కష్టకాలంలో భారత్‌కు తోడుగా ఉంటాం: ఫ్రాన్స్‌ - we will win together macrons message in hindi
close
Published : 28/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కష్టకాలంలో భారత్‌కు తోడుగా ఉంటాం: ఫ్రాన్స్‌

హిందీలో సంఘీభావం తెలిపిన అధ్యక్షుడు మాక్రాన్‌
కరోనాపై ఇరుదేశాలు విజయం సాధిస్తాయని ధీమా

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో సతమతమవుతున్న వేళ భారత్‌కు తోడుగా ఉంటామని ఫ్రాన్స్‌ ప్రకటించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కావాల్సిన వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ కంటైనర్లతో పాటు ఆక్సిజన్‌ జనరేటర్లను తమ వంతు సహాయంగా భారత్‌కు పంపిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌పై చేస్తున్న పోరులో ఇరుదేశాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేసిన మాక్రాన్‌, భారత్‌కు సంఘీభావం తెలుపుతూ తన ఫేస్‌బుక్‌ పేజీలో హిందీలో పోస్టు చేశారు.

‘కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం ప్రతి దేశం మీద ఉంది. ఇక భారత్‌ కూడా చాలా క్లిష్టమైన దశలో ఉందని మాకు తెలుసు. భారత్, ఫ్రాన్స్‌ ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉన్నాయి. ఇలాంటి ఆపద సమయంలో భారత్‌కు మేము చేయగలిగిందంతా చేస్తున్నాం’ అని మాక్రాన్‌ పేర్కొన్నారు. ఇందుకోసం ‘వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఫ్రెంచ్‌ కంపెనీలు కూడా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే వీటన్నింటికీ స్ఫూర్తి. కరోనా పోరులో ఇరు దేశాలు తప్పక విజయం సాధిస్తాయి’ అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌కు సంఘీభావంగా ఇప్పటికే వైద్య పరికరాలు, ఆక్సిజన్‌లను విమాన, జల మార్గాల్లో తరలిస్తున్నామని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా భారత్‌లోని ఫ్రెంచ్ సంస్థలు కూడా ఈ మిషన్‌కు మద్దతు ఇస్తున్నాయని పేర్కొంది. తొలిదశలో భాగంగా 8 ఆక్సిజన్‌ జనరేటర్లు, 5కంటైనర్ల ద్రవ ఆక్సిజన్‌తో పాటు 28 వెంటిలేటర్లను పంపిస్తున్నట్లు తెలిపింది. ఒక్కో ఆక్సిజన్‌ జనరేటర్‌ దాదాపు పదేళ్లపాటు సేవలందించే సామర్థ్యం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

ఇదిలాఉంటే, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్‌కు సహాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు వైద్య పరికరాలను అందిస్తామని వెల్లడించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని