లాక్‌డౌన్‌ భయాలు.. సొంతూళ్లకు కూలీలు - lockdown fears
close
Published : 09/04/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ భయాలు.. సొంతూళ్లకు కూలీలు

3 రోజుల్లోనే ముంబయిని వీడిన 4.5 లక్షల మంది

ముంబయి: కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరడంతో నగరాల్లోని వలస కూలీల్లో దడ పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జనజీవనంపై ఆంక్షలు, రాత్రి పూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ పరిస్థితులు చూసి మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తారన్న భయాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముంబయిలోని కూలీలు పెద్దఎత్తున సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గత మూడు రోజుల్లోనే 4.55 లక్షల మందికి పైగా సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు. అన్ని రైల్వే టెర్మినల్స్‌ వీరితోనే కిటకిటలాడుతున్నాయి. ముంబయి నుంచి బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్‌ వెళ్లే రైళ్ల బెర్తులన్నీ నిండిపోయాయి. 

పుణె నుంచి సైతం..
పుణె నుంచి కూడా పెద్దఎత్తున కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక్కడినుంచి బిహార్, దిల్లీ వైపు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు కరోనా కట్టడికి ఉత్తర్‌ప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. మధ్యప్రదేశ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌ ప్రకటించారు. తమిళనాడులోనూ  ఆంక్షలు కఠినతరం చేశారు. 

 కేరళ సీఎం విజయన్‌కు కొవిడ్‌
 తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(75)కు కొవిడ్‌-19 సోకింది. ఈ విషయాన్ని గురువారం ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. గత నెల్లోనే ఆయన కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఊమెన్‌ చాందీ (77)కూడా కరోనా బారిన పడ్డారు.

 విద్యాసంస్థల్లో కరోనా విజృంభణ
దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని పలు విద్యాసంస్థల్లో వైరస్‌ విజృంభిస్తోంది. సెంట్రల్‌ అకాడమీ ఫర్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ సర్వీస్, డూన్‌ స్కూల్, ఐఐటీ రూర్కీలో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఐఐటీ రూర్కీలో కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య 88కి చేరింది. బుధవారం సెంట్రల్‌ అకాడమీ ఫర్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో 14 మంది, డూన్‌ స్కూల్‌లో ఒకరు కరోనా బారిన పడ్డారు. దిల్లీలోని సర్‌ గంగారాం ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా సోకింది. 

‘మహారాష్ట్రకు తక్కువ టీకాలు’
ముంబయి: ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాలతో పోల్చితే కొవిడ్‌-19 టీకా డోసులు మహారాష్ట్రకు ఎందుకు తక్కువగా వస్తున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  టీకాల కొరత కారణంగా ముంబయిలో 26 కేంద్రాలను మూసివేశామని, ప్రస్తుతం ఉన్న నిల్వ 1.5 రోజులకు మాత్రమే సరిపోతుందని స్పష్టంచేశారు.  

♦ కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులు ఐదుగురు.. ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయారని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వారి బంధువులు గురువారం రాత్రి ఆందోళన నిర్వహించారు.   

రోజుకు 34.30 లక్షల మందికి టీకాలు
దిల్లీ: దేశంలో రోజుకు సగటున 34,30,502 డోసుల టీకా వేస్తున్నామని, ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్‌ తొలిస్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది. 

బ్రిటన్‌లో కేసుల్లో 60% తగ్గుదల
లండన్‌: కొవిడ్‌-19కి గురవడం, అనంతరం తీవ్ర అస్వస్థత, మరణం సంభవించే పరిస్థితుల మధ్య లంకెను బ్రిటన్‌లో టీకాల కార్యక్రమం తెంచివేస్తున్నట్లు మహమ్మారి తీరుతెన్నులపై ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న అధ్యయనం ఒకటి వెల్లడించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వైరస్‌ విస్తరణను నెమ్మదింపజేయగా, మార్చి నెలలో కొత్త కేసులు 60 శాతం మేర తగ్గినట్లు లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాల పరిశోధకులు గుర్తించారు. 

భారత ప్రయాణికులపై న్యూజిలాండ్‌ తాత్కాలిక నిషేధం!
మెల్‌బోర్న్, వెల్లింగ్టన్‌: భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో.. మన దేశం నుంచి వచ్చే ప్రయాణికులు, పౌరులపై న్యూజిలాండ్‌ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 11 నుంచి 28 వరకు నిషేధం కొనసాగనుందని ఆ దేశ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ పేర్కొన్నారు. ఇటీవల భారత్‌ నుంచి న్యూజిలాండ్‌ వచ్చిన 23 మందిలో 17 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన క్రమంలో ఆ దేశం ఆంక్షలు విధించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని