మెదడులోకి కరోనా: ఫలితంగానే మరణాలు?
close
Published : 20/06/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెదడులోకి కరోనా: ఫలితంగానే మరణాలు?

ముంబయి: కొవిడ్‌-19 గురించి తెలుస్తున్న కొత్త విషయాలు గుబులు పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్‌ మానవ మెదడులోకి ప్రవేశించి శ్వాస కేంద్రానికి సోకుతోందని తెలియడంతో కలవరం మొదలైంది! సీఎస్‌ఐఆర్‌-ఐఐసీబీ (కోల్‌కతా) శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని కనుగొని ఏసీఎస్‌ కెమికల్‌ న్యూరోసైన్స్‌లో ప్రచురించారు. ఈ మహమ్మారి వైరస్‌ ముక్కు ద్వారానే మస్తిష్కంలోని ఓల్‌ఫ్యాక్టరీ బల్బ్‌కు చేరుతోందని వారు గుర్తించారు.

ఓల్‌ఫ్యాక్టరీ బల్బ్‌ నుంచి ప్రిబాట్‌జింగర్‌ కాంప్లెక్స్‌ (పీబీసీ)కు వైరస్‌ చేరుతోంది. ఈ పీబీసీ వ్యవస్థే శ్వాస లయను నియంత్రించడం గమనార్హం. మెదడులోని శ్వాస కేంద్రం పనిచేయకపోవడమే కొవిడ్‌-19 రోగుల మరణాలకు కారణమవుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. మానవ దేహంలోని ఇతర అంగాలతో పాటు ఊపిరితిత్తులకు వైరస్‌ ఎక్కువ సోకుతుందన్న సంగతి తెలిసిందే. అయితే, మస్తిష్కంలోని మూల కణాలకూ వైరస్‌ సోకుతోందని వైద్యులైన ప్రేమ్‌ త్రిపాఠి, ఉపాసనా రే, అమిత్‌ శ్రీవాస్తవ, సోను గాంధీతో కూడిన పరిశోధనా బృందం తెలిపింది.

కొవిడ్‌-19 రోగుల సెరిబ్రోస్పైనల్‌ ద్రవం (మెదడులో ఉంటుంది), వ్యాధితో మృతిచెందిన వారి మెదడును పోస్ట్‌మార్టం చేస్తే అక్కడికి వైరస్‌ ఎలా ప్రవేశిస్తుందో, శ్వాస కేంద్రానికి ఎలా వ్యాపిస్తుందో మరిన్ని వివరాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘సార్స్‌-కొవ్‌2 మెదడులోని శ్వాసకేంద్రాన్ని విఫలం చేయొచ్చు. ఫలితంగా శ్వాస ఆడకపోవడం, మెదడులోని పీబీసీ మూల కణాలు నాశనం అవుతాయి’ అని వారు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ సోకిన వారు వాసన చూసే గుణం కోల్పోయే సంగతి తెలిసిందే. ముక్కులోంచి మెదడుకు వైరస్‌ చేరుకోవడంతోనే ఇలా జరుగుతుందని ‘కింగ్స్‌ కాలేజ్‌ లండన్’‌ శాస్త్రవేత్తలు సైతం భావిస్తున్నారు. కొవిడ్‌-19 రోగుల మరణాలకు ప్రాథమిక లేదా ద్వితీయ కారణం మెదడు కాకపోయినప్పటికీ దానిని పోస్ట్‌మార్టం చేస్తే వైరస్‌ ఎలా ప్రవేశిస్తుందో తెలుస్తుందని పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని