వణికిస్తున్న తుపాన్లు
close
Updated : 29/09/2021 06:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వణికిస్తున్న తుపాన్లు

సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు దినదిన గండం

నష్టానికి అంతులేదు.. పరిహారం అందదు

కురుపాం మండలం జరడలో తిత్లీ తుపాను బాధితులకు

ఇచ్చిన ఇళ్లివి. నగదు సాయం చేయకపోవడంతో ఇవి అసంపూర్తిగా నిలిచాయి.

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాను తుపానులు అతలాకుతలం చేస్తున్నాయి. 2014 అక్టోబరు 14న హుద్‌హుద్‌ పెద్ద నష్టాన్నే మిగిల్చింది. దీన్ని మర్చిపోక ముందే 2018లో తిత్లీ దెబ్బకొట్టింది. తాజాగా గులాబ్‌ కూడా పెను నష్టాన్ని మిగిల్చి వెళ్లింది.

హుద్‌హుద్‌.. గృహాలు ఏవీ?: హుద్‌హుద్‌ ప్రభావానికి జిల్లాలో 1400 ఇళ్లకు నష్టం జరిగింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో మత్స్యకారుల జీవనం చిన్నాభిన్నమైంది. ఇళ్లను కోల్పోయిన వారికి నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రూ.ఐదువేలు తక్షణ సాయం తప్ప ఇళ్లు కోల్పోయిన వారికి అందిన సాయం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. పెనుగాలుల బీభత్సానికి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. పంట నష్టపరిహారాలు కూడా చాలా వరకు అందలేదనే ఆరోపణలు ఉన్నాయి. అరటిరైతులు ఇంకా పరిహారానికి అధికారుల చుట్టూ తిరుగుతుండటం గమనార్హం.

సాలూరులో నీట మునిగిన పురపాలక కార్యాలయం​​​​​​​

గిరి సీమలను కుదిపేసిన తిత్లీ:  2018 అక్టోబరు 10న తిత్లీ జిల్లాలో గిరిజన ప్రాంతాన్ని కుదిపేసింది. గిరిజనులపై పంజా విసిరంది. కురుపాం. గుమ్మలక్ష్మీపురం మండలాల్లో జీడితోటలు పాడయ్యాయి. 143 ఇళ్లకు నష్టం జరిగింది. వీటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం సాయం అందించాల్సి ఉన్నా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు..27 ఇళ్లు మంజూరయ్యాయి. వారికి చెల్లింపులు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులను బతిమిలాడుతున్నా...సహకరించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉద్యాన పంటలకు, వరికి పరిహారం రాలేదు. యాభై శాతానికి మించి నష్టం జరిగితే తప్ప ఎవరికీ పరిహారం చెల్లించడం సాధ్యంకాదని అధికారులు తేల్చేశారు. సీీతాఫలం, చింత చెట్ల పెంపకానికి అటవీశాఖ చర్యలు చేపడుతుందని ప్రకటించినా ఆ దిశగా అడుగులు ఇప్పటికీ పడలేదు.

గులాబ్‌తో నష్టం అపారం: గులాబ్‌ తుపాను వల్ల జిల్లాలో అపారనష్టం సంభవించింది. మంగళవారానికి కూడా ఇంకా జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ జనజీవనానికి ఇబ్బందులు కలిగించింది. జిల్లాలో రహదారులు, వంతెనలు కోతకు గురయ్యాయి. రహదారులు, భవనాల శాఖకు నష్టం తక్కువేనని అధికారులు చెబుతున్నారు. సువర్ణముఖి ఉప్పొంగడంతో సీతానగరం, బలిజిపేట మండలాల్లో పంటలు నీటమునిగాయి. పాచిపెంట, సాలూరు, పార్వతీపురం మండలాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. తోటపల్లి కాలువకు గండ్లు పడ్డాయి. సాలూరు మండలంలోని మామిడిపల్లి, కొత్తవలస గిరిజన సంక్షేమ పాఠశాలల్లోకి వర్షపునీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు కనీసం విద్యార్థుల పరిస్థితిని పట్టించుకోలేదనే విమర్శ ఉంది. అరటి, వరి, చెరకు, మొక్కజొన్న, పత్తికి తీవ్ర నష్టం జరిగింది. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరి పరిహారం... సాయం ఏరీతిగా సాగుతుందో అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

50మీటర్ల ముందుకు..

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: గులాబ్‌ తుపాను ప్రభావంతో ‘అల’జడి కొనసాగుతోంది. మంగళవారం పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో 50మీటర్ల్ల వరకు సముద్రం ముందుకొచ్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ దూసుకొచ్చిన కెరటాల తాకిడికి ఒడ్డున ఉన్న 8 పడవలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. తుపాను వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోగా. పంటపొలాలు నీట మునిగాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని