50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు.

Updated : 05 May 2024 07:47 IST

3న గ్రేటర్‌లో 89.71 మి.యూ. వినియోగం
ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలన్న టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

ఈనాడు, హైదరాబాద్‌: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం చీఫ్‌ ఇంజినీర్లు, జనరల్‌ మేనేజర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు, డివిజనల్‌ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఈ నెల 3న (శుక్రవారం) అత్యధికంగా 89.71 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైందన్నారు. గతేడాది సరిగ్గా ఇదేరోజు 58.34 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో పోల్చుకుంటే ఇది 53.7% అధికమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2న 228.50 మి.యూ. వినియోగం నమోదైందని, గతేడాది మే 2 (151.71 మి.యూ.)తో పోలిస్తే ఇది 50.62% అదనమని తెలిపారు. మున్ముందు హైదరాబాద్‌లో రోజువారీ వినియోగం 90 మిలియన్‌ యూనిట్లకు మించుతుందని చెప్పారు. ఈ నెల ముగిసేవరకు రాష్ట్రవ్యాప్తంగానూ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందన్నారు.

అదనంగా 4,353 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

‘‘ఈ సీజన్‌ ముగిసే వరకు ప్రతి 11 కేవీ ఫీడర్‌కు ఇన్‌ఛార్జిగా ఒక ఇంజినీర్‌ను  నియమించాం. సంస్థ ప్రధాన కార్యాలయంలో, సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 300 మంది ఇంజినీర్లకు ఆపరేషన్‌ విధులు కేటాయించాం. సర్కిల్‌ కార్యాలయాల్లో పనిచేసే అకౌంటింగ్‌ సిబ్బందికి సైతం ఆపరేషన్‌ విధులు అప్పగించాలని ఆదేశించాం. వేసవి డిమాండ్‌ నేపథ్యంలో అదనంగా 4,353 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. మరో 250 ట్రాన్స్‌ఫార్మర్లను క్షేత్రస్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాం’’ అని సీఎండీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని