మధుమేహం పని ‘పట్టే’స్తుంది!
close
Published : 09/02/2020 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధుమేహం పని ‘పట్టే’స్తుంది!

బోస్టన్‌: మధుమేహ వ్యాధిగ్రస్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరచే ఒక వినూత్న పట్టీని అమెరికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇది రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు అవసరమైన స్థాయిలో ఇన్సులిన్‌ను శరీరంలోకి చొప్పిస్తుంది. ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ సహజసిద్ధంగా క్లోమంలో ఉత్పత్తి అవుతుంది. గ్లూకోజ్‌ను నియంత్రించడంలో ఇది శరీరానికి సాయపడుతుంది. టైప్‌-1 మధుమేహం ఉన్నవారిలో సహజసిద్ధంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి కాదు. టైప్‌-2 రోగుల్లో క్లోమం నుంచి విడుదలయ్యే ఈ హార్మోన్‌ను శరీరం సమర్థంగా వినియోగించుకోదు. ఈ నేపథ్యంలో ఉత్తర కరోలైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నాణెం పరిమాణంలో ఒక పట్టీని తయారుచేశారు. రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణాన్ని తరచూ పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. ఇందులో ఇన్సులిన్‌ను నింపిన సూక్ష్మ సూదులు ఉంటాయి. గ్లూకోజును పసిగట్టే పాలీమర్‌తో వాటిని తయారుచేశారు. వాటి పొడవు మిల్లీమీటరు కన్నా తక్కువే ఉంటుంది. ఈ పట్టీని చర్మంపై అతికించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి నిర్దిష్ట స్థాయికి చేరిన వెంటనే ఇది వేగంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. చక్కెర స్థాయి సాధారణానికి చేరుకున్నాక ఆ హార్మోన్‌ విడుదలను నిలిపివేస్తుంది. ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్సులిన్‌ మోతాదు పెరిగితే గ్లూకోజ్‌ స్థాయి పడిపోవడం, స్పృహ తప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు మరణానికీ దారితీస్తుంది. రోజుకోసారి వినియోగించేలా ఈ స్మార్ట్‌ పట్టీని రూపొందించారు. దీని తయారీ కూడా చాలా సులువు. దీన్ని మానవులపై ప్రయోగించాల్సి ఉంది. ఆ పరీక్షలు విజయవంతమైతే మధుమేహ వ్యాధిగ్రస్థుల ఆరోగ్య పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని