వామ్మో..! 25 వేల చేరువకు.. - india records 24k new covid cases
close
Updated : 13/03/2021 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వామ్మో..! 25 వేల చేరువకు..

64శాతం ఒక్క మహారాష్ట్రలోనే..

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబెడుతున్నట్లే కన్పిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజువారీ కేసుల సంఖ్య 25వేలకు చేరువైంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8.40లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 24,882 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక రోజువారీ కేసులివే. చివరిసారిగా గతేడాది డిసెంబరు 20న 26,624 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1,13,33,728కి చేరింది. ఇదే సమయంలో 19,957 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,09,73,260 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 96.82శాతంగా ఉంది. 

అయితే గత కొద్దిరోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటుండంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్లీ 2లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,02,022 యాక్టివ్‌ కేసులుండగా.. ఈ రేటు 1.78శాతానికి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో మరో 140 మంది వైరస్‌కు బలయ్యారు. తాజా మరణాలతో దేశంలో మొత్తంగా 1,58,446 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

మహారాష్ట్రపై కొవిడ్‌ పంజా..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైరస్‌ విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 64శాతం కేవలం ఆ రాష్ట్రంలోనే బయటపడటం గమనార్హం. శుక్రవారం అక్కడ 15,817మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,82,191కి పెరిగింది.

మహారాష్ట్రలో ఈ స్థాయిలో కేసులు నమోదవడంతో ఐదు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే. చివరిసారిగా గతేడాది అక్టోబరు 2న 15వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నిన్న మరో 56 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని