేవి అంటే బాగా ఇష్టం. శ్రీదేవి పోస్టర్‌ తప్పకుండా ఉండేది.

కొత్త సంవత్సరం వస్తే, నగ్మా గ్రీటింగ్‌ కార్డు తప్పకుండా అడిగేవారట!

అనిల్‌ రావిపూడి: ఎవరు చెప్పారు. (నవ్వులు) నగ్మా అంటే పిచ్చి. శ్రీదేవి అంటే ఇష్టం. నగ్మా గ్లామర్‌గా ఏ సినిమాలో కనిపించినా నాకు ఇష్టమే. స్కూల్‌కు వెళ్లేటప్పుడు దారిలో ఆమె పోస్టర్‌ కనిపిస్తే కొంచెం సేపు ఆగి చూసేవాడిని. 

మీకు అభిమాన దర్శకుడు ఎవరు?

అనిల్‌ రావిపూడి: జంధ్యాలగారు. ఆయన్ను గురువుగా భావిస్తా. ఆరోగ్యకర కామెడీని తెరపై ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. ఆ తర్వాత రాఘవేంద్రరావుగారు. కామెడీ-కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను కలిపి ఎలా తీయాలో ఆయన సినిమాల ద్వారా నేర్చుకున్నా. 

మీరు ఎప్పటికీ కామెడీ సినిమాలే తీస్తారా? ఆ జానర్‌ మారే ఆలోచన ఏదైనా ఉందా?

అనిల్‌ రావిపూడి: ప్రస్తుతానికి కామెడీని వదిలే ప్రశక్తే లేదు. ఒక ప్రయోగాత్మక చిత్రం చేయాలని ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చేయకపోయి ఉంటే, మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాలని అనుకున్నా. సుకుమార్‌గారి ప్రాజెక్టు తర్వాత మహేశ్‌బాబుగారితో నేను సినిమా చేయాల్సింది. కానీ, ముందుకు వచ్చేసింది. ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తా. 

స్కూల్లో మీరు టాప్‌ అని అందరూ చెబుతున్నారు. మీ భార్య భార్గవి ఫెయిల్‌ అయినప్పుడు కాలేజ్‌లో ఏడిపించారట!

అనిల్‌ రావిపూడి: తను చాలా బాగా చదువుతుంది. కానీ, నేను ఇంజినీరింగ్‌కు వచ్చాక చదవడం తగ్గిపోయింది. నాతో పాటు నాలాంటి వాడు చదవకపోతే ఆనందం ఏమీ ఉండదు. తను బాగా బ్రిలియంట్‌ కానీ, పరీక్ష తప్పింది. ఇద్దరం తప్పి సప్లిమెంట్‌ రాశాం. ‘నువ్వేంటి.. నాతో కలిసి సప్లిమెంట్‌ రాయడం ఏంటి’ అని అంటూ ఉండేవాడిని. ట్విస్ట్‌ ఏంటంటే.. సప్లిమెంట్‌లో నేను పాసై, తను తప్పింది. ఆ రోజు తను ఇంటికి వెళ్లి ‘అమ్మా.. నేను ఫెయిల్‌ అయినా పర్వాలేదు. కానీ, వాడు పాసయ్యాడట’ అని చెప్పి ఏడ్చిందట. 

వైవాను మీరు ఎలా ఎదుర్కొనేవారు?

అనిల్‌ రావిపూడి: హర్ష ‘వైవా’ తీశాడు కదా! నాది కూడా అదే పరిస్థితి. నా పక్కన ఉన్న అమ్మాయికి బాగా ప్రిపేర్‌ అవ్వమని చెప్పేవాడిని. నేను మాత్రం అక్కడ యాక్టింగ్‌ చేసేవాడిని. 

జనాలను కొన్ని ప్రశ్నలు అడిగాం. వాటికి మీ సమాధానం.. వాళ్లేమనుకుంటున్నారో చూద్దాం! 

అనిల్‌ డైరెక్టర్‌ కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు?(.సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, బి.హీరో, సి.కమెడియన్‌)

అనిల్‌ రావిపూడి: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.(ఎక్కువమంది హీరో అవుతాడని చెప్పారు)

ఏ హీరోతో డైరెక్షన్‌ చేస్తే చూడాలని ఉంది? .బాలకృష్ణ, బి.పవన్‌ కల్యాణ్‌, సి.జూ.ఎన్టీఆర్‌

అనిల్‌ రావిపూడి: జూ.ఎన్టీఆర్‌. బాలకృష్ణగారితో చేయడానికైనా నేను సిద్ధమే! అలాగే చిరంజీవిగారితో కూడా.. (అత్యధికమంది బాలకృష్ణను డైరెక్ట్‌ చేస్తే చూడాలని ఉందన్నారు)

మీ వైఫ్‌ మిమ్మల్ని దేంతో కొట్టి ఉంటారు?.చెయ్యి, బి.స్పూన్‌, సి.ప్లేట్‌

అనిల్‌ రావిపూడి: చేత్తో..!(ఎక్కువ మంది స్పూన్‌ అని చెప్పారు)

మీకు నిద్రలో పక్కవాళ్లపై కాళ్లు వేసే అలవాటు ఉందా?.వేస్తాడు, బి.వేయడు.

అనిల్‌ రావిపూడి: ఏం ప్రశ్నండీ బాబూ.. కేవలం సపోర్ట్‌ కోసం వేస్తా(నవ్వులు)(అత్యధికమంది వేస్తాడు అని సమాధానం చెప్పారు)

మీరు ఆదివారం స్నానం చేస్తారా?.చేస్తారు, బి.చేయరు

అనిల్‌ రావిపూడి: నేను ప్రతిరోజూ రెండు పూటలా చేస్తా!(నవ్వులు)(ఎక్కువమంది చేయరు అని సమాధానం ఇచ్చారు)

ఈ సినిమా టైటిల్స్‌ను మీ స్టైల్‌ ఎలా మారుస్తారు?

అసలు టైటిల్‌ అనిల్‌ రావిపూడి స్టైల్‌ టైటిల్‌
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్నోడు పెద్దోడు
పెళ్లి చూపులు విజయ్‌ దేవరకొండ కేరాఫ్‌ క్యాటరింగ్‌
బాహుబలి అత్తా కోడళ్ల సవాల్‌
గ్యాంగ్‌ లీడర్‌ రఫ్ఫాడిస్తా 
నిన్నేపెళ్లాడతా పండు నాతో ఉండు 
టైటానిక్‌ పెద్ద పడవ

మీ కాలేజ్‌ లైఫ్‌ చాలా కలర్‌ఫుల్‌గా అయిందని తెలిసింది. దాని గురించి చెబుతారా?

అనిల్‌ రావిపూడి: కాలేజ్‌ అనగానే, నాలుగేళ్లు మనం తిరిగిన కారిడార్లు.. ఆడిన గ్రౌండ్స్‌.. మనం చూసిన అమ్మాయిలు.. సినిమాలు.. ఎగ్గొట్టిన క్లాస్‌లు.. ఫైట్‌ చేసిన లెక్చరర్లు.. ఇలా అన్నీ మనకళ్ల ముందు తిరుగుతాయి. ‘హ్యాపీడేస్‌’ సినిమా చూసి ఏడ్చేశా. ప్రతి బీటెక్‌ స్టూడెంట్‌ను కదిపేస్తుంది. క్యాంపస్‌ నుంచి మనం ఏం నేర్చుకున్నాం.. ఏం చదువుకున్నాం అనేది  ఫేర్‌వెల్‌ రోజున తెలుస్తుంది. అలా నేను తీసుకొచ్చుకున్న గ్రేట్‌ మెమొరీ ‘విజ్ఞాన్‌ మహోత్సవ్‌’. 

భార్గవితో పరిచయం నుంచి వివాహం అయిన వరకూ జరిగిన విషయాలు చెబుతారా?

అనిల్‌ రావిపూడి: మేమిద్దరం అసలు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కాదు. తెలిసిన వాళ్లమంతే. మా వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మా చదువు అయిపోయిన తర్వాత తను జాబ్‌ చేసుకుంటూ ఉంది. నేను డైరెక్షన్‌ అవకాశాల కోసం తిరుగుతున్నా. అదే సమయంలో ఒక రోజు కలిస్తే తనని ఆఫీస్‌ దగ్గర డ్రాప్‌ చేశా. అప్పుడే తనకి ప్రపోజ్‌ చేశా. ఆమె షాకైంది. ‘డ్రాప్‌ చేయడానికి వచ్చి ఇలా అన్నాడేంటి’ అనుకుంది. ఆ తర్వాత తను కూడా ఆలోచించింది. 

403, 407 ఈ నెంబర్ల వెనుక కథ ఏంటి?

అనిల్‌ రావిపూడి: చదువుకునేటప్పుడు 403 నా రోల్‌ నెంబరు. తనది 407. అప్పుడు పేర్లతో పిలుచుకోవడం కన్నా నెంబర్లతో పిలుచుకునేవాళ్లం. 420 నెంబర్‌ ఉన్నవాడు బాగా ఫీలయ్యేవాడు. మా ఫోన్‌ కాంటాక్ట్స్‌లో పేర్లు కూడా 403, 407గా సేవ్‌ చేసుకున్నా. 

ఇలాంటి భార్య నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌ అన్న మూమొంట్‌ ఏదైనా ఉందా?

అనిల్‌ రావిపూడి: ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ సమయానికి తను ప్రెగ్నెంట్‌. తనతో గడిపే సమయమే ఉండేది కాదు. నేను లేకపోయినా అన్నీ తనే చూసుకునేది. ఒక్క స్కాన్‌కైనా నన్ను తీసుకెళ్లి చూపిద్దామనుకునేది. కానీ, కుదరలేదు. నన్ను అర్థం చేసుకుని అన్ని పనులు తనే చేసుకునేది. 

మీ అమ్మాయిని స్కూల్‌కు తీసుకెళ్లడానికి చాలా అవస్థలు పడేవారట!

అనిల్‌ రావిపూడి: తను ప్రెగ్నెంట్‌ కావడంతో పాపను ఉదయాన్నే 7.30గంటలకు నేనే స్కూల్‌కు పంపేవాడిని. నేను లేచి పాపను తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. నా లైఫ్‌లో అంత ఫ్రస్ట్రేషన్‌ ఎప్పుడూ తీసుకోలేదు. పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కు పంపడం అనేది వంద బాహుబలులు తీసినట్టే. బాహుబలి సినిమాను ఐదేళ్లలో తీశారు. కానీ, వీళ్లను స్కూల్‌కు పంపడం అంతకు మించిన కష్టం. పైగా మధ్యలో ‘డాడీ సాయంత్రం నాకు ఏం తెస్తావు’ వీళ్ల కుళ్లు జోకులు. వేరేవాళ్లు నన్ను జాలిగా చూస్తారు. 

కాలేజ్‌ చదువుకునేటప్పుడు మీకు లెటర్‌ వచ్చిందట! చదువుదామనే సరికి కంటెంట్‌ చూసి భయపడ్డారట!

అనిల్‌ రావిపూడి: మా మామయ్య వాళ్ల అమ్మాయి ఆ లెటర్‌ రాసింది. చూడగానే ‘నా మరదలు లెటర్‌ రాసింది’ అన్న ఫీలింగ్‌లో ఉన్నా. దాన్ని ఓపెన్‌ చేసి చదివితే.. ‘ ఈ ఉత్తరం శ్రీ షిర్డీ సాయిబాబా తరపున రాయడం జరిగింది. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలంటే.. ఈ ఉత్తరం మరో ఏడుగురికి రాయాలి. లేదంటే మీ తల వెయ్యి వక్కలు అవుతుంది’ అని ఉంది. అందరూ కామెడీ చేశారు. నా తల పగిలిపోతుందేమోనని నేను కూడా ఉత్తరాలు రాశా. (నవ్వులు)

మీరు కొట్టకుండా ఒకరి వేలు కొరికారట!

అనిల్‌ రావిపూడి: నేను కొరకలేదు. శివ అని నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వాడు నా వేలు కొరికాడు. పేకాడుతూ చిన్న గొడవ జరిగిందని, నా వేలు కొరికాడు. నేను రెండు నెలలు మాట్లాడలేదు. ఆ తర్వాత ‘తొలి ప్రేమ’ సినిమాకు వెళ్తే, అక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ మాట్లాడుకున్నాం. 

ఓ సినీ మ్యాగజైన్‌లో ఓ హీరో-ఆయన కొడుకు కలిసి దిగిన ఫొటో మీ గదిలో గోడకు అంటించి ఉండేదట. ఎప్పటికైనా ఆ హీరో కొడుకును డైరెక్ట్‌ చేస్తానని అనేవారట! 

అనిల్‌ రావిపూడి: హీరో బాలకృష్ణ.. ఆయన కొడుకు మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫొటో ఉండేది. ‘ఎప్పటికైనా మోక్షజ్ఞను డైరెక్ట్‌’ చేస్తా అనేవాడిని. బాలకృష్ణగారితో అయినా, వాళ్ల అబ్బాయితో చేయడానికైనా సిద్ధమే!

మీరు డైరెక్ట్‌ చేసిన హీరోయిన్లలో ఈ క్వాలిటీస్‌ ఎవరిలో ఉన్నాయి

టూ హాట్‌ తమన్నా
ఫన్‌ టు బి అరౌండ్‌ రాశీఖన్నా 
జీనియస్‌ అలాంటి వాళ్లు తగల్లేదు
తలనొప్పి శ్రుతి సోడి. పాపం ఆమెది చిన్న క్యారెక్టర్‌. చాలా ఎక్కువ ఊహించుకుని వచ్చింది. నేను ఏమైనా ఫెరామెన్స్‌ చేయనా? అని అడుగుతూ ఉండేది.

హీరో మహేశ్‌ గురించి ఒక వదంతి క్రియేట్‌ చేయాలంటే ఏం చేస్తారు?

అనిల్‌ రావిపూడి: బాగా టీజ్‌ చేస్తారు. నాకు డైట్‌ ఫుడ్‌ పంపేవారు. అంటే తక్కువ తినమని. కానీ, నేను దానితో పాటు ప్రొడక్షన్‌ ఫుడ్‌ కూడా తినేవాడిని.

‘ఎఫ్‌2’, ‘సరిలేరునీకెవ్వరు’ మీకు నచ్చిన ఒక్క సినిమా?

అనిల్‌ రావిపూడి: తాజా సినిమానే మన ప్రయారిటీ, దాని వల్లే తర్వాతి సినిమా వచ్చింది కాబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’.

ఏదైనా సినిమా, సీన్‌ చూసినప్పుడు ‘ఆ ఐడియా మనకెందుకు రాలేదు’ అని ఫీలయ్యారా? 

అనిల్‌ రావిపూడి: చాలా ఉన్నాయి. ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరో హీరోయిన్‌ కలుసుకునే సీన్‌ బాగా నచ్చింది.

మీ దగ్గర బ్రెయిన్‌ వాష్‌ మెషీన్‌ ఉంటే ఎవరిని వాష్‌ చేస్తారు?

అనిల్‌ రావిపూడి: నటుడు శ్రీనివాసరెడ్డి. తను నాకు మంచి ఫ్రెండ్‌ కూడా. అతను నిర్మాతగా ఒక సినిమా తీస్తుంటే వద్దని చెప్పా. అయినా వినలేదు. అతన్ని తీసుకొచ్చి ‘నువ్వు యాక్ట్‌ చెయ్యి.. డైరెక్ట్‌ చెయ్యి. ప్రొడ్యూస్‌ మాత్రం చేయొద్దు’ అని చెబుతా. 

ఈ పేర్లు చెప్పినప్పుడు మీకు గుర్తొచ్చే దర్శకుడు?

రోల్స్‌ రాయిస్‌ బోయపాటి శ్రీను. ఎందుకంటే ఆయన సినిమా అలా భారీగా ఉంటుంది.
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వి.వి.వినాయక్‌. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఒక బ్రాండ్‌. వినాయక్‌ కూడా అంతే.
క్రూజ్‌ రాజమౌళి. అదొక అద్భుత ప్రయాణం. 
వెస్పా నందినిరెడ్డి. చాలా కూల్‌. ఆమె సినిమా చూస్తుంటే మన ఇంటి పక్కన జరుగుతున్నట్లు ఉంటుంది. 
సైకిల్‌ నేనే లేదా బోయపాటి. ఎందుకంటే ఆయన తెదేపాకు పనిచేశారు కదా!(నవ్వులు)

ఇటీవల మీ భార్యకు మీరు చెప్పిన అబద్ధం ఏంటి?

అనిల్‌ రావిపూడి: ఆఫీస్‌లో లేటవుతుందని చెప్పి, మహేశ్‌గారి ఇంట్లో పార్టీ చేసుకున్నాం. 

ఒకడు మీ ముందే మీ సినిమా గురించి చెత్తగా మాట్లాడుతున్నాడు. అప్పుడే అతని చెంప మీద దోమ వాలింది. దాన్ని మీరు వాడుకుంటారా?

అనిల్‌ రావిపూడి: వాడుకుంటా. ఆ అవకాశం ఇచ్చినందుకు దోమకు గుడి కట్టిస్తా.

చరిత్రలో మీకు ఎన్ని పేజీలు ఉండాలి? దానికి టైటిల్ ఏం ఉండాలి?

అనిల్‌ రావిపూడి: చరిత్రలో పేజీలు ఉండే అవకాశం వస్తే, నేను పుస్తకమే అడుగుతా. ఎందుకంటే నా డ్రీమ్‌ అంత పెద్దగా ఉంటుంది. అది కష్టం. ఎందుకంటే చరిత్రలో ఇంకా పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారు. అందుకే నాకు ఒక లైన్‌ ఉంటే చాలు.

ఒక్కరోజు తరుణ్ భాస్కర్‌లా మారిపోతే ఏం చేస్తారు?

అనిల్‌ రావిపూడి: హ్యాపీగా ఫీలవుతా. ఎందుకంటే జాతీయ అవార్డు వచ్చింది కదా!

ఈ మధ్య చూసిన సినిమాల్లో ‘ఈ సీన్‌ ఎక్కడో కాపీ కొట్టినట్లు ఉంది’ అనిపించిందా?

అనిల్‌ రావిపూడి: ఒకప్పుడు అలా అనుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు అది లీగల్‌ అయిపోయింది.  డైరెక్టర్లు కూడా ఒప్పుకొంటున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని