close
టాలీవుడ్‌
అదేంటో... నాతో నటిస్తే పెళ్లైపోతుంది

హాయ్‌ రీడర్స్‌...

లా ఉన్నారు..? నేను మాత్రం ఈనెల 21 కోసం ఆనందంగా, ఆసక్తిగా   ఎదురుచూస్తున్నా. నా కొత్త సినిమా ‘భీష్మ’ ఆ రోజే విడుదలవుతోంది మరి. ఈ చిత్రానికి ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటూ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. అయితే ఆ ట్యాగ్‌లైన్‌ నాకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటికి నేను సింగిలే కదా? మొన్నే ప్రేమికుల రోజు పండగ చేసుకున్నాం. ఆ రోజు అంతా సరదాగా తమకు ఇష్టమైన వాళ్లతో గడిపారు. నేను మాత్రం... ఇంట్లో బోరింగ్‌గా కూర్చున్నా. ‘ఈరోజు ఎలాగైనా ఓ రొమాంటిక్‌ సినిమా చూసి, అణువణువూ ప్రేమతో నింపుకుందాం’ అనుకున్నా. కానీ సినిమా మొదలైన పది నిమిషాలకే నాకు నీరసం వచ్చేసింది. సరిగ్గా అప్పుడే నాకెవరో కథ చెప్పడానికి వచ్చారు. ఆ సినిమా మూడ్‌లోంచి బయటపడి.. కథ వినడానికి చాలా సమయం పట్టింది. సాయింత్రం స్నేహితురాలితో కలిసి సరదాగా బయటకు వెళ్లా. నితిన్‌ మాత్రం ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అని చెప్పి.. ఎంచక్కా పెళ్లి చేసేసుకుంటున్నాడు. అసలు తన ప్రేమకథ ఎలా మొదలయ్యిందో నాక్కూడా చెప్పలేదు. నిశ్చితార్థం మరో రెండు రోజులు ఉందనగా తన పెళ్లి కబురు చెప్పాడు. అదేంటో నేను  నటించిన బ్రహ్మచారి హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఆమధ్య ఓ కన్నడ సినిమా చేశా. అప్పటికి హీరోకి పెళ్లి కాలేదు. నాతో నటించాక.. పెళ్లి కుదిరింది.

‘భీష్మ’ సినిమా విషయానికొద్దాం... ఈ టైటిల్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంది కదా. కానీ సినిమా సరదాగా ఉంటుంది. ఓ సినిమా ఒప్పుకునే ముందు నేను రెండు విషయాల గురించి ఆలోచిస్తా. ఒకటి... సినిమాలో చూపించే ఏదో ఓ ఎమోషన్‌తో ప్రేక్షకులు కనెక్ట్‌ అవ్వాలి. లేకపోతే.. సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉండాలి. ‘భీష్మ’ రెండో రకం. ఈ సినిమా చూస్తుంటే నవ్వలేక కడుపుబ్బిపోతుంది.


ఆవులు.. గేదెల గురించి బాగా తెలుసు

బ్బింగ్‌ చెప్పేటప్పుడు చాలా ఆస్వాదించా. నాకు ఈ కథంతా తెలుసు కదా. కానీ ‘దీని తరవాతి సీన్‌ ఏంటి..?’ అంటూ దర్శకుడు వెంకీ కుడుములని అడిగి మరీ తెలుసుకుంటూ నటించా. ఇక్కడ వెంకీ కుడుముల గురించి ఒక్క మాట చెప్పుకోవాలి. ‘ఛలో’తో మేమిద్దరం ఒకేసారి తెలుగు తెరకు పరిచయం అయ్యాం. ఆ సినిమా నా కెరీర్‌ని మార్చేసింది. దర్శకుడిగా తనకు చాలా పేరొచ్చింది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ రోజు సెట్లో ఎంత వినయంగా కనిపించారో ఇప్పుడూ అంతే. అసలు విషయం మర్చి పోయాను. ఇందులో నా పేరు చైత్ర. చాలా సరదా అమ్మాయిని. వ్యవసాయం గురించి ఈ సినిమాలో చర్చించారు. అలాగని ‘భరత్‌ అనే నేను’ సినిమా టైపులో కాదు. అంత సీరియెస్‌నెస్‌ ఉండదు. సరదాగా సాగుతుంది. నేనూ వ్యవసాయం కుటుంబం నుంచే వచ్చా. నాన్న టీ ఎస్టేట్‌లు నిర్వహిస్తుంటారు. ఆవులు, గేదెల గురించి నాకు బాగా తెలుసు. మన దేశంలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు. కొందరు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటివి గుర్తొస్తే బాధగా అనిపిస్తుంటుంది.


చమటోడ్చడానికి సిద్ధమే

నితిన్‌ మంచి నటుడు. తన ‘అఆ’ సినిమా చూస్తున్నప్పుడు ‘నేను గనుక సినిమాల్లోకి వెళ్తే ఇంత మంచి కథలు ఎంచుకోవాలి’ అనుకున్నాను. ఇంత త్వరగా నితిన్‌తో పనిచేస్తానని అనుకోలేదు. తను నాకంటే సీనియర్‌ కదా.. ఎలా నడుచుకోవాలో అని భయపడ్డా. కానీ సెట్లో కూల్‌గా ఉంటాడు. తను, వెంకీ.. ఇద్దరూ జోకులు వేసుకుంటూ వాతావరణాన్ని తేలిక చేస్తుంటారు. సెట్లో తాను కాలేజీ విద్యార్థిలా కనిపించాడు. అందుకే షూటింగ్‌ అంతా ఫన్నీగా గడిచిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పాటలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అందులో నా స్టెప్పులు బాగున్నాయిని కామెంట్లు వినిపించాయి. చాలా సంతోషపడ్డాను. అయితే సెట్లో మాత్రం ఒళ్లు హూనం అయిపోయింది. అంత కష్టపడితేగానీ, ఈ స్థాయి ప్రతిఫలం రాదనుకోండి. అందుకే చమటోడ్చడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.


కుక్కబిస్కెట్లు తినలేదు... కొరికానంతే

ఫేమ్‌లో ఉన్నప్పుడు విమర్శలు మామూలే. దాన్నుంచి ఎవరూ పారిపోలేరు. మన ఎదుగు  దలకు అవి కూడా ఉపయోగపడతాయి. నటిని అయ్యాక మరింత ఫిట్‌గా ఉండాలని ఆరాటపడుతున్నాను. మన ఆహార నియమాలను బట్టే రూపు రేఖలు ఆధారపడి ఉంటాయి. అందుకే డైట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. నాకు ఇష్టమైన చాక్లెట్లకు దూరమయ్యా. చాక్లెట్లు అంటే గుర్తొచ్చింది... ‘రష్మిక కుక్క బిస్కెట్లు తింటోంది’ అంటూ ఈమధ్య నితిన్‌ నా సీక్రెట్‌ని బయటపెట్టాడు. నిజానికి నేను కుక్క బిస్లెట్లు తినలేదు. నాకు స్వతహాగానే ప్రతీది తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువ. కుక్క బిస్కెట్ల రుచి ఎలా ఉంటుంది? అనిపించి. జస్ట్‌.. కొరికానంతే. దాన్నే నితిన్‌ హైలెట్‌ చేసేశాడు. నేను కూడా నితిన్‌కి సంబంధించిన ఓ సీక్రెట్‌ని త్వరలోనే బయటపెట్టాలనుకుంటున్నా. అదేంటో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నాకే ఇంకా తెలీదు కాబట్టి. ఈసారి మిమ్మల్ని పలకరించేటప్పుడు కచ్చితంగా చెబుతా. ఉంటాను మరి. ఈనెల 21 మాత్రం మర్చిపోకుండా.. మా ‘భీష్మ’ చూడండి. సరదాగా నవ్వుకోండి.

ఇట్లు


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.