మహారాష్ట్రలో కరోనా మరో కొత్త రికార్డు!   - maharastra delhi covid cases update
close
Published : 06/04/2021 22:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కరోనా మరో కొత్త రికార్డు!  

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ పైపైకి పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం ఒక్కరోజే 55వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఓ వైపు కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తున్నా.. మరోవైపు, టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న వేళ ఇంత భారీగా కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. ఇప్పటికే పలు ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతుండటంతో పడకలు, ఆక్సిజన్‌ కొరత ఎదురవుతున్న వేళ తాజాగా నమోదైన కొత్త కేసులతో మహారాష్ట్రలో మరింత అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 55,469 కొత్త కేసులు, 297 మరణాలు వెలుగు చూశాయి. అలాగే, తాజాగా మరో 34,256మంది కోలుకొన్నారు. దీంతో దేశంలో కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మహారాష్ట్రలో 2,09,17,486 శాంపిల్స్‌ పరీక్షించగా.. 31,13,354 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 25,83,331మంది కోలుకోగా.. 56,330మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,72,283 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఒక్క ముంబయిలోనే 10వేల కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక్కరోజులో 47,922 పరీక్షలు చేయగా.. 10,030 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 7019 మంది కోలుకోగా.. 31 మంది మరణించినట్టు బీఎంసీ వెల్లడించింది. దీంతో ముంబయిలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4,72,332కి చేరగా.. మరణాల సంఖ్య 11828కి పెరిగింది. నగరంలో ప్రస్తుతం 77,495 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 81శాతంగా ఉండగా.. కొవిడ్‌ కేసుల డబ్లింగ్‌ రేటు 38 రోజులుగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

దిల్లీలోనూ ఆగని వైరస్‌

మరోవైపు, దిల్లీలోనూ కరోనా ఉద్ధృతి ఆగడంలేదు. కొత్తగా రికార్డు స్థాయిలో 5100 కొత్త కేసులు నమోదయ్యాయి. దిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24గంటల వ్యవధిలో 1,03,452 శాంపిల్స్‌ పరీక్షించగా (వీటిలో 69,667 ఆర్టీపీసీఆర్‌ పరీక్షలే).. 5100 మందిలో వైరస్‌ నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా మరో 17మంది మరణించగా.. 2340మంది కోలుకున్నారు. దిల్లీలో రికవరీ రేటు 95.84శాతం ఉండగా.. మరణాల రేటు 1.62శాతంగా ఉంది. నగరంలో ప్రస్తుతం 17,332 క్రియాశీల కేసులు ఉన్నాయి.  దిల్లీలో కొవిడ్‌ విజృంభణకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఏప్రిల్ 30 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని