Adopt a Heritage: కేంద్రం చొరవతో గండికోటకు మహర్దశ - state monument gandikota gets place in adopt a heritage scheme at kadapa dist
close
Published : 24/07/2021 22:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Adopt a Heritage: కేంద్రం చొరవతో గండికోటకు మహర్దశ

అమరావతి: చారిత్రక వారసత్వ కట్టడమైన కడప జిల్లాలోని గండికోటకు మహర్దశ పట్టనుంది. 'అడాప్ట్ ఎ హెరిటేజ్ ' పథకం జాబితాలో గండికోటను చేరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన జిల్లా వాసుల్లో కొత్త ఆశలకు జీవం పోసింది. అదే దిశగా జిల్లా యంత్రాంగమూ అభివృద్ధి పనులపై ప్రతిపాదనలకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర పురావస్తుశాఖ, పర్యాటకశాఖ పరిధిలో 135 చారిత్రక కట్టడాలు ఉండగా.. గండికోటను అభివృద్ధి చేయడానికి కేంద్రం మందుకు రావడం శుభపరిణామం అని జిల్లా అధికారులు అంటున్నారు.

అయిదేళ్లపాటు కేంద్రం పర్యవేక్షణలో..
కేంద్రం అమలు చేస్తోన్న అడాప్ట్‌ ఎ హెరిటేజ్‌ పథకం కింది చారిత్రక వారసత్వ కట్టడాలు, స్మారక చిహ్నాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం కింద ఎంపికైన వారసత్వ కట్టడాలను అయిదేళ్ల పాటు కేంద్ర పర్యాటక శాక పర్యవేక్షించనుంది. ఈ జాబితాలో కడప జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన గండికోట చేరింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికైన ఏకైక కట్టడం ఇదే కావడం విశేషం. 

గండికోట ప్రత్యేకతలు
క్రీ.శ 1123 జనవరి 9న కళ్యాణి చాళుక్య రాజులు గండికోటను నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు, శాసనాలు తెలుపుతున్నాయి. సువిశాలమైన మైదానం, శత్రుదుర్బేధ్యంగా ప్రాకారాలు, కోటలు గండికోట సొంతం. ఎర్రటి కొండలను చీల్చుతూ పెన్నానది హొయలుపోతుండగా దానికి కుడివైపున గండికోట దర్శనమిస్తుంది.  కొట చుట్టూ ఉన్న మూడు ప్రాకారాలు ఎలాంటి పునాది లేకుండా నిర్మితమై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇందులో 101 బురుజులు ఉన్నాయి. కోటలోపలకు వెళ్లగానే ఎర్రచెరువు, దాని పక్కనే జుమ్మా మసీదు దర్శనమిస్తాయి. ఈ కోటలో ప్రముఖంగా రంగనాయక స్వామి, మాధవరాయ స్వామి సహా 21 ఆలయాలు ఉన్నాయి. 

కేంద్ర సాయంతో మరింత అభివృద్ధి
ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మూడు రోజులపాటు  గండికోట ఉత్సవాలు నిర్వహస్తారు. జాతీయ అడ్వెంచర్‌ అకాడెమీ ఇక్కడ స్థాపించారు. భూమి, ఆకాశం, నీటిలో విన్యాసాలు చేసే విధంగా ఈ అడ్వెంచర్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేంద్రం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో గండికోట మరింత ఆకర్షణీయంగా తయారవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. పర్యటకులకు హోటళ్లు, రహదారుల వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. కోటను అభివృద్ధి చేయాలంటే.. అక్కడ ఉన్న దాదాపు 200 మంది స్థానికులకు వేరే చోట ఇళ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానూ జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గండికోట చుట్టూ అభివృద్ధికి అనుకూలమైన 4,300 ఎకరాల స్థలం ఉందని రెవెన్యూ అధికారులు నివేదికను కేంద్రానికి సమర్పించారు. జమ్మలమడుగు నుంచి 14 కి.మీ దూరంలో ఉండే గండికోటలో ఇప్పటికే దాల్మియా సిమెంట్‌ సీఎస్‌ఆర్‌ కింద తాత్కాలికంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. కేంద్ర పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే గండికోట మరింత అభివృద్ధి చెందుతుందని చరిత్రకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని