తపస్‌పాల్‌ మృతి..కేంద్రంపై మమత ఆరోపణలు
close
Published : 20/02/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తపస్‌పాల్‌ మృతి..కేంద్రంపై మమత ఆరోపణలు

కోల్‌కతా: సినీ నటుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత తపస్‌ పాల్‌ మృతి చెందడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలతో మానసిక ఒత్తిడికి గురిచేయడంతో పాటు రాజకీయ కక్షసాధింపులకు కేంద్రం పాల్పడుతుండటం వల్లే ఆయన మృతిచెందారని ఆరోపించారు. కేంద్రం రాజకీయ కక్షసాధింపులకు తన కళ్లముందే ఇప్పటివరకు ముగ్గురు బలయ్యారని చెప్పారు. రోజ్‌వాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న తపస్‌ పాల్‌ (61) మంగళవారం ముంబయిలో గుండెపోటుతో మృతిచెందారు. కోల్‌కతాలోని రవీంద్ర సదన్‌ వద్ద ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందారని ఆందోళన వ్యక్తంచేశారు. తపస్‌ది అకాల మరణమనీ.. ఆయన్ను కూడా మానసికంగా హింసించారని ఆరోపించారు.

రెండుసార్లు ఎంపీగా పనిచేసిన తపస్‌ పాల్‌.. రోజ్‌వాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన ఏడాదికి పైగా జైలులో కూడా ఉన్నారు. తపస్‌ మృతికి సంతాపం తెలిపిన తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ.. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన  సుల్తాన్‌ అహ్మద్‌ కూడా గుండె పోటుతోనే మృతి చెందారన్నారు. 2017 నారద టేపుల కుంభకోణంలో ఆయన పేరు రావడంతో ఒత్తిడికి గురై హఠాన్మరణం చెందారన్నారు. అలాగే, తమ పార్టీ ఎంపీ ప్రసున్‌ బెనర్జీ సతీమణి కూడా కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులకు బలయ్యారని వివరించారు. ఇదే కేసులో సినీ నిర్మాత శ్రీకాంత్‌ మెహతా, ఓ వెటరన్‌ జర్నలిస్ట్‌ పాత్రికేయుడిని కూడా అరెస్టు చేసి చాలా కాలంగా కారాగారంలోనే ఉంచారని దీదీ విమర్శించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని