అక్రమ నిర్మాణాలపై నిరంతర నిఘా
close
Published : 21/09/2021 03:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్రమ నిర్మాణాలపై నిరంతర నిఘా

వార్డుకో ఉద్యోగికి బాధ్యతల అప్పగింత

నల్గొండలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన మేడ మీద మేడ

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: పురపాలికల్లో అక్రమ నిర్మాణాలు, అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. అనుమతి లేని భవన నిర్మాణాలకు చెక్‌ పెట్టేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయి లోపాలతో ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం మేల్కొంది. క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్‌్్సమెంటు బృందాలను ఏర్పాటు చేయగా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక పూర్తి స్థాయిలో అక్రమ భవన నిర్మాణాలకు చెక్‌ పడనుంది.


424 మంది ఉద్యోగులకు బాధ్యత

కొత్త మున్సిపాలిటీ చట్టం అమలులో భాగంగా వార్డు కమిటీలతోపాటు వార్డులకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. మరో పక్క సులువుగా అక్రమ పునాదులను గుర్తించేందుకు కొత్తగా క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న ఉద్యోగులను గుర్తించి వార్డు అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పుర అధికారులు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో 424 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో నిత్యం క్షేత్ర స్థాయి విధుల్లో ఉండే పారిశుద్ధ్య విభాగం శానిటరీ ఇన్‌స్పెక్టరు, జవాన్లు, మంచినీటి సరఫరా విభాగం సూపర్‌వైజర్లు, ఫిట్టర్లను వార్డు అధికారిగా నియమించేలా కమిషనర్లు, పట్టణ ప్రణాళికాధికారులు చర్యలు చేపట్టారు.


ఇక కూల్చివేతలే

కొత్త పురపాలిక చట్టం అమలులో భాగంగా భవన నిర్మాణాలకు అనుమతులు సత్వరమే లభించేలా టీఎస్‌ బీపాస్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనుమతుల మంజూరు, పర్యవేక్షణ, బాధ్యతలను పూర్తి స్థాయిలో పట్టణ ప్రణాళిక విభాగాలకే కాకుండా ప్రత్యేక బృందాలకు ప్రభుత్వం అప్పగించింది. డీఎస్పీ, ఆర్‌ అండ్‌ బీ శాఖ ఈఈ, తహసీల్దార్‌, ఆర్డీవో, ఏసీపీ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు టీఎస్‌ బీపాస్‌ ద్వారా మంజూరైన నిర్మాణాలను పరిశీలించాల్సి ఉంది. కానీ సొంత శాఖ విధులతోనే సతమతమవుతున్న కమిటీలోని అధికారులు అదనపు బాధ్యతలు చేపట్టేందుకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీ ఉద్యోగులు, జవాన్లు, ఫిట్టర్లు క్షేత్రస్థాయిలో నిర్మాణాలను గుర్తించి రోజువారీగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలకు నివేదించాల్సి ఉంటుంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు వాటిని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీకి సిఫార్సు చేయాలి. ప్రతి నెలా ఈ కమిటీ సమావేశమై అనుమతి లేని, నిబంధనలను అతిక్రమించిన నిర్మాణాలపై చర్చించి కూల్చివేతలకు ఉపక్రమించాలని కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు.


వార్డు అధికారుల నియామకంపై కసరత్తు
-నాగిరెడ్డి, ఏసీపీ నల్గొండ మున్సిపాలిటీ

మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలకు గుర్తించి అధికారులకు నివేదించేందుకు వార్డుల వారీగా ప్రత్యేకంగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నల్గొండ మున్సిపాలిటీలో వార్డుకు ఒక ఉద్యోగికి బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నాం. జాబితాతో కూడిన నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు అందిస్తాం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని