151మంది ఎమ్మెల్యేలున్నా భయమెందుకు?: పవన్‌ - janasena chief pawan kalyan on panchayat eletions
close
Published : 17/02/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

151మంది ఎమ్మెల్యేలున్నా భయమెందుకు?: పవన్‌

అమరావతి: గ్రామీణ స్థాయిలో జనసేన బలంగా ఉందనే విషయాన్ని ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల గణంకాలే రుజువు చేస్తున్నాయని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మొదటి విడతలో 18శాతానికి పైగా ఓట్లు వస్తే.. రెండో విడతలో అది 22శాతం దాటిందని అభిప్రాయపడ్డారు. పార్టీ భావజాలం, పార్టీ శ్రేణుల మద్దతుతో రెండో దశలో 250కి పైగా సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు గెలిచామన్నారు. 1,500పైగా పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచామని.. 1,500 వార్డులను కైవసం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు పవన్‌ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రలోభాలకు తట్టుకొని నిలబడటం గర్వకారణం

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని యువత, ఆడపడుచులు నిలబడటం నిజంగా గర్వకారణమంటూ వారికి పవన్‌ అభినందనలు తెలిపారు. పోటీలో నిలిచినవారికి జనసైనికులు, నాయకులూ అండగా నిలిచారని.. జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందన్నారు.  గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటూ వాళ్లతో బెదిరింపులకు దిగుతున్నారని.. కొన్ని చోట్ల ప్రత్యర్థులను కూడా అపహరిస్తున్నారని విమర్శించారు. కడప జిల్లాలో జనసేన పార్టీ మద్దతుదారుడిని కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.  రెండో విడత ఎన్నికల్లో రాష్ట్రంలో పలుచోట్ల జనసేన జెండా రెపరెపలాడటం సంతోషాన్నిచ్చిందన్నారు. ఏ రకంగా చూసినా ఏకగ్రీవాలు మంచిది కాదని.. పోటీతత్వం ఉండాలన్నారు. మిగతా రెండు విడతల్లోనూ పార్టీ నాయకులు, జన సైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పవన్‌ ఆకాంక్షించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని