అష్రాఫ్‌ ఘనీ వైదొలగితేనే శాంతిస్తాం
close
Published : 24/07/2021 05:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అష్రాఫ్‌ ఘనీ వైదొలగితేనే శాంతిస్తాం

 తాలిబాన్ల ప్రకటన

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో అధికార గుత్తాధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని తాలిబాన్లు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఉన్నంతవరకు ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న శాంతి ఒప్పందం సాధ్యం కాదని తెగేసి చెప్పారు. ఘనీ ప్రభుత్వం వైదొలగితే తామూ ఆయుధాలు వదిలేస్తామన్నారు. ఈ మేరకు తాలిబాన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌.. అసోసియేటెడ్‌ ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అష్రాఫ్‌ ఘనీ యుద్ధోన్మాది అని, 2019 ఎన్నికల్లో అక్రమాలతోనే మరోసారి గెలిచారన్నారు. నాటి ఎన్నికలయ్యాక ఘనీతో పాటు అతని ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లాలు ఇద్దరూ ఎవరికి వారు అధ్యక్షులుగా ప్రకటించుకున్నారని, ఆ తర్వాత సయోధ్యతో ప్రభుత్వంలో నెంబర్‌ 1, నెంబర్‌ 2గా మారారని గుర్తుచేశారు. ఇలాంటి వ్యక్తులకు అధికారంలో కొనసాగే హక్కు ఉండదన్నారు. ప్రభుత్వం-తాలిబాన్ల మధ్య మొదలైన చర్చలు మంచి ప్రారంభమేనని, అయితే కేవలం తాలిబాన్లే కాల్పుల విరమణ ప్రకటించాలి.. ఘనీ అధికారంలోనే కొనసాగాలి అన్నట్టుగా వారి వైఖరి ఉందన్నారు. తాలిబాన్లు చెప్పినట్టుగా ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో మహిళలకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పారు. రాజధాని కాబూల్‌ను ఆక్రమించాలన్న ప్రణాళికలేవీ తమ వద్ద లేవన్నారు.

వైమానిక దాడులు కొనసాగిస్తున్నాం: పెంటగాన్‌

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ సైన్యానికి మద్దతుగా ఆ దేశంలో వైమానిక దాడులు కొనసాగిస్తున్నామని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ గురువారం తెలిపింది. అఫ్గాన్‌లో వ్యూహాత్మక భాగాన్ని తాలిబాన్లు కైవసం చేసుకున్నారని అమెరికా సీనియర్‌ మిలటరీ అధికారి ఒకరు ధ్రువీకరించిన మరుసటి రోజే పెంటగాన్‌ ఈ ప్రకటన చేసింది. అయితే ఏయే ప్రాంతాల్లో, ఏ లక్ష్యాలపై దాడులు చేసిందీ వెల్లడించలేదు. రక్షణ శాఖ వర్గాల ప్రకారం.. గత నెల రోజుల్లో.. కేవలం ఆరేడు చోట్ల మాత్రమే, అదీ డ్రోన్ల ద్వారానే ఈ దాడులు జరిగాయి. అఫ్గాన్‌ సైనికుల పరికరాలను తాలిబాన్లు లక్ష్యంగా చేసుకున్న చోటే ఈ దాడులు చేశారు. మరోవైపు అమెరికా సైనికుల నిష్క్రమణతో అఫ్గాన్‌లో తాలిబాన్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే దేశంలో సైన్యాన్ని వెనక్కునెట్టి సగం భూభాగంపై నియంత్రణ సాధించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని