close
టాలీవుడ్‌
అధరాలే మధురంగా కలిసాయె ఏకంగా!

ప్రేమ పాటల్లో కొంచెం కష్టం ఉంటుంది. కొంచెం ఇష్టం ఉంటుంది.
చిన్న చిన్న పదాలు మేళవించి, కవిత్వం రంగరించి, భావుకత అద్దితే... ప్రేమ పాట తయారైపోతుంది.

కాకపోతే ప్రేమ పాటని కొత్తగా మలిచే సందర్భాలే చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. కొత్తగా కలం పట్టే  వారికి ప్రేమ పాటలు రాయడం సవాలే. అయినా దాన్ని స్వీకరించారు యువ గీత  రచయిత రమేష్‌. ‘అశ్వథ్థామ’ కోసం ఆయన రాసిన ‘నిన్నే నిన్నే ఎదలో నిన్నే’ అనే ప్రేమ గీతం యువ హృదయాలను తాకింది. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మెహరీన్‌ నాయిక. ఈనెల 31న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ పాట గురించి రచయిత రమేష్‌ ఏమన్నారంటే...

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
గానం: అర్మాన్‌ మాలిక్‌, యామిని ఘంటసాల,

రచన: రమేష్‌
పల్లవి: నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నే వేచానులే..
అలుపే రాదే, అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే
అధరాలే మధురంగా కలిసాయే ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా
అమవాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా
నీలో నను చూసాకే నను నేనే మరిచానుగా

చరణం: నా గుండెల్లో ప్రియరాగాలే
మోగే నీ కను సైగల్లో
నా కన్నుల్లో చెలి అందాలే
నలిగే నీ నడుం ఒంపుల్లో
కలలో ఇలలో ప్రతి ఊహల్లో
నువ్వే నా కనుపాపల్లో
మొదలో తుదలో ప్రతి ఘడియల్లో
చెలియా నువ్వే నాలో ।।అధరాలే।।
నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నే వేచానులే..
అలుపే రాదే, అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే

‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. కథలు రాయడం నా హాబీ. నాలో ఓ గీత రచయిత ఉన్నాడని గుర్తించిన వ్యక్తి శ్రీచరణ్‌ పాకాల. ఆయన సంగీతం అందించిన ‘ఇదం జగత్‌’లో ఓ పాట రాశాను. ‘అశ్వథ్థామ’ నా రెండో సినిమా. ఐదేళ్ల తరవాత విదేశాల నుంచి కథానాయకుడు తిరిగొస్తాడు. తన ప్రేయసిని చూడాలని తహతహలాడుతుంటాడు. ఈ సందర్భంలో వచ్చే గీతమిది. పాట ఎలా తీయబోతున్నారు? ఎక్కడ తెరకెక్కిస్తారు? అనే విషయాల్ని దర్శకుడు నాతో చెప్పారు. అవన్నీ ఊహించుకుంటూ రాసిన గీతమిది.
‘అనవసరంగా ఇంగ్లిషు పదాలు వాడొద్దు’ అని దర్శకుడు చెప్పడంతో అసలు అవేం రాకుండా జాగ్రత్త పడ్డాను. మనకు భాష తెలుసు కదా అని గ్రాంథిక పదాలు, పెద్ద పెద్ద ప్రయోగాలూ వాడితే శ్రోతలకు నచ్చడం లేదు. భాష చాలా సౌమ్యంగా ఉండాలి. చిన్న చిన్న పదాలతో పాట అల్లితే అందంగా ఉంటుంది. అందుకే నేనూ ఆ దారిలోనే వెళ్లాను. కేవలం రెండు రోజుల్లో పాట పూర్తయింది. చిన్న చిన్న మార్పులూ చేర్పులూ చేసి, పాట సిద్ధమయ్యేసరికి వారం రోజులు పట్టింది. బాలీవుడ్‌ గాయకుడు అర్మాన్‌ మాలిక్‌ ఈ పాట  పాడుతున్నారని తెలియగానే చాలా సంతోషం వేసింది. ‘అధరాలే మధురంగా కలిసాయే ఏకంగా... విరహాలే దూరంగా నిను చేరంగా’ అనే వాక్యాలు నాకు బాగా నచ్చాయి. ఈ పాటకు వస్తున్న స్పందన బాగుంది. ‘మళ్లీ మళ్లీ నీ పాటే వింటున్నాం’ అని స్నేహితులు చెబుతుంటే మరింత గర్వంగా అనిపిస్తోంది’’.

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.