భానుడి వేడి..దొరకని నాడి

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది.

Updated : 05 May 2024 07:42 IST

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. పార్టీల తరఫున కొన్ని సంస్థలు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే చేయిస్తూ.. మీ లోక్‌సభ పరిధిలో ఏ పార్టీ గెలుస్తుందని ఫోన్‌ ద్వారా అడుగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు దీని ద్వారా ఫోన్‌లో ఓటర్లను పరిచయం చేసుకుంటూ.. ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రెండ్రోజులుగా ఈ తరహా ఫోన్‌కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయి.

ప్రభావితం చేయనున్న పట్టణ ఓటర్లు..

పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో ఓటరు నాడి తెలుసుకోవడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు కష్టంగా మారింది. లోక్‌సభ పరిధిలో ఉన్న పట్టణాల్లో సుమారు నాలుగు లక్షల మంది ఓటర్ల తీర్పు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశముంది. ప్రధానంగా జిల్లా కేంద్రాలు సూర్యాపేట, నల్గొండతో పాటు పెద్ద పురపాలికలైన మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌ పట్టణాలు నల్గొండ లోక్‌సభ పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు ఉండటంతో ప్రధాన పార్టీలు ఇక్కడి ఓటర్లపై గురిపెట్టాయి. ప్రజల అభిప్రాయం కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వే ఏజెన్సీలను నియమించుకొని ఎప్పటికప్పుడు ఓటర్ల నాడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల మనోగతం తెలుసుకుని వారి కోరికలను అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరో పక్క ఎండలు తీవ్రం కావడంతో ఓటర్ల ఇంటికి వెళ్లలేక ఫోన్‌లోనే అభ్యర్థులు పరిచయం చేసుకోవడంతోపాటు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

బోసిపోయిన నల్గొండ-దేవరకొండ రహదారి

భిన్నమైన తీర్పు కొనసాగేనా..!

2019 ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానంలో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. నిరుడు అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా తీర్పిచ్చారు. లోక్‌సభ  పరిధిలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, సాగర్‌, నల్గొండ, దేవరకొండ అసెంబ్లీ స్థానాలు భారాస విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహా మిగతా శాసనసభ స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. ఈ క్రమంలో ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు పాత ఒరవడికి కట్టుబడి భిన్నమైన తీర్పు ఇస్తారా అనే భావన వ్యక్తం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని