ఏడేళ్లలో 15 వేలకుపైగా పరిశ్రమలు
close
Updated : 30/07/2021 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడేళ్లలో 15 వేలకుపైగా పరిశ్రమలు

స్థానికులకు ఉపాధి కల్పిస్తే మరిన్ని ప్రోత్సాహకాలు

ఈ-సిటీలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ నూతన ప్లాంట్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్‌

మహేశ్వరం, న్యూస్‌టుడే: గత ఏడేళ్లలో తెలంగాణ 15 వేలకుపైగా పరిశ్రమలను.. తద్వారా రూ.2లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులను సాధించుకుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు అన్నారు. ఇందులో 80 శాతానికిపైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణమైన విషయమన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ పురపాలిక పరిధిలో ఉన్న ఈ-సిటీలో ప్రముఖ సోలార్‌ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఏర్పాటు చేసిన నూతన ప్లాంట్ను గురువారం మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.483 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టును ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఏర్పాటు చేసిందన్నారు. రాబోయే రెండేళ్లలో సంస్థ పెట్టుబడులను రూ.1200 కోట్లకు పెంచనుందని, తద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందన్నారు. స్థానికులకు ఉపాధి కల్పిస్తే అదనపు ప్రోత్సాహకాలు లభించేలా చూస్తామని ఈ సందర్భంగా యాజమాన్యానికి మంత్రి హామీ ఇచ్చారు. కరోనా సమయంలోనూ అడ్డంకులు ఉన్నా ముందడుగు వేసి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్‌ సెల్‌, మాడ్యూళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.  సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. 2023కల్లా 4 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ మాడ్యూల్స్‌, సోలార్‌ సెల్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రీమియర్‌ ఎనర్జీస్‌ కంపెనీ ప్రణాళికలు వేస్తోందన్నారు. ఈ ప్రాంతంలో ఆగస్టు 5న నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌ అర్హతలున్న రావిర్యాల, మహేశ్వరం, తుక్కుగూడ, కందుకూరు తదితర ప్రాంతాలకు చెందిన యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఛైర్మన్‌ సురేందర్‌పాల్‌ సింగ్‌, ఎండీ చిరంజీవ్‌ సలుజా, ఈడీ సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రుల కాన్వాయ్‌ని అడ్డుకునే యత్నం

మంత్రుల కార్యక్రమం నేపథ్యంలో తెల్లవారుజామునే మహేశ్వరం, ఆదిభట్ల, పహాడీషరీఫ్‌ ఠాణాల పరిధిలోని భాజపా, బీజేవైఎం నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచడంతో పాటు పలువురిని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అయినా కొంతమంది హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి శ్రీనగర్‌ వద్ద మంత్రులు కేటీఆర్‌, సబితల కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏడేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పట్టణాభివృద్ధిలో భవిష్యత్‌ అవసరాలే కీలకం

భవిష్యత్‌ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ పట్టణాభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘భవిష్యత్‌ అవసరాలు, పెరుగుతున్న పట్టణీకరణ- ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి’ అనే అంశంపై గురువారం హైదరాబాద్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధత, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న ఆదర్శవంతమైన పద్ధతులు, చట్టాలను అధ్యయనం చేయాలని కేటీఆర్‌ సూచించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులతో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, డీటీసీపీ విభాగాలఉన్నతాధికారులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు.


 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని