ఇంట్లోనే ఈ పోషకాలుండగా.. కాబోయే అమ్మకు భయమేల?! - national nutrition month nutritional diet for pregnant women in telugu
close
Updated : 03/09/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లోనే ఈ పోషకాలుండగా.. కాబోయే అమ్మకు భయమేల?!

శ్రీవల్లికి ఇప్పుడు ఏడో నెల.. తనకు ముందునుంచీ రక్తం కాస్త తక్కువగా ఉండడంతో డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌ సప్లిమెంట్స్‌ వాడుతోంది.. ఇంజెక్షన్స్‌ తీసుకుంటోంది. వీటితో పాటు ఐరన్‌ ఎక్కువగా లభించే ఆహార పదార్థాల కోసం ఆన్‌లైన్‌లో వెతికింది. కానీ వాటిలోనూ తనకెన్నో అనుమానాలు..

ఇలా కాబోయే అమ్మలు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా తమ కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఎదుగుదల గురించే అనుక్షణం ఆలోచిస్తుంది అమ్మ మనసు. అయితే ఇలా కాబోయే తల్లులందరికీ తాము తీసుకునే పోషకాహారం విషయంలో పూర్తి అవగాహన ఉండచ్చు.. ఉండకపోవచ్చు! అలాగని దీని గురించి అంతగా ఆలోచించాల్సిన, భయపడాల్సిన పనిలేదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన వంటింట్లోనే వివిధ పోషకాలతో కూడిన పదార్ధాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మరి, ‘జాతీయ పోషకాహార వారం’ సందర్భంగా కాబోయే తల్లులు తీసుకోవాల్సిన కొన్ని పోషకాలేంటో తెలుసుకుందాం రండి..

ఇటు ఇంటి పని, అటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. మహిళలకు క్షణం కూడా తీరిక లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో వారు ప్రశాంతంగా భోజనం చేసేందుకు కూడా సమయం దొరకడం లేదు. దీనికి తోడు సమయం లేక వ్యాయామంపై దృష్టి పెట్టలేకపోతున్నారు కొందరు స్త్రీలు. ఇలాంటి బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల చాలామంది మహిళలు రక్తహీనత, థైరాయిడ్‌, మధుమేహం.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల్ని ఎదుర్కొంటున్నారు. ఇక గర్భం ధరించాక ఈ సమస్యలు వారికి, వారి కడుపులోని బిడ్డకు పెను శాపాలుగా మారుతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచి పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలోనూ చక్కటి ఆహారపుటలవాట్లు అలవర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

‘ఫైబర్‌’తో ఆ సమస్యకు చెక్!

గర్భం ధరించిన మహిళల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మలబద్ధకం. అయితే పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకోసం పప్పులు, బీన్స్‌, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే కొంతమంది సలాడ్స్‌లో భాగంగా పీచు ఎక్కువగా ఉండే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌.. వంటివి పచ్చిగానే తీసుకుంటుంటారు. ఇలా వీటిని పచ్చిగానే తీసుకోవడం వల్ల వీటిలో ఉండే రాఫినోస్‌ అనే ట్రైశాకరైడ్‌ సమ్మేళనాలు విచ్ఛిన్నం చెందక కడుపులో గ్యాస్ట్రిక్‌ సమస్యకు కారణమవుతాయి. అందువల్ల వీటిని ఉడికించుకొనే తీసుకోవాలి.. అలా చేయడం వల్ల ట్రైశాకరైడ్‌ సమ్మేళనాలు విచ్ఛిన్నం చెంది త్వరగా జీర్ణమవుతాయి.

క్యాల్షియం కోసం..!

పుట్టబోయే బిడ్డ ఎముకల్ని దృఢంగా తయారుచేసేందుకు క్యాల్షియం సహకరిస్తుంది. గర్భం ధరించిన మహిళలు, పాలిచ్చే తల్లులు.. తల్లీబిడ్డలిద్దరి శారీరక అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్యాల్షియం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో వీరు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్న వయసులో గర్భం ధరించిన మహిళలకు రోజుకు 1300 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు.. వంటివి తల్లులు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ఒకవేళ తల్లి వీగన్‌ అయితే.. పాలకు బదులుగా సోయా పాలు, డ్రైఫ్రూట్స్‌, బ్రకలీ, ఆకుకూరలు.. వంటివి తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి.

‘ఐరన్‌’ లోపం లేకుండా..!

కాబోయే తల్లుల్లో ఐరన్‌ లోపం వల్ల రక్తహీనత తలెత్తడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. తద్వారా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, అది కూడా తక్కువ బరువుతో పుట్టడం, ఒక్కోసారి తల్లుల్లో ఉండే ఈ రక్తహీనత బిడ్డకు ప్రాణాంతకం కావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ముందునుంచే ఐరన్‌ లోపం లేకుండా చూసుకోమని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఆప్రికాట్స్‌, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్‌, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్‌, చిరుధాన్యాలు, గోధుమలు.. వంటివి తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే మాంసం ద్వారా లభించే ఐరన్‌ కంటే కాయగూరలు, పండ్ల ద్వారా వచ్చే ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి మాంసం, గుడ్లు.. వంటివి తీసుకున్నప్పటికీ వాటిని కాయగూరలతో కలిపి తీసుకుంటే శరీరానికి ఐరన్‌ను త్వరగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. ఒకవేళ మీకు మరీ రక్తహీనత ఎక్కువగా ఉంది.. సప్లిమెంట్స్‌, ఇంజెక్షన్స్‌ వాడాలనుకుంటే మాత్రం వైద్యుల సలహా మేరకే వాడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

ఇవి కూడా!

* పుట్టబోయే బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధిలో అయొడిన్ పాత్ర కీలకం. గర్భిణిగా ఉన్న సమయంలో తల్లులు రోజుకు కనీసం 220 మిల్లీగ్రాముల అయొడిన్ ను తీసుకోవడం వల్ల బిడ్డలు చిన్నతనం నుంచే అద్భుతమైన తెలివితేటల్ని కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం జున్ను, పెరుగు, బంగాళాదుంపలు.. వంటి అయొడిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే చేపలు వంటి సముద్రపు ఆహారం తీసుకున్నా వారానికి పావు కిలో కంటే మించకుండా చూసుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా!

* కడుపులో పెరుగుతోన్న బిడ్డ మెదడు, వెన్నెముకలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలంటే తల్లులు ముందు నుంచే ఫోలికామ్లం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇందుకోసం ఆకుకూరలు, బ్రకలీ, తర్బూజా, నట్స్‌, బీన్స్‌.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే వీటితో పాటు వైద్యుల సలహా మేరకు ఫోలికామ్లం సప్లిమెంట్స్‌ని కూడా వాడాల్సి ఉంటుంది.

* గర్భం ధరించిన మహిళలు రోజూ 80-85 మిల్లీగ్రాముల విటమిన్‌ ‘సి’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టొమాటో, ద్రాక్ష, నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం, కివీ.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

 

ఇవి గుర్తుంచుకోండి!

* గర్భస్థ సమయంలో బిడ్డ ఎదుగుదలకు ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన మాంసాహారం తినడం మంచిదే! అయితే కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మాంసం, కోడిగుడ్లు.. వంటివి బాగా ఉడికించుకొని తీసుకోవడం మంచిది. తద్వారా అవి త్వరగా జీర్ణమవుతాయి కూడా!

* ఆహారం ఏ పూటకు ఆ పూటే వేడివేడిగా వండుకొని తీసుకోవాలి. ఉదయం వండినవి సాయంత్రం, రాత్రి వండినవి మరుసటి రోజు వేడి చేసుకొని తినకపోవడమే మంచిది.

* గర్భస్థ సమయంలో మహిళలు పెరిగే బరువు ఆరోగ్యకరంగానే ఉండాలి తప్ప అనారోగ్యకరంగా ఉండకూడదు. ఎందుకంటే అనారోగ్యకరమైన బరువు తల్లీబిడ్డలిద్దరిలో స్థూలకాయానికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చిప్స్‌, బిస్కట్స్‌.. వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే స్వీట్స్‌.. మోతాదుకు మించకుండా చూసుకోవాలి.. లేదంటే వాటిలోని కొవ్వులు, చక్కెరలు తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి మంచివి కావు.

* రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం మంచిది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చల్లటి నీళ్ల కంటే బాగా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే నీళ్లు తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

* వీటితో పాటు నిపుణుల సలహా మేరకు, మీ ఆరోగ్య స్థితిని బట్టి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.

* అలాగే ఫీటల్‌ స్కానింగ్‌, రెగ్యులర్‌ చెకప్స్‌కి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

గమనిక:
గర్భం ధరించిన మహిళలు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన పోషకాహారం గురించి తెలుసుకున్నారు కదా! అయితే ఇవన్నీ ఇంట్లోనే లభించినప్పటికీ, పోషకాలు నిండి ఉన్నప్పటికీ.. ఇంకా వీటిలో కొన్ని తీసుకోవాలా? వద్దా? అన్న సందేహాలు కొంతమంది మహిళల్లో తలెత్తుతుంటాయి. అంతేకాదు.. వీటిలోనూ అన్నీ అందరి శరీరతత్వాలకు సరిపడచ్చు.. సరిపడకపోవచ్చు..! కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి మీకున్న సందేహాలను మీలోనే దాచుకోకుండా.. సంబంధిత నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవడం శ్రేయస్కరం!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని