మలేరియా, డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు
close
Published : 21/09/2021 03:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మలేరియా, డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు

‘ఈనాడు’తో డీఎంహెచ్‌వో వెంకటరమణ

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లాలో మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు కొత్తగా కలిసిన వరంగల్‌ నగర ప్రాంతంలోని మురికివాడలలో మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నట్లు గుర్తించామన్నారు. నగర ప్రాంతాల్లో కార్పొరేషన్‌ మలేరియా విభాగంతో కలిసి నివారణ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మలేరియా, డెంగీ కేసుల నిర్ధారణకు ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని చెప్పారు. వైద్యఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలను డీఎంహెచ్‌వో వెంకటరమణ ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా, డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి?
జిల్లాలోని మున్సిపల్‌, గ్రామీణ ప్రాంతాలైన నర్సంపేట, భానోజీపేట, చెన్నారావుపేట, నెక్కొండ, అప్పల్‌రావుపేట, అలంకానిపేట, వరంగల్‌ నగరంలోని చింతల్‌ పుప్పాలగుట్ట, ఖిలావరంగల్‌, కరీమాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా, డెంగీ కేసులు వస్తున్నట్లు గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 

న్యూస్‌టుడే: జిల్లాలో మలేరియా, డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి. మీ శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఎంహెచ్‌వో: కాలానుగుణ జ్వరాలు ఇటీవల బాగానే పెరిగాయి. జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ యాంటిలార్వా నివారణ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా అవగాహన కల్పిస్తున్నాం. మాలేరియా విభాగం అధికారులు వ్యాధుగ్రస్థులున్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేసి శాంపిల్స్‌ సేకరించి అందరికి పరీక్షలు చేస్తున్నాం. బ్లీచింగ్‌ చల్లించడం, దోమల నివారణ మందు పిచికారీ చేయించి ప్రజలందర్ని అప్రమత్తం చేస్తున్నాం. 

ఇప్పటివరకు జ్వరపీడితుల గుర్తింపు, కేసుల నిర్ధారణ వివరాలు వివరించగలరా?  
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా జ్వరం సర్వే చేస్తున్నాం. ఇప్పటి వరకు 36,897 జ్వర పీడితులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి 32 మలేరియా, 13 డెంగీ కేసులను గుర్తించాం. వారికి నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించాం. అక్కడ కోలుకోని వారిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి రెఫర్‌ చేసి కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రభుత్వం ఎటువంటి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏఏ అధికారికి ఎటువంటి బాధ్యతలు ఉంటాయి?
గ్రామాల్లో సర్పంచి, కార్యదర్శి, ఏఎన్‌ఎం, ఆశాలు, మహిళా సంఘ సభ్యురాలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కూడిన ఆరోగ్య కమిటీ ఉంటుంది. ఆ కమిటీ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, 20 రకాల ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతినెలా సమావేశం ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. తాగునీటి క్లోరినేషన్‌ను ఇరిగేషన్‌ శాఖ అధికారులు చూస్తారు. దోమల నివారణ చర్యలు పంచాయతీలో కార్యదర్శి, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఆరోగ్య అధికారి పర్యవేక్షిస్తారు.

ఈ కాలంలో ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు, సూచనలు ఇస్తారు?
చలి జ్వరం వచ్చి రెండు రోజులైనా తగ్గకపోతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడ్ని సంప్రదించాలి. వారు ఆర్‌డీడీ కిట్లతో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. చికిత్స అందిస్తారు. అక్కడ కూడా తగ్గలేదంటే వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి వస్తే డెంగీ పరీక్ష చేస్తారు. సకాలంలో చికిత్స తీసుకున్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని