Rakesh Tikait: ఉద్యమం బలహీనపడలేదు.. అన్నదాతలు ఏకతాటిపై ఉన్నారు 
close
Updated : 24/07/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rakesh Tikait: ఉద్యమం బలహీనపడలేదు.. అన్నదాతలు ఏకతాటిపై ఉన్నారు 

సాగుచట్టాలు రద్దయ్యేంతవరకు నిరసన కొనసాగిస్తాం 
‘ఈటీవీ భారత్‌’తో రాకేశ్‌ టికాయిత్‌ 

దిల్లీ: నూతన సాగుచట్టాలను కేంద్ర సర్కారు రద్దు చేసేంతవరకు తాము వెనక్కితగ్గేది లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ పునరుద్ఘాటించారు. అన్నదాతలంతా ఏకతాటిపై ఉన్నారని, తమ ఉద్యమం ఏమాత్రం బలహీనపడలేదని స్పష్టంచేశారు. త్వరలో దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. 8 నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన కొనసాగిస్తున్న రైతుసంఘాలు తాజాగా దిల్లీ నడిబొడ్డుకు చేరి, జంతర్‌ మంతర్‌ వద్ద ‘కిసాన్‌ సంసద్‌’ను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. టికాయిత్‌ను ‘ఈటీవీ భారత్‌’ పలకరించింది. ఈ సందర్భంగా రైతు ఉద్యమం గురించి ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

మీ డిమాండ్లు ఏంటి? జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టడం ద్వారా ఏం ఆశిస్తున్నారు? 

ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేం నిరసన చేపడుతున్నాం. 8 నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో ఉంటున్నాం. నిరసనలకు సంబంధించి చాలా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని అమలు చేశాం. కిసాన్‌ సంసద్‌ నిర్వహణ కూడా అందులో భాగమే. సాగుచట్టాలను రద్దు చేయాలన్న మా డిమాండును దీనిద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేంతవరకు అక్కడ నిరసన కొనసాగిస్తాం. ప్రభుత్వం మీ డిమాండ్లను అంగీకరించబోతోందని గతంలో మీరు చెప్పారు.

కానీ ఆ దిశగా అడుగులు పడినట్లు కనిపించడం లేదు కదా? మీ ఉద్యమం బలహీనపడుతోందా?

ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తే మేమేం చేయగలం? అయినా మా ఉద్యమం బలహీనపడలేదు. దేశవ్యాప్తంగా పర్యటించి సాగుచట్టాల ప్రతికూలతలపై ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. గతంలో 16 రాష్ట్రాల్లో పర్యటించాం. మిగిలిన రాష్ట్రాలకూ త్వరలోనే వెళ్తాం. 

మండీలను బలోపేతం చేసేందుకు రూ.కోట్లు కేటాయించాని ప్రభుత్వం చెబుతోంది. అన్నదాతలకు ఆ నిధులు ప్రయోజనం చేకూరుస్తాయా?

నిధుల కేటాయింపుపై సర్కారు అబద్ధాలాడుతోంది. ప్రైవేటు మండీలకే సొమ్మును ధారపోస్తోంది. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ప్రగల్భాలు పలికింది. అది సాకారం కాలేదు. పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు. రైతుల ముసుగులో 60% వ్యాపారులు విక్రయాలు జరుపుతున్నారు. దీనిపై దర్యాప్తు జరిపించాలి. కానీ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపే సంస్థలేవీ ఇప్పుడు దేశంలో లేవు. ప్రస్తుతమున్న వాటికంటే రెట్టింపు ధరలకు ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయాలి.

మీరుగానీ, భారతీయ కిసాన్‌ యూనియన్‌ గానీ ఎన్నికల బరిలో దిగే అవకాశముందా?

ప్రస్తుతానికైతే అలాంటి యోచన లేదు. ప్రభుత్వం మెడలు వంచేందుకు అన్ని రకాల ‘ఔషధాలను’ ప్రయత్నిస్తున్నాం.

దిల్లీలో జనవరి 26న చోటుచేసుకున్న హింస ఎలాంటి ‘ఔషధం’ అంటారు మరి?

నాటి హింసకు మేం కారణం కాదు. దానిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ట్రాక్టర్లతో మేం వీధుల్లోకి వచ్చాం. ప్రభుత్వమే నిరసనకారులను ఎర్రకోట వైపు తీసుకెళ్లింది. హింసకు పాల్పడాలనే ఉద్దేశం మాకు ఉంటే.. పార్లమెంటువైపు దూసుకెళ్లే వాళ్లం.

కానీ, ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మీరే కదా?

నాడు దిల్లీకి 25 లక్షలమంది వచ్చారు. అంతమందిని ఒక్క వ్యక్తి ఎలా నియంత్రించగలడు? ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు దిగడంతోనే హింస చోటుచేసుకుంది.

చట్టాల రద్దుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది కదా? మీ తదుపరి ప్రణాళికలేంటి?

సాగుచట్టాలను ప్రభుత్వం త్వరగా రద్దు చేయాల్సిందే. కనీస మద్దతు ధరపైనా హామీ ఇవ్వాలి. ప్రైవేటు కంపెనీల చేతుల్లో పార్లమెంటు కీలుబొమ్మ కాకూడదు. మాతో సంప్రదింపులు జరపాలంటూ సర్కారుకు ఇటీవల లేఖ రాశాం. చట్టాల రద్దు తప్ప, ఇతర అంశాలపై చర్చలకు సిద్ధమేనని సమాధానం వచ్చింది. అందుకు మేం అంగీకరించలేదు. అలాంటి షరతులు విధించవద్దని స్పష్టం చేశాం. నూతన సాగుచట్టాలను ఉపసంహరించుకునేంత వరకు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తాం. అన్నదాతలంతా ఐక్యమత్యంతో ఉన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని