ఆ మిడిల్‌ క్లాస్‌ కష్టాలు... నావే మరి! - middle class melodies director vinod special interview
close
Updated : 13/12/2020 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మిడిల్‌ క్లాస్‌ కష్టాలు... నావే మరి!

సినిమా తన కమర్షియల్‌ హంగుల్ని కాస్త పక్కనపెట్టి కళగా మారే సందర్భం అరుదుగానే జరుగుతుంటుంది. ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’తో ఆ కళని వినోదాత్మకంగానే సాధించి చూపాడు వినోద్‌ అనంతోజు. గుంటూరుని- దాని దుమ్మూధూళీ సహా, అక్కడి మనుషుల్ని- వాళ్ల వెలుగునీడలు సహా యథాతథంగా తెరపైకి తెచ్చి మెప్పించాడు. జంధ్యాల, బాపూరమణలు గీసిన మధ్యతరగతి మందహాస రేఖలకి నవతరం రంగులద్దాడు. ఇంతకీ ముప్పైఏళ్ల వయసు కూడాలేని వినోద్‌ జీవితాన్ని అంత లోతుగా ఎలా చూడగలిగాడూ అన్న ప్రశ్నకి అతనిచ్చే జవాబిది...

నేనే కాదు... ఏ దర్శకుడికైనా తన తొలి సినిమాలోని పాత్రలకీ అతని జీవితానికీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆ పాత్రల్లో ఎక్కడో చోట ఈ దర్శకుడి స్వభావం బయటపడుతుంటుంది. ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ సినిమాలోని హీరో యథాతథంగా నేను కాకపోవచ్చు కానీ అతను చేసిన పోరాటంలో నా అనుభవాలున్నాయి. అతని ఆవేశంలో నా ఉద్వేగాలు కలిసున్నాయి. ‘బొంబాయి చట్నీ’ అనే ఒక్క వంటకమే ప్రధాన ఆధారంగా చేసుకుని తన జీవితంలో అతిపెద్ద రిస్కు తీసుకుంటాడు మా హీరో రాఘవ. నేనూ అంతే. ‘కథ రాయగలగడం’ అనే ఒక్క అర్హతతోనే అసలైన జీవన పోరాటంలోకి దూకాను. మా హీరో రాఘవకి బొంబాయి చట్నీని పరిచయం చేసింది వాళ్లమ్మయితే... నాకు ఈ కథల పిచ్చికి కారణమైంది మా నాన్నగారు ఏఎమ్మార్‌ ఆనంద్‌. చిన్నప్పుడు అక్షరాలు కూడబలుక్కుని చదివేనాటికే కథల పుస్తకాలని నా చేతికిచ్చారు నాన్న. పఠనాన్ని నా రోజువారి జీవితంలో భాగం చేశారు. ఆయన గుంటూరు విశాలాంధ్ర పుస్తకాల షాపులో ఉద్యోగిగా ఉండేవారు. మా ఇంట్లో ఉన్న పుస్తకాలు కాకుండా సెలవులప్పుడు నేనూ, మా అక్కా విశాలాంధ్ర షాపుకి వెళ్లి కూర్చుని చదువుతుండేవాళ్లం. చందమామలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ, కాశీ మజిలీ కథల దశ దాటాక నన్ను కట్టిపడేసిన రచయిత మార్క్‌ట్వెయిన్‌. రాజు-పేద, టామ్‌ సాయర్‌, హకిల్‌బెరీఫిన్‌ ఇలా ఆయన రచనలన్నీ నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. చిన్నపిల్లల చుట్టూ తిరిగే ఆయన కథల స్ఫూర్తితోనే ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నేనో కథ రాశాను. తల్లిదండ్రులతోపాటూ విదేశాల్లో పర్యటనకెళ్లి తప్పిపోయే కుర్రాడి కథ అది. దాన్ని మా ఫ్రెండ్స్‌కి చదివి వినిపిస్తే ‘భలే రాశావే’ అన్నారు. అప్పటి నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా రాయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత దశల్లో చదివిన ‘ఏడుతరాలు’ అనువాద నవలల్లాంటివి నా జీవన దృక్పథాన్ని మార్చాయి. ఏది రాసినా జీవితాన్ని పైపైన కాకుండా... లోతుగా చూపించాలన్నది వాళ్ల నుంచే నేర్చుకున్నాను. బయటి పుస్తకాలు ఇన్ని చదువుతున్నా ఇంటర్‌లోనూ, ఎంసెట్‌లోనూ మంచి మార్కులే సాధించి బాపట్ల ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో చేరాను. బీటెక్‌ రెండో సంవత్సరం నుంచి నా కథలకి దృశ్యరూపం ఇవ్వాలనే ఆలోచన మొదలుకావడంతో షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం ప్రారంభించాను. ‘ఇట్లు మీ రూపాయి!’ అనే షార్ట్‌ఫిల్మ్‌ పలు కాలేజీ ఉత్సవాల్లో అవార్డులు సాధించింది. ఆ ప్రోత్సాహంతో మరో మూడు షార్ట్‌ఫిల్మ్‌లు తీశాను. ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన బలపడింది. కాకపోతే, కాలేజీ నుంచి బయటకొచ్చాక కానీ నాకు జీవిత వాస్తవాలు తెలియలేదు. అప్పటిదాకా గాలిలో మేడలు కట్టుకుంటున్నాననే విషయం అర్థంకాలేదు!

ఐటీ ఉద్యోగిగా...
నా ఇంజినీరింగ్‌, మా అక్కయ్య ఎంసీఏ చదవడం కోసం తీసుకున్న ‘ఎడ్యుకేషనల్‌ లోన్‌’, ఇతర బాధ్యతలతో ఇద్దరం ఉద్యోగంలో చేరక తప్పలేదు. దాంతో, నాకు ఇష్టం లేకున్నా సరే బెంగళూరు టీసీఎస్‌లో చేరాను. అప్పటికీ ఆశ చావక పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వం కోర్సు కోసం పరీక్ష రాశాను కానీ అది రాలేదు. దాంతో బుద్ధిగా ఉద్యోగినయ్యాను. కాకపోతే పనిలో ఉన్న విపరీతమైన ఒత్తిడి... ఏడాదికే నన్ను ఎంతో నిస్పృహకి లోనుచేసింది. మళ్లీ నేను కథలూ, షార్ట్‌ఫిల్మ్స్‌ వైపు వెళ్తేకానీ మామూలు మనిషిని కాలేను అనిపించి కలం పట్టాను. అప్పట్లో కవి, కథారచయిత పాపినేని శివశంకర్‌ రచనలు ఎక్కువగా చదువుతుండేవాణ్ణి. ఆయనలోని తాత్విక ధోరణి ప్రభావంతో ‘ఓ క్రియేటర్‌గా మనంసమాజానికి ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? చెప్పడం వల్ల సమాజానికున్న లాభమేమిటీ?’ వంటి ప్రశ్నలతో ‘శూన్యం’ అనే కథ రాసి షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. దానికి యూట్యూబ్‌లో 2011లోనే లక్షకుపైగా లైకులొచ్చాయి. అప్పుడే తరుణ్‌ భాస్కర్‌, వెంకట్‌ మహా, వివేక్‌ ఆత్రేయ, స్వరూప్‌... వీళ్లందరూ షార్ట్‌ఫిల్మ్‌ దర్శకులుగా పరిచయమయ్యారు. తెలుగు పరిశ్రమకి కొత్తతరహా సినిమాల్ని పరిచయం చేయాలన్న తహతహ ఉన్న మేమంతా అప్పుడప్పుడూ మేం రాసిన కథల్ని పంచుకుంటూ ఉండేవాళ్లం. ఆ తర్వాత ‘ఒక మరణం’, ‘మగత’ అనే విభిన్న షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాను. వీటన్నింటితో ఉద్యోగంలోని మూసతనం నుంచి బయటపడ్డాను. కాకపోతే, మొదట్లో రెండేళ్లపాటు మాత్రమే చేస్తానన్న ఐటీ ఉద్యోగాన్ని ఏడేళ్లపాటు కొనసాగించక తప్పలేదు. ఈలోపు నాకు పెళ్లైంది.

కులమతాలకి అతీతంగా...
నా భార్య రెహనుమాది ముస్లిం కుటుంబం. మా కాలేజీలోనే చదువుకుంది కానీ తనది వేరే డిపార్ట్‌మెంట్‌. చదువుకునే రోజుల్లో పరిచయం తప్ప... ఒకరిపైన ఒకరికి పెద్దగా ఇష్టం ఉన్నట్టు అనిపించలేదు. ఆ ఇష్టం ఏర్పడింది తనూ నాతోపాటూ టీసీఎస్‌లో చేరాక. సహోద్యోగిగా తన చొరవా, మంచితనం, మాటతీరూ, తను పంచే ఆత్మీయతా నాకెంతో నచ్చాయి. క్రియేటివ్‌ ఫీల్డువైపు వెళ్లాలనుకున్న నాకు తనూ, తను అందించే ప్రోత్సాహం లేకపోతే జీవితం పెద్ద శూన్యంగా మిగులుతుందనే భావన కలిగింది. దాంతో తననే చేసుకుంటానని ఇంట్లో చెప్పాను. నేనూహించినట్టే మా ఇంట్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు. రెహనుమా ఇంట్లోనూ పెద్దగా వ్యతిరేకించలేదుకానీ... వెంటనే ఏ నిర్ణయమూ చెప్పలేదు. దాంతో ఆరునెలలపాటు ఇద్దరం ఆందోళనగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాతే మాకు పచ్చజెండా ఊపారు. సంసారంలో పడ్డాక ఉద్యోగం మానేయడంపైన కొంత తటపటాయించాను కానీ... అప్పుడు రెహనుమానే నాకు ధైర్యాన్నిచ్చింది. కుటుంబ భారం తను మోయడానికి సిద్ధపడింది. అలా తన భరోసాతోనే 2017లో ఉద్యోగం నుంచి బయటకొచ్చాను. అప్పటిదాకా నేను చూసిన జీవితం ఒకెత్తయితే... నాటి నుంచి నేను చూసిన ఈ మూడేళ్ల జీవితం ఒకెత్తు. అదో మానసిక యుద్ధం... కాకపోతే అందులో నాపైన నేనే పోరాడాల్సి వచ్చింది!

డిప్రెషన్‌లోకి...
నేను ఉద్యోగం మానేసి సినిమాలవైపు వెళ్లీవెళ్లగానే రాచమర్యాదలతో అవకాశాలు ఇస్తారనుకోలేదుకానీ... ఏడాదిలోపైనా మంచి అవకాశాలు వస్తాయనే అనుకున్నాను. ఎక్కడికెళ్లాలో ఎవర్ని కలవాలో బొత్తిగా తెలియకుండానే ప్రయత్నాలు ప్రారంభించాను. నేను కలిసిన ఏ నిర్మాతో, హీరోనో ‘మీ దగ్గర ఏమైనా క్రైమ్‌ థ్రిల్లర్‌ కథ ఉందా?’ అని అడగ్గానే దాన్ని రాయడానికి కూర్చునేవాణ్ణి.
ఇంకొకరెవరైనా ‘కామెడీ హారర్‌ కావాలి!’ అనగానే దానికోసం ప్రయత్నించేవాణ్ణి. మనసుకి తోచిందేదో రాసేవాణ్ణి కానీ... అందులో జీవం ఉండేది కాదు. నేను కథల్లో కోరుకునే లోతూ, సహజత్వం, జీవితం... ఇవేవీ వచ్చేవి కావు. ఓ దశలో నా సృజనపైన నాకు నమ్మకం పోయింది. దాంతో నా కథలన్నీ రిజెక్ట్‌ అయ్యాయి. ఓ వైపు అవకాశాలు రాక, మరోవైపు నాపైన నాకు నమ్మకం లేక కుమిలిపోయేవాణ్ణి.
ఆ అశక్తత కోపంగానూ, దుఃఖంగానూ ఉబికొచ్చేది. ఆ కోపం సంసారంలో చిటపటలు రేపితే... దుఃఖం సెల్ఫ్‌పిటీ అనే అథోపాతాళంలోకి నన్ను నెట్టేసింది. వీటన్నింటితో డిప్రెషన్‌ అంచులదాకా వెళ్లాను. కేవలం నా భార్య సహనం... అమ్మానాన్నల ఓదార్పులే నన్ను మరింతగా కుంగిపోనీయకుండా కాపాడాయి. ఒక దశలో సైకియాట్రిస్టునీ చూశాను. వాళ్ల మానసిక విశ్లేషణ... నన్ను నేను పరిశీలించుకునేలా చేసింది.

నేలకి దిగొచ్చాను...
నా సినిమాలో హీరోయిన్‌ సంధ్య హీరో రాఘవతో ‘నీ బొంబాయి చట్నీ మరీ అంత బాగోదు బావా... కాస్త నేలకి దిగిరా!’ అంటుంది. ఒకప్పుడు నా జీవితానుభవాలు  కూడా నాతో ఇదే మాట చెప్పాయి... ‘నేను ఏ కథనైనా రాసి మెప్పించగలను’ అనే అతివిశ్వాసాన్ని వదిలెయ్‌. నువ్వు మాత్రమే చెప్పగల కథల్ని ఎన్నుకో!’ అని. అప్పటికే తరుణ్‌ భాస్కర్‌ హైదరాబాద్‌ జీవితాన్ని అతి సహజంగా చూపిస్తూ ‘పెళ్ళి చూపులు’ తీశాడు. ‘హైపర్‌ లోకల్‌’ కాన్సెప్ట్‌తో కొత్త తరహా కథాకథనాలని పరిచయం చేయడమే కాదు... అతితక్కువ బడ్జెట్‌తో సినిమాని ఎలా తీయాలో కూడా చేసి చూపాడు. ఆ తర్వాత విశాఖ జీవితాల ఆధారంగా వెంకట్‌ మహా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ వంటివి వచ్చాయి.

ఆ సినిమాలిచ్చిన నమ్మకంతో ‘మనం కూడా అలాగే మనకు తెలిసిన జీవితాలని చూపిద్దాం’ అనిపించింది. నా ఆలోచనని జనార్దన్‌ పసుమర్తితోనూ పంచుకున్నాను. తను నా కాలేజీమేట్‌... ఐటీ ఉద్యోగం చేస్తూ కథలూ రాస్తుండేవాడు. ఇద్దరం కలిసి అనేక కథల గురించి మాట్లాడుకునేటప్పుడే ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడిస్‌’ ఆలోచన వచ్చింది. నేను పుట్టి పెరిగిన గుంటూరు శ్రీనగర్‌ వాసులు నా పాత్రలుగా మారడం మొదలుపెట్టారు! జనార్దన్‌ వాళ్ల ఊరు వలపర్లలో రాఘవరావు అనే వ్యక్తి స్ఫూర్తితో నా కథ హీరో రాఘవని సృష్టించాము. ఈ కథని కూడా ఎంతోమంది తిరస్కరించారుకానీ... ఒకప్పటిలా ఇప్పుడు నాపైన నేను నమ్మకం కోల్పోలేదు. తిరస్కరణలు నాలో పట్టుదలని మరింతగా పెంచాయి. ఆ పట్టుదల ఫలించి భవ్యా క్రియేషన్స్‌ సంస్థ నిర్మించడానికి ముందుకొచ్చింది.

 

ఒక్క పాత్రకి 20 మంది!
గుంటూరు జీవితాన్ని అత్యంత సహజంగా చూపించాలంటే... ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇవ్వాలంటే... ప్రతి పాత్రలోనూ కొత్తవాళ్లే ఉండితీరాలని అనుకున్నాను. అందుకోసం గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలతోపాటూ హైదరాబాద్‌లోనూ రంగస్థల నటుల కోసం వేట మొదలుపెట్టాం. దాదాపు రెండొందల మంది చేత ఆడిషన్స్‌ చేయించాం. సినిమాలోని ప్రతి పాత్రకీ కనీసం 20 మందినైనా ఆడిషన్స్‌ చేసి ఉంటాం. తరుణ్‌భాస్కర్‌ ద్వారా ఆనంద్‌ దేవరకొండని హీరో పాత్రకి ఎంపిక చేసుకున్నాం. అలా నటుల్ని సెలెక్ట్‌ చేసుకున్నాక గుంటూరు వేషభాషలపైన రెండు నెలలు వర్క్‌షాప్స్‌ పెట్టాను. అంత పకడ్బందీగా తయారయ్యాం కాబట్టే 2019 ఆగస్టు నుంచి కేవలం నాలుగునెలల్లోనే షూటింగ్‌ పూర్తిచేయ గలిగాను. ఫిబ్రవరిలోపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా ముగించాం. ఇక రిలీజే తరువాయి అనుకుంటుండగానే కరోనా లాక్‌డౌన్‌ పడింది. థియేటర్‌లు తెరుస్తారని ఎదురుచూసి చూసి... ఇక ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకెళితే మంచిదని చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌కి ఇచ్చేశాం. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రశంసలు మొదలయ్యాయి. రెండోరోజు ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారు ఫోన్‌ చేసి ‘అసలు ఆ లైవ్‌ లొకేషన్స్‌లో అంత బాగా ఎలా షూట్‌ చేశారయ్యా!’ అంటూ ఎన్నో ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. భారతీయ వెండితెరపైన అద్భుత ప్రయోగాలు చేసిన ఆయన అలా అడుగుతుంటే ప్రతి ప్రశ్నా ఓ ప్రశంసగానే అనిపించింది నాకు!


ఆత్మీయతని నేర్పారు...

నాన్నగారు నాకు మేధోపరమైన వికాసాన్ని నేర్పితే... మా అమ్మ విజయలక్ష్మీ, అక్క చైతన్యలు ఆత్మీయతని నేర్పారు. ఎదుటివారిలో వెయ్యి లోపాలున్నా ఆర్ద్రంగా మాట్లాడటం వాళ్ల నుంచే నేర్చుకున్నాను. మా ఆవిడ వీటికి అంతులేని ఓర్పునీ జోడించడమెలాగో చూపించింది. నాకు ఇలాంటి పాఠాలు నేర్పుతున్నవాళ్ల వరసలో రెండేళ్లకిందట మరో చిట్టితల్లి వచ్చి చేరింది. తనే మా పాప వెన్నెల. ఈ నలుగురూ ఉంటే చాలు... జీవితంలో ఎలాంటి అవాంతరాలనైనా ఎదుర్కోగలననే నమ్మకం నాకొచ్చింది ఇప్పుడు!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని