వీర.. వీర..వీర.. పదివేల పరుగుల ధీర! - sachin odi 10k runs record
close
Published : 31/03/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీర.. వీర..వీర.. పదివేల పరుగుల ధీర!

20 ఏళ్ల  క్రితం మాస్టర్‌ బ్లాస్టర్‌ అరుదైన ఘనత

సచిన్‌.. అభిమానులకు క్రికెట్‌ దేవుడు. యువ క్రికెటర్లకు ఆరాధ్యుడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆయన అందుకోని ఘనత లేదు.. బద్దలు కొట్టని రికార్డు లేదు! ఇప్పుడంటే పదివేల పరుగుల క్లబ్బులో పదుల సంఖ్యలో ఆటగాళ్లు ఉన్నారు గానీ తొలిసారిగా ఆ మైలురాయిని చేరుకుంది మాత్రం మాస్టర్‌ బ్లాస్టరే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (2001, మార్చి 31) తెందూల్కర్‌ ఆ క్లబ్‌లోకి ఘనంగా అడుగుపెట్టారు.

ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియాపై సచిన్‌ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం. ఇండోర్‌లోని నెహ్రూ స్టేడియం ఇందుకు వేదికగా నిలిచింది. మణికట్టు మాంత్రికుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అవతలి ఎండ్‌ నుంచి తొలి వీక్షకుడు అయ్యాడు.

ఆసీస్‌తో ఆ సిరీసులో ఇది మూడో వన్డే. టాస్‌ గెలిచిన వెంటనే ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తిరుగులేని ఫామ్‌లో ఉన్న సచిన్‌.. వీవీఎస్‌ లక్ష్మణ్‌తో కలిసి పరుగుల వరద పారించారు. 199 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. శతకం (139 పరుగులు) అందుకోవడంతో పాటు పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. ఆయన కెరీర్లో ఇది 259వ ఇన్నింగ్స్‌ కావడం ప్రత్యేకం. ఇక ఈ మ్యాచులో టీమ్‌ఇండియా 299/8తో నిలవగా.. అజిత్‌ అగార్కర్‌, హర్భజన్‌ సింగ్‌ చెరో 3 వికెట్లతో విజృంభించడంతో ఆసీస్‌ 188కే ఆలౌటైంది.

అంతర్జాతీయ కెరీర్లో 1989 నుంచి 2013 వరకు అన్ని ఫార్మాట్లు కలిపి 664 మ్యాచులాడిన సచిన్‌ 34,357 పరుగులు సాధించారు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు, 51 శతకాలు బాదేశారు. 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 శతకాలు కొట్టడం గమనార్హం. బహుశా ఈ రికార్డులు బద్దలు కొట్టే ఆటగాడు కోహ్లీ మాత్రమేనని మాజీల అభిప్రాయం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని