తొలి సినిమా ఫట్‌.. కెరీర్‌ మాత్రం హిట్‌!
close
Published : 23/04/2020 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి సినిమా ఫట్‌.. కెరీర్‌ మాత్రం హిట్‌!

ఐరన్‌లెగ్ అన్నవారే.. డేట్స్‌ కోసం ఎదురు చూశారు

సినిమా ఇండస్ట్రీ.. ఓ కలల ప్రపంచం.. రంగుల ప్రపంచం.. ‘శ్రీదేవిలా ఉన్నావ్‌.. జయసుధలా నటిస్తున్నావ్’ అంటుంటే హీరోయిన్‌ అయిపోదామని ఎన్నో ఆశలు, ఆశయాలతో చిత్ర పరిశ్రమకు వస్తారు. ఎలాగో అవకాశం దక్కించుకుని కథానాయికగా నటిస్తారు. ఆ నటించిన తొలి చిత్రం ఫట్‌మంటే.. ఇంకేముంది, ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర‌ వేస్తారు. సినిమా ఏ కారణంగా విఫలమైనా సరే.. హీరోయిన్‌ను కూడా కారణంగా చూపిస్తారు. అలాంటి విమర్శల్ని, ఆరోపణల్ని అధిగమించి కసితో కథానాయికగా నిలదొక్కుకున్నారు కొందరు అందాల తారలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. చాలా మంది ముద్దుగుమ్మలు ఇలాంటి నిందలు మోశారు. కసితో శ్రమించి విమర్శించిన వారితోనే హిట్టు భామ అనిపించారు. నేడు స్టార్ హీరోయిన్లుగా సుదీర్ఘ కాలంగా  వెలుగొందుతున్నారు. అలాంటి తారలెవరో చూద్దామా!

సినిమా పేరు మాత్రమే ‘సూపర్’ 

ప్పటి వరకు యోగా టీచర్‌గా ఉన్న మంగళూరు బ్యూటీ అనుష్క అనుకోకుండా నటిగా మారారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘సూపర్‌’ (2005) సినిమా కోసం కొత్త నటి కావాలని చూస్తున్న సమయంలో అనుష్క గురించి తెలిసింది. ఆమెను రప్పించి నాగార్జున సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘మహానంది’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అనుష్కపై ఐరన్‌లెగ్‌ మార్క్‌ పడింది. కానీ ‘విక్రమార్కుడు’, ‘అరుంధతి’, ‘బిల్లా’, ‘సింగం’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సినిమాలతో తనంటే ఏంటో నిరూపించారు అనుష్క. నేడు స్టార్‌ హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.

మొదట అంతగా ‘ఇష్ట’ పడలేదు.

దాదాపు 20 ఏళ్లకుపైగా చిత్ర పరిశ్రమలో కథానాయికగా అలరిస్తున్న భామ శ్రియ. ఓ వీడియో ఆల్బమ్‌ ద్వారా గుర్తింపు పొందిన ఆమె ‘ఇష్టం’ సినిమాతో 2001లో వెండితెరకు పరిచయం అయ్యారు. విక్రమ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చరణ్‌ దొడ్ల కథానాయకుడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. శ్రియ ఆపై నాగార్జునతో కలిసి ‘సంతోషం’ సినిమాలో నటించి గుర్తింపు పొందారు. అలా ‘నువ్వే నువ్వే’, ‘ఠాగూర్‌’, ‘ఛత్రపతి’, ‘మనం’, ‘దృశ్యం’ తదితర సినిమాలతో తనదైన ముద్ర వేయడమే కాదు, అటు అగ్ర కథానాయకులతో పాటు, ఇటు యువ హీరోలతోనూ ఆడిపాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్ర కథానాయకులకు జోడీ అంటే గుర్తొచ్చే పేర్లలో శ్రియ ఒకరు.

తొలి సినిమా అన్‌‘లక్‌’

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కుమార్తెగా వెండితెరపై మెరిశారు శ్రుతిహాసన్‌. ‘లక్‌’ చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రుతికి దురదృష్టం వెంటాడింది. తెలుగులో ఆమె నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ ఫ్లాప్‌ అయ్యింది. ఇంకేముందు ఐరన్‌ లెగ్‌ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. పలు హిందీ, తమిళ సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపురాలేదు. 2012లో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’తో బ్రేక్‌ వచ్చింది. ‘బలుపు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘ప్రేమమ్’ తదితర సినిమాలతో ఆమె హిట్లు అందుకున్నారు. నటిగానే కాకుండా గాయనిగానూ అలరిస్తున్నారు. కొన్నాళ్ల విరామం తర్వాత ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. 

‘కెరటం’ ఉవ్వెత్తున ఎగరలేదు

క్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కాలేజీ రోజుల్లోనే మోడల్‌గా పనిచేసిన ఆమె 2011లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొన్నారు. ఐదో స్థానంలో నిలిచి, పలు అవార్డులు గెలుచుకున్నారు. 2011లో ‘కెరటం’తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమా పరాజయం పొందింది. ఆపై 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో హిట్‌ అందుకున్నారు. ‘కరెంట్‌ తీగ’, ‘లౌక్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకుప్రేమతో..’, ‘ధృవ’ తదతర చిత్రాలతో తెలుగు తెరపై అలరించారు. ఇప్పుడు ఆమె చేతిలో పలు హిందీ ప్రాజెక్టులున్నాయి.

‘శ్రీ’కారం చుట్టినా..

తెలుగు వారికి దగ్గరైన మిల్కీబ్యూటీ తమన్నా తొలి సినిమా ‘శ్రీ’ (2005). మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఆశించిన విజయం‌ అందుకోలేకపోయింది. ఆపై తమన్నా కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకున్నారు. తిరిగి 2007లో ‘హ్యాపీడేస్‌’తో తెలుగులో బ్రేక్‌ అందుకున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్‌’, ‘రచ్చ’, ‘బాహుబలి’ తదితర సినిమాలో స్టార్‌గా ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషా చిత్రాల్లోనూ తమన్నా నటిస్తున్నారు. అక్కడ కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు.

‘లక్ష్మీ కళ్యాణ’ వైభోగమే..

నేడు దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ‘చందమామ’ కాజల్ అగర్వాల్‌‌. తెలుగులో ఆమె తొలి సినిమా 2007లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా భారీ అంచనాల మధ్య వచ్చిన పర్వాలేదనిపించింది. మిశ్రమ రివ్యూలు అందుకుంది. అదే ఏడాది వచ్చిన ‘చందమామ’ ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. అలా కాజల్‌ ‘మగధీర’, ‘ఆర్య 2’, ‘డార్లింగ్‌’, ‘బృందావనం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘టెంపర్‌’.. తదితర సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. తమిళంలోనూ దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసన నటించారు. ఇప్పుడు ఆమె చేతిలో దాదాపు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి.

‘వర్షం’లో తడిసింది.. హిట్‌ వచ్చింది

దాదాపు 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న నటి త్రిష. ఆమె కెరీర్‌ కోలీవుడ్‌తో ఆరంభమైనప్పటికీ తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యారు. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో టాలీవుడ్‌ తెరపై తొలిసారి సందడి చేశారు. ఈ సినిమా హిట్‌ అందుకోలేకపోయింది. ఆపై ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..’, ‘అతడు’, ‘ఆరు’, ‘ఆడవారిమాటలకు అర్థాలే వేరులే!’, ‘కృష్ణ’, ‘బుజ్జిగాడు’, ‘కింగ్’, ‘నమో.. వెంకటేశ’.. ఇలా అనేక హిట్లు అందుకున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా త్రిష నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని