సినిమాల్లోకి పవన్‌: నిర్ణయం సరైనదేనా?
close
Published : 04/02/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమాల్లోకి పవన్‌: నిర్ణయం సరైనదేనా?

హైదరాబాద్‌: గత కొంతకాలంగా రాజకీయాలతో తీరికలేకుండా ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏకంగా మూడు సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తుండగా, దీంతో పాటు, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలను కూడా ఒకే చేశారు. ‘సినిమాల్లో నటించను’ అని చెప్పిన పవన్‌ మళ్లీ మేకప్‌ వేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో ఆయన అభిమానులతో వీడియోను పంచుకున్నారు. 

‘‘వెల్‌ కమ్‌ టు పవన్‌కల్యాణ్‌‌’. ఆయన సినిమాలు చేయాలని చాలా సార్లు చెప్పా. పవన్‌ తిరిగి సినిమాల్లో రావడం చాలా మందికి ఇష్టమే. అసలు పవన్‌ తిరిగి సినిమాలు ఎందుకు చేయాలి? రామారావుగారు ‘నాదేశం’ చేయనన్నప్పుడు ‘మీ పార్టీకి ఉపయోగపడుతుంది సర్‌.. చేయండి’ అని అంటే, నన్ను నమ్మి ‘ఈ సినిమా ఆడకపోయినా మాట్లాడను. నీ మీద ఆగ్రహం వ్యక్తం చేయను. కానీ, నాకు చెడ్డ పేరు వస్తే, జీవితంలో మీతో మాట్లాడను’ అని షరతు పెట్టారు. ‘సరే’ అన్న తర్వాత అప్పుడు విగ్గు పెట్టుకున్నారు. ‘నీకు రాజకీయం నేర్చుకోవడానికి 35ఏళ్లు పట్టింది. అదే రాజకీయాన్ని మూడు నెలల్లో ఔపసన పట్టాను’ అన్న డైలాగ్‌ చెప్పి నన్ను ప్రేమ పూర్వకంగా చూశారు. పవన్‌ విషయంలోనూ ఇదే చెప్పా. ‘మీరు వీధి వీధి తిరిగి చెప్పేకంటే ఒక్క మీడియా ద్వారా, పాత్ర ద్వారా అద్భుతంగా వెళ్లిపోతాయి. ‘కర్తవ్యం’ చూసి చాలా మంది మహిళలు పోలీస్‌ ఆఫీసర్లు కావాలని అనుకున్నారు. సినిమా ప్రభావం అలాంటిది’’

‘‘నటన, రచన భగవంతుడు ఇచ్చిన వరం. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అంశాలను తెరపై మీకు చూపిస్తుంటే అవి నచ్చి మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కొందరినైతే ఆరాధిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కు ఇమేజ్‌ ఉంది. అతను ఎంత మంచివాడో అందరికీ తెలుసు. రామారావుగారు ముఖ్యమంత్రి అయినా కూడా సినిమాలు చేశారు. 1989 ఎన్నికల్లో తెదేపా ఓడిపోయిన తర్వాత 94 ఎన్నికల్లో గెలవడానికి ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ఎంత ఉపయోగపడిందో మాకు తెలుసు. అలాగే ఎంజీఆర్‌గారు తాను ఎమ్మెల్యేగా గెలిచినా సినిమాలు మానేయలేదు. పవన్‌కల్యాణ్‌ ఎమ్మెల్యేగా గెలిచినా నటిస్తూనే ఉండాలి. ప్రస్తుతం చాలా మంది రాజకీయాల్లో ఉంటూనే నటిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్తే మేకప్‌ వేసుకోవడం తప్పేమీ కాదు. పవన్‌ నిర్ణయాన్ని అభినందించడం కోసమే నేను మాట్లాడుతున్నా. గ్యాప్‌లేని రోజున రాజకీయాల్లో ఉండండి. గ్యాప్‌ వచ్చిన రోజున సినిమాలు చేయండి. ధన్యవాదాలు’’ అని అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని