ఒత్తిడిని జయించే అనుభవం నా సొంతం: గబ్బర్‌ - international cricket is about pressure i know how to handle it dhawan
close
Published : 24/03/2021 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒత్తిడిని జయించే అనుభవం నా సొంతం: గబ్బర్‌

పుణె: అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడి ఉంటుందని టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అంటున్నాడు. దాన్నెలా ఎదుర్కోవాలో తనకు తెలుసని ధీమా వ్యక్తం చేశాడు. ఒక అనుభవజ్ఞుడిగా ఎలాంటి పిచ్‌పై ఎలాంటి షాట్లు ఆడాలో తనకు తెలుసన్నాడు. వికెట్లను అధ్యయనం చేసి బ్యాటింగ్‌ విభాగానికి చక్కగా వివరిస్తానని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియాకు ఇదే పనిచేసిందన్నాడు. ఒక్కసారి తాను క్రీజులో నిలిచానంటే చక్కని షాట్లు ఆడగలనని, పరుగులు చేయగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు.

పొట్టి క్రికెట్లో నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచీకి పరిమితమైన ధావన్‌పై తొలి వన్డేలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. పైగా ఇంగ్లిష్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్తులో బంతులు విసిరి స్వింగ్‌ చేశారు. ఈ క్రమంలో నిలకడగా ఆడిన గబ్బర్‌ 98 పరుగులు సాధించాడు. ఈ మ్యాచులో ఇంగ్లాండ్‌కు భారత్‌ 318 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. 66 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. టీ20ల్లో చోటు దొరకనప్పుడు తాను సానుకూలంగా ఉన్నానని గబ్బర్‌ తెలిపాడు.

‘టీ20 సిరీస్‌ ఆడనప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. నా బ్యాటింగ్‌ ప్రక్రియ, ఫిట్‌నెస్‌, నైపుణ్యాలు, కసరత్తులపై దృష్టి సారించాను. మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. ఎదురయ్యే ప్రతి సందర్భం నుంచి సానుకూలతనే తీసుకుంటాను. నెనెప్పుడూ ఇలాగే ఉంటాను. ఖాళీ సమయంలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాను. అవకాశం వస్తే పరుగులు చేస్తానని నాకు తెలుసు’ అని శిఖర్‌ తెలిపాడు.

పుణె పిచ్‌పై ఆరంభంలో దూకుడుగా ఆడితే వికెట్లు పోతాయని ధావన్‌ అన్నాడు. అందుకే మంచి బంతుల్ని గౌరవించాలని తాను, రోహిత్‌ నిర్ణయించుకున్నామని తెలిపాడు. క్రీజులో నిలదొక్కుకుంటే మ్యాచ్‌ సాగే కొద్దీ పరుగుల వరద పారించొచ్చని తమకు తెలుసన్నాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాళ్లకు దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌ అనుభవం ఉపయోగపడుతోందని వివరించాడు.

గొప్ప గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం కుర్రాళ్లకు మేలు చేస్తోందని గబ్బర్‌ పేర్కొన్నాడు. కృనాల్‌ పాండ్య, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఆత్మవిశ్వాసంగా ఉండటానికి ఇదే కారణమన్నాడు. కేఎల్‌ రాహుల్‌ క్లాస్‌ ఆటగాడని, కృనాల్‌తో కలిసి మెరుపులు మెరిపించడంతోనే టీమ్‌ఇండియా 317 పరుగులు చేసిందని వివరించాడు. రాహుల్‌ సొగసైన సిక్సర్లతో అలరించాడని ప్రశంసించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని