సచిన్‌ @ 100 @ 100 @ 9  - sachin tendulkar celebrates 9th anniversary of 100 centuries in international cricket
close
Published : 16/03/2021 23:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్‌ @ 100 @ 100 @ 9 

సంబరాల్లో మునిగిపోయిన క్రికెట్‌ దిగ్గజం

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ ఎవర్‌గ్రీన్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు బాదిన ఏకైక ఆటగాడు. ఈ ఘనత సాధించి నేటికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విశేషకరమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఇండియా లెజెండ్స్‌ ఆటగాళ్లు క్రికెట్‌ దిగ్గజంతో కేక్‌ కోయించారు. రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం రాయ్‌పూర్‌లో ఉన్న లిటిల్‌ మాస్టర్‌ తన అరుదైన ఘనతను తోటి ఆటగాళ్లతో ఇలా కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా ట్విటర్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో టీమ్‌ఇండియా తరఫున సచిన్‌ సాధించని రికార్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన అతడు చివరిసారి 2012 మార్చి 16న వన్డేల్లో 49వ శతకం సాధించాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగానే ఉండటం విశేషం. అయితే, సచిన్‌ వన్డేల్లో చివరి శతకం బాదకముందే టెస్టుల్లో 51 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఇక 2012 ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడిన మ్యాచ్‌లో సచిన్‌(114; 147 బంతుల్లో 12x4, 1x6) మీర్పూర్‌లో తన చివరి మూడంకెల స్కోర్‌ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 289/5 స్కోర్ సాధించింది. అయితే, మరో నాలుగు బంతులు మిగిలుండగానే బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాటి మ్యాచ్‌లో సచిన్‌ ఘనతకు మంగళవారం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా అతడితో మాజీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

మరోవైపు ఇప్పుడు జరుగుతున్న రోడ్‌సేఫ్టీ సిరీస్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ చెలరేగిపోతున్నాడు. మునుపటిలా తన ఫామ్‌ను కొనసాగిస్తూ మైదానంలో వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. తన సహచర ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, ఓజా, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్ పఠాన్‌, కైఫ్‌, మునాఫ్‌ పటేల్‌తో కలిసి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇండియా లెజెండ్స్‌ సెమీఫైనల్‌కు చేరింది. అక్కడా రాణిస్తే ఫైనల్లో చోటు సంపాదించడం ఖాయం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని