ఈ నెలలోనే మూడో ఉద్ధృతి!
close
Updated : 03/08/2021 03:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెలలోనే మూడో ఉద్ధృతి!

అక్టోబరులో తార స్థాయికి చేరొచ్చు
రెండో విజృంభణ కన్నా తక్కువ తీవ్రతే ఉండే అవకాశం
ఐఐటీ పరిశోధకుల విశ్లేషణ

దిల్లీ: భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్‌-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు. గతంలో రెండో ఉద్ధృతిపైనా వీరు కచ్చితమైన లెక్కలు కట్టడం ఇక్కడ ప్రస్తావనార్హం. విద్యాసాగర్‌ (హైదరాబాద్‌ ఐఐటీ), మణింద్ర అగర్వాల్‌ (కాన్పుర్‌ ఐఐటీ) నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. మూడో ఉద్ధృతి తార స్థాయిలో ఉన్నప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని చెప్పారు.  పరిస్థితులు మరింత దిగజారితే అది 1.5 లక్షలకూ చేరొచ్చన్నారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పరిస్థితిని అకస్మాత్తుగా మార్చేయవచ్చని కూడా తెలిపారు. రెండో ఉద్ధృతి ఈ ఏడాది మే 7న గరిష్ఠ స్థాయికి చేరింది. నాడు అత్యధికంగా రోజుకు 4లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వేగంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా మారుతున్న ప్రాంతాలను సత్వరం గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరమన్నారు. కొత్త వేరియంట్లను పట్టుకోవడానికి వైరస్‌ జన్యుక్రమాలను మరింత ఎక్కువగా ఆవిష్కరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తాజా విజృంభణకు కారణమైన డెల్టా రకం కరోనా వైరస్‌.. భారత్‌లోనే తొలుత వెలుగు చూసిన అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

ఇలాంటి అలసత్వమే కొంపముంచింది

ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల సామాజిక, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. వారిలో అలసత్వమూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కరోనా మొదటి ఉద్ధృతిలో ప్రయాణాలు, పండుగల సమయంలో గుమిగూడటాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో రెండో ఉద్ధృతి మొదలైంది. రెండో ఉద్ధృతి వల్ల దేశ ప్రజల్లో సహజసిద్ధ రోగ నిరోధక శక్తి భారీగా పెరిగింది. ఇది మూడో విజృంభణ ప్రభావాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి గత నెలలో నిర్వహించిన జాతీయస్థాయి యాంటీబాడీ సర్వేలో.. ఆరేళ్లు పైబడ్డ మూడింట రెండొంతుల మంది భారతీయులు కరోనా వైరస్‌కు గురైనట్లు తేలింది.

రెండో ఉద్ధృతి మొదలై ఇప్పటికి 5 నెలలు గడిచాయి. ఇప్పుడు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 40వేల వద్ద ఉంటోంది. గత కొద్దిరోజులుగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేరళలోనే వెలుగు చూస్తున్నాయి. ఆ రాష్ట్రం తదుపరి హాట్‌స్పాట్‌గా మారొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ స్వల్పకాలం పాటు కేసులు పెరిగాయని నిపుణులు తెలిపారు. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగితే.. దేశవ్యాప్త కేసుల సంఖ్య మరోసారి పెరుగుతుందని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ పెరిగేవరకూ ఇలాంటి పరిస్థితి ఉంటుందన్నారు. దేశ జనాభాలో 7.6%మంది మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు పొందారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మందగమనం వల్ల.. కరోనా తదుపరి ఉద్ధృతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నగరాల్లో వైరస్‌ క్లస్టర్లను గుర్తించడానికి గాలి, మురుగునీటి నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆసుపత్రుల్లో బాధితుల తాకిడి పెరగడానికి ముందే ఇన్‌ఫెక్షన్లను పట్టుకోవచ్చని చెప్పారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని