తెలుగువాళ్ల ప్రేమాభిమానాలు నా భాగ్యం
close
Updated : 03/01/2020 23:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగువాళ్ల ప్రేమాభిమానాలు నా భాగ్యం

‘దర్బార్‌’ వేడుకలో రజనీకాంత్‌

‘‘తమిళ జనాలు ఎంత ప్రేమిస్తారో, అంతే ప్రేమాభిమానాలు తెలుగువాళ్లు నాకు పంచుతుండడం నా భాగ్యం, నా పూర్వజన్మ సుకృతం. తెలుగు ప్రజలు సినిమా ప్రియులు. మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌. ఆయన నటించిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. నివేదా థామస్, సునీల్‌శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై అల్లిరాజా సుభాస్కరన్‌ నిర్మించారు. అనిరుధ్‌ స్వరకర్త. ఈ నెల 9న ఎన్వీ ప్రసాద్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. ‘‘70 ఏళ్లు వచ్చాయి నాకు. ఇంకా హీరోగా నటిస్తున్నానంటే కారణం ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహం. అదే నాకు శక్తినిస్తోంది. ఇంత ఉత్సాహంగా, సంతోషంగా ఎలా ఉంటారని అడుగుతుంటారు. తక్కువగా ఆశపడండి, తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి, తక్కువగా వ్యాయామం చేయండి, తక్కువగా మాట్లాడండని చెబుతుంటా. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం.

1976 తెలుగులో నా ‘అంతులేని కథ’ విడుదలైంది. అప్పట్నుంచీ ఆదరిస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. సినిమా రసికులు తెలుగు జనాలు. నా సినిమాలు పెదరాయుడు, బాషా, నరసింహ, చంద్రముఖి, రోబో... ఇవన్నీ బాగా ఆడాయంటే రజనీకాంత్‌ ఉన్నాడు కాబట్టే ఆడలేదు, సినిమా బాగుంది కాబట్టి ఆడాయి. అందరూ సినిమా బాగా ఆడాలి, విజయవంతం కావాలనే చేస్తారు. సినిమా చేసేటప్పుడు ఒక మేజిక్‌ జరుగుతుంది. అది మన చేతుల్లో ఉండదు. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఆ మేజిక్‌ మాకు తెలిసిపోయింది. మురుగదాస్‌తో పనిచేయాలని 15ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. అది ఈ సినిమాతో కుదిరింది.

నిర్మాత సుభాస్కరన్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం. ‘బాహుబలి’ తరహాలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అని తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత నేను పోలీస్‌ పాత్రలో నటించిన చిత్రం ‘దర్బార్‌’.  ఆదిత్య అరుణాచలం అనే పాత్ర చేశా. ఎవరికైనా ఈ కథ చెబితే, నిర్మాత ఈ సినిమాకి ఎలా ఒప్పుకున్నాడా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మురుగదాస్‌ స్క్రీన్‌ప్లే, ఆయన కథ చెప్పిన విధానం బాగుంటుంది. అనిరుధ్, సంతోష్‌ శివన్‌ వాళ్ల పనితీరుతో ప్రాణంపోశారు ఈ సినిమాకి. రామ్‌లక్ష్మణ్‌లు యోగులతో సమానం. తిరుపతి ప్రసాద్‌ నాకు ఇరవయ్యేళ్లుగా తెలుసు. సినిమా ఎలా ఆడినా ఒకే రకంగా ఉంటారు. సునీల్‌ శెట్టితో పాటు అందరూ బాగా చేశార’’న్నారు.

రామ్‌లక్ష్మణ్‌ మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌తో సినిమా చేయాలనే కోరిక నెరవేర్చినందుకు మురుగదాస్‌కి కృతజ్ఞతలు. మేం కంపోజ్‌ చేసిన ఫైట్లు చిన్నబోయేలా రజనీసర్‌ పోరాటాలు చేశార’’న్నారు. అనిరుధ్‌ మాట్లాడుతూ ‘‘దర్బార్‌ జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇది. ఎంతోమందికి  స్ఫూర్తినిస్తున్న రజనీకాంత్‌ సర్, దర్శకుడు మురుగదాస్‌లతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. పాటలకి లభిస్తున్న స్పందన ఎంతో ఉత్తేజాన్నిస్తోంద’’న్నారు.

నివేదా థామస్‌ మాట్లాడుతూ ‘‘మనకి ఇష్టమైన కథానాయకులు చాలామంది ఉంటారు. వాళ్లందరూ మెచ్చిననటుడు రజనీకాంత్‌ సర్‌. ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఆస్వాదించండి’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌తో ‘దళపతి’ నుంచి పనిచేస్తున్నా. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ఒకలాగే ఉన్నార’’న్నారు సంతోష్‌ శివన్‌. సునీల్‌శెట్టి మాట్లాడుతూ ‘‘రజనీసర్‌ని అందరూ సూపర్‌స్టార్‌ అంటారు. నేను మాత్రం సినిమా దేవుడు అంటాన’’న్నారు.

మురుగదాస్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ముఖ్యమైన సినిమా ఇది. 13 సినిమాల తర్వాత రజనీకాంత్‌ సర్‌తో చేసే అవకాశం దొరికింది. ఇలాంటి పాన్‌ ఇండియా సినిమా చేయాలంటే మంచి నిర్మాత కావాలి. ఈ చిత్ర నిర్మాత సుభాస్కరన్‌ జీవితంపై ఒక సినిమా చేయొచ్చు. ద్వితీయార్థంలో నాన్‌స్టాప్‌గా చప్పట్లు కొట్టించే ఐదు నిమిషాల ఫైట్‌ ఉంటుంది. పదిహేనేళ్ల కిందట రజనీసర్‌ స్పీడ్, అదే మాస్‌ ఇందులో కనిపిస్తుంది. అనిరుధ్‌ మంచి పాటలు ఇచ్చార’’న్నారు. కార్యక్రమంలో దిల్‌రాజు, వంశీ పైడిపల్లి, మారుతి, హరీష్‌శంకర్, కె.కె.రాధామోహన్, భాస్కరభట్ల, కృష్ణకాంత్, ఠాగూర్‌ మధు, భోగవల్లి ప్రసాద్, దలీప్‌ తాహిల్, యువరాజ్, రవిశంకర్, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని