close
ఇంటర్వ్యూ
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆయన నాకు అన్నయ్య.. కానీ రోజూ గొడవలే!

రెండు క్లోజప్‌లు తీసి.. పనికి రానన్నారు

ఆ దర్శకుడి యాటిట్యూడ్‌ నచ్చింది.. కథ కూడా

‘అలీతో సరదాగా’లో ‘నిరీక్షణ’ అర్చన

‘నిరీక్షణ’తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన నటి అర్చన. 25 ఏళ్ల తరువాత మొదటిసారి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సందడి చేశారు. రంగు తక్కువ అంటూ తొలినాళ్లలో నటిగా తిరస్కరణకు గురైన ఆమె... ఆ తర్వాత వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆమె నట జీవితం ఎలా మొదలైంది, ఎలా గడిచింది, ఎలా బ్రేక్‌ పడింది, ఇప్పుడు ఎందుకు మళ్లీ స్టార్ట్‌ అయ్యింది అనేది ఆమె మాటల్లో... 

ఆలీ: తెరకు దూరం కావడానికి కారణమేమిటి?
అర్చన: ఈ ఆర్టిస్ట్‌తోనే, ఇలాంటి సినిమాలే చేయాలనే ఆలోచన ఉన్న దర్శకులు నాకు దొరికారు. అలాంటి కథలు నా దగ్గరకు వచ్చాయి. ఒక స్టేజ్‌ తర్వాత అలాంటి పాత్రలు కొంతమేర కనుమరుగయ్యాయి. నేను చేసే పాత్రలు చాలా తక్కువగా వచ్చాయి. అలా నేనూ దూరమయ్యాను.

ఆలీ: కమర్షియల్‌ సినిమాల్లో మీకు అవకాశాలు వచ్చాయా?
అర్చన: కమర్షియల్‌ కథలు చేయమని నాకు ఆఫర్స్‌ వచ్చాయి. బాడీ లాంగ్వేజ్‌, మనస్తత్వానికి చక్కగా నప్పే సినిమాలు వస్తే అప్పట్లో నటించాను. సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో అన్ని సినిమాల్లోనూ నటించొచ్చు. కానీ ఒక గుర్తింపు వచ్చాక మనం ఒక బ్రాండ్‌ అవుతాం. అప్పుడు ఒక ఛాయిస్‌ ఉంటుంది. అలా నాకు నచ్చిన సినిమాలే ఎంచుకున్నాను. 

ఆలీ: పాతికేళ్లు ఏమైపోయారు?
అర్చన: గొప్ప గొప్ప దర్శకుల సినిమాల్లో నటించాను. నా సినిమాలు నాకు సంతృప్తినిచ్చాయి. ఐదారు భాషల్లో నటించాను. కొవిడ్‌ లేకపోయి ఉండుంటే నేను నటించిన ఏదో ఒక చిత్రం అమెరికా, లండన్‌ లాంటి ప్రాంతాల్లో ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం అవుతూ ఉంటుంది. నేను నటించిన తెలుగు, తమి, కన్నడ, మలయాళ భాషల్లోని ఎన్నో సినిమాలు ఇప్పటికీ పెస్టివల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. నటిగా నాకు ఇంతకంటే భాగ్యం మరొకటి లేదు.

ఆలీ: విదేశాల్లో మీ సినిమా ప్రదర్శనలు జరిగిన ఫెస్టివల్స్‌కి మీరు వెళ్లారా?
అర్చన: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నన్ను ముఖ్య అతిథిగా అలాంటి ఫెస్టివల్స్‌కు పంపించింది. కళాకారులకు మన దేశం ఇస్తున్న గౌరవం అది. అలా హంగేరీకి వెళ్లాను. శ్రీలంకలో ఓ ఫెస్టివల్‌ను కూడా ఓపెన్‌ చేశాను.

ఆలీ: జాతీయచలన చిత్ర అవార్డుల జ్యూరీలో మీరు సభ్యురాలు కదా?
అర్చన: దక్షిణాదికి చెందిన వాళ్లని జ్యూరీ మెంబర్‌గా ఎన్నుకోవడం గౌరవం. దానిని నేను గౌరవం కంటే ఎక్కువ బాధ్యతగా భావిస్తున్నాను. అదొక ప్రభుత్వ ఉద్యోగంగా భావించి, ఫెస్టివల్‌కి వెళ్లి పని చేశాను. ఆ అవకాశం రావడం నా అదృష్టం.

ఆలీ: తెలుగు కుటుంబానికి చెందిన అర్చన.. తమిళ అమ్మాయిగా ఎలా మారింది?
అర్చన: మాది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఓ ఊరు. నేను 11 నెలల బిడ్డగా ఉన్నప్పుడు మా కుటుంబం తమిళనాడుకి వలస వెళ్లింది. నేను పెరిగింది, చదువు పూర్తి చేసుకున్నది అంతా తమిళనాడులోనే. కాకపోతే అమ్మ తెలుగు మాట్లాడడం నేర్పించింది.

ఆలీ: మీ అసలు పేరు ఏమిటి?
అర్చన: నా అసలు పేరు సుధ. నేను ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి సుధ పేరుతో చాలామంది నటీమణులున్నారు. ముఖ్యంగా జయసుధ అక్క. ఆమె సినిమాలు చూసి ఎంతోమంది నటన నేర్చుకున్నాం. సుధ అనే పేరుతో గొప్ప నటీమణి ఉన్నప్పుడు, అదే పేరుతో ఎందుకు సినిమాల్లో చేయడం అని నా మనసుకు అనిపించింది. ఆ తర్వాత నా గురువు బాలు మహేంద్ర గారితో మాట్లాడి.. ‘అర్చన’గా ప్రేక్షకులకు పరిచయమయ్యాను.

ఆలీ: కథానాయికగా మీ మొదటి సినిమా?
అర్చన: ‘నిరీక్షణ’. ఆ సినిమా కంటే ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాను. కానీ హీరోయిన్‌గా నటించింది, మేజర్‌ రోల్‌ పోషించింది మాత్రం ‘నిరీక్షణ’లోనే. అందుకే ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాను.

ఆలీ: ‘నిరీక్షణ’లో హీరోయిన్‌గా మిమ్మల్నే ఎంచుకోవడానికి గల కారణమేమిటి?
అర్చన: నా గురువు బాలుమహేంద్ర గారే ‘నిరీక్షణ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ముందు ఆయనే నన్ను తమిళ సినిమా ద్వారా వెండితెరకు మొదట పరిచయం చేశారు. ఆయన ‘నిరీక్షణ’ తెరకెక్కించాలని అనుకుంటున్నప్పుడు గిరిజన యువతి పాత్రలో నటించడానికి నేను సరిపోతానని భావించి నాకు ఆ పాత్ర ఇచ్చారు.

ఆలీ: గ్లామర్ రంగంలో గిరిజన యువతిగా పాత్రలు పోషించడం కష్టమే కదా?
అర్చన: అలాంటి సమయంలో ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకుని.. గిరిజన యువతి పాత్రలో నటించడం సాహసమనే చెప్పాలి. నేను ఆ పాత్రకు అంగీకరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా దర్శకుణ్ని నమ్మాను. ఎందుకంటే ఆయన చిత్రీకరించిన ఏ సినిమాలోనూ అశ్లీలత ఉండదు, గ్లామర్‌ అనేది ఉండదు. అందుకే ఏమీ ఆలోచించకుండా అందులో నటించాను. ఆ సినిమా విజయవంతమైంది. నా ఆలోచన కూడా సక్సెస్ అయ్యింది.

ఆలీ: ‘లేడీస్‌ టైలర్‌’ దర్శకుడు వంశీ గురించి ఏమైనా చెప్పగలరు?
అర్చన: ‘నిరీక్షణ’, ‘లేడీస్‌ టైలర్‌’ ఇవన్నీ ఒకే సమయంలో వచ్చిన సినిమాలు. వంశీగారు మంచి వ్యక్తి, అలాగే మంచి దర్శకుడు కూడా.

ఆలీ: మీరు సినిమాలు చూడరా?(నవ్వులు)
అర్చన: సినిమాలు ఎక్కువగా చూస్తాను. కానీ నా సినిమాలు నేను పెద్దగా చూడను. ఏ భాషలోనైనా మంచి సినిమాలు విడుదలైతే చూస్తాను. ‘మహానటి’, ‘జనతా గ్యారేజ్‌’ ఈ మధ్య కాలంలో ఈ రెండు చిత్రాలు నాకు బాగా నచ్చాయి. వేరే లెవల్‌లో ఉన్నాయి. 

ఆలీ: ఈతరం హీరోల్లో తెలుగులో ఏ హీరో నటన మీకు బాగా నచ్చింది?
అర్చన: ‘జనతా గ్యారేజ్‌’ చూసినప్పుడు నాకు తారక్‌ నటన బాగా నచ్చింది. మోహన్‌లాల్‌గారు లాంటి పెద్ద నటుడికి.. ఆయన స్పేస్‌ ఆయనకు ఇచ్చి, ఈయన స్పేస్‌ ఈయన తీసుకొని నటించడం అనేది పెద్ద ఛాలెంజ్‌. తెలుగులో ఇంత మంచి చిత్రాలు వస్తున్నందుకు నేను చాలా సంతోషించాను. 

ఆలీ: మీరు వద్దనుకున్న తెలుగు చిత్రాలు ఏమైనా ఉన్నాయా?
అర్చన: చాలా ఉన్నాయి. కానీ ఎవరిన్నీ బాధపెట్టడం ఇష్టం లేదు, అందుకే చెప్పను. నా దర్శకులు నా కోసం ఎంతో అందమైన స్క్రిప్ట్స్‌ రాసి, నా చేత నటింపజేసి నాకొక పెద్ద గుర్తింపు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. ఆ ఇమేజ్‌ని నేనే బ్రేక్‌ చేయకూడదు కదా. నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నా దర్శకులు ఎంత కష్టపడుంటారు. నన్ను బాలుమహేంద్ర చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేటప్పటికి నేను తిరస్కారానికి గురైన నటిని. అలాంటి నన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, నిలబెట్టారు. అతికొద్ది సమయంలో నాకు రెండు సార్లు జాతీయ అవార్డు లభించింది. అందుకే మంచి చిత్రాలు వస్తే చేయాలి తప్ప ఈ కీర్తిని పాడుచేసుకోకూడదు అని నా మనసుకు అనిపించింది. 

ఆలీ: మిమ్మల్ని తిరస్కరించిన చిత్రాలు ఏవి?
అర్చన: ‘కొత్త అమ్మాయి, సినిమాకే పనికిరాదు, రెండు క్లోజ్‌అప్‌లు తీసిన వెంటనే.. మొహంలో కళ లేదు, మొహమే పనికిరాదు’ అని నన్ను తిరస్కరించారు. అప్పుడు బాలుమహేంద్ర నన్ను పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పటికి ఆయన భారతీయ చలనచిత్ర రంగంలో గొప్ప సినిమాటోగ్రాఫర్‌, ఫిల్మ్‌మేకర్‌. పరిశ్రమలో హీరోకు, నటుడికి, హీరోయిన్‌, రైటర్‌కు క్లాప్స్‌ కొడతారు. కానీ ఓ సినిమాటోగ్రాఫర్‌కి క్లాప్స్ కొట్టిన ఘనత బాలుమహేంద్రగారికి మాత్రమే దక్కింది. అలాంటి గొప్ప సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు నన్ను పరిచయం చేశారు. 

ఆలీ: బాలుమహేంద్ర దర్శకత్వంలో మీరు ఎన్ని చిత్రాల్లో నటించారు?
అర్చన: దగ్గరదగ్గరగా ఐదు చిత్రాలు చేశాను. తెలుగు, తమిళ భాషల్లో నటించాను. హిందీలోనూ చేశాను. షాజీ.ఎన్.‌కరున్‌ దర్శకత్వంలో ‘నిషాద్‌‌’ అనే సినిమా చేశాను. ఆయన పద్మశ్రీ గ్రహీత, గొప్ప సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు.

ఆలీ: మీకు చిత్రాల్లో ప్రయోగాలు చేయడమంటే ఇష్టమా?
అర్చన: ‘సంధ్యారాగం’లో తొమ్మిది నెలల గర్భిణిగా పూర్తి సినిమాలో కనిపించాను. నాకు ప్రయోగాత్మక సినిమాలంటే చాలా ఇష్టం. వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. అందుకే నన్ను పక్కింటి అమ్మాయిలా చూసేవారు. అందుకే మిగిలిన వారి కంటే నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 

ఆలీ: మీరు నటించిన ‘దాసి’ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది?
అర్చన: భారతీయ చలనచిత్ర రంగంలో ఒక గొప్ప చరిత్రను సృష్టించింది ‘దాసి’. ఆ సినిమాకు ఐదు పురస్కారాలు వచ్చాయి. అది దర్శకుడు బి.నర్సింగరావుగారి అంకితభావం. ఈ చిత్రంతో మమ్మల్ని ఆయన ఉన్నత స్థానంలో నిలిపారు. 

ఆలీ: వరుస సంవత్సరాల్లో మీకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంతవరకు మీ చరిత్రను ఎవరూ తిరగరాయలేదా? 
అర్చన: ఒకటికి మించి జాతీయ పురస్కారాలు తీసుకున్నవారు ఉన్నారు. కానీ వరుస సంవత్సరాల్లో తీసుకున్నవాళ్లు లేరు. నాకు 1988, 1989లో రెండు వరుస సంవత్సరాల్లో తీసుకున్నాను.

ఆలీ: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో నుంచి బెస్ట్‌ కమెడియన్‌ అవార్డు తొలగించారు. దీనికి మీరేమంటారు?
అర్చన: ఈ విషయమై నేను కచ్చితంగా మాట్లాడతాను. ఒక గంభీరమైన పాత్రలు చేయడం ఎంతో సులభం. కానీ, కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ చేయడం సాధారణ విషయం కాదు. నేను అందరు కమెడియన్లను ఎంతో గౌరవిస్తాను.

ఆలీ: జాతీయ అవార్డు కమిటీ జ్యూరీలో నుంచి ఎందుకు మీరు వెళ్లిపోవాలనుకున్నారు?
అర్చన: కమిటీ జూరీలో భాగంగా అగ్రిమెంట్‌ ఇచ్చాను. ఇక ఏం జరిగినా వెనుకడగు వేయకూడదు. నేనున్న కమిటీకి ఒక థియేటర్‌ ఇచ్చారు, అక్కడకు వెళ్లి చూసేటప్పటికీ చాలా చిన్నదిగా, అస్సలు బాగోలేదు. ఏ మాత్రం నాణ్యత లేదు. అలాంటి థియేటర్‌లో సినిమా చూసి దాని గురించి ఎలా చెప్పగలం అనిపించింది. ‘ఇదేనా థియేటర్‌. ఇందులో నేను చూడను’ అని నేను అన్నాను. దానికి వాళ్లు ‘మేం ఏం చేయలేం’ అన్నారు. దాంతో నేను ‘చెన్నైకి నాకు టికెట్‌ కావాలి’ అన్నాను. ‘జ్యూరీ సభ్యురాలు కావడం నాకు గౌరవంగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నాను’ అని చెప్పాను. వెంటనే జూరీ ఛైర్‌ పర్సన్‌ వచ్చి మరొక థియేటర్‌కి మార్చారు. తర్వాత నన్ను వాళ్లు చక్కగా అర్థం చేసుకున్నారు. 

ఆలీ: ‘నిరీక్షణ’లో భానుచందర్‌తో కలసి నటించిన అనుభూతి ఎలా ఉండేది?
అర్చన: భానుచందర్‌తోనే నా కెరీర్‌ మొదలుపెట్టాను. తమిళంలో నా మొదటి చిత్రం ఆయనతోనే చేశాను. నాకు రెండోసారి జాతీయ అవార్డు వచ్చింది ఆయనతో నటించిన సినిమాలోనే. తర్వాత అతనితో నటించిన ‘నిరీక్షణ’లో నాకు స్పెషల్‌ జూరీ అవార్డు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నాకు అన్నయ్య. మా మధ్య పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. కానీ రెండో రోజుకే కాంప్రమైజ్‌ అయిపోతాం. అంత లైవ్లీ, లవ్లీ రిలేషన్‌షిప్‌ మాది. మా మధ్య మధ్యవర్తి బాలుమహేంద్రగారు. గొడవలు వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య సంధి కుదిర్చేది ఆయనే. 

ఆలీ: మీ కలర్‌ మీకు ప్లస్సా? మైనస్సా?
అర్చన: కలర్‌ విషయంలో మైనస్‌ అనే మాటకు అసలు అర్థమే లేదు. మనం భారతీయులం, ద్రవిడులం.. మన ఐడెంటిటీయే డార్క్‌. అందుకే నేను ఎప్పుడూ రంగును మైనస్‌ అనుకోలేదు. ఒక తెలుపు రంగు ఛాయ ఉన్న అమ్మాయి మంచి నటి అవుతుంది. అదే ఒక ఛాయ తక్కువ అమ్మాయి కెమెరా ముందుకు వస్తే కెమెరామెన్‌లకు లడ్డూలు తింటున్నట్టు ఉంటుంది. వాళ్లు ఆ డార్క్‌‌ని ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. గొప్ప నటులందరూ ఛాయ తక్కువవారే. నా రంగు విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. 

ఆలీ: బాలుమహేంద్రగారికి మీరు ఎక్కడ కనిపించారు. ఆయన మిమ్మల్ని ఎలా చూశారు?
అర్చన: ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేను సంవత్సరం యాక్టింగ్ కోర్సులో చేశాను. అక్కడికి అమెరికన్‌ దర్శకుడు విలియమ్‌ బ్రీవ్స్‌ వచ్చారు. అక్కడ నేను, నాజర్‌ కలసి ఓ ప్రదర్శన చేశాం. అందులో మా నటనను చూసి మెచ్చి, నాకు భారతీయ దర్శకుడు ఒకరు తెలుసు అని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అలా నేను బాలుమహేంద్రను కలిశాను.

ఆలీ: మీలో ఉన్న డ్యాన్సర్‌ను చలనచిత్ర పరిశ్రమ ఉపయోగించుకుందా? 
అర్చన: డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న‌ పాత్ర చేయలేదనే కొరత నాకు అలాగే ఉండిపోయింది.

ఆలీ: 25 ఏళ్ల తరువాత మీరు ఒక పెద్ద తెలుగు చిత్రం ఒప్పుకున్నారని విన్నాను... నిజమేనా?
అర్చన: అవును ఓ సినిమా ఒప్పుకున్నాను. అంతేకాదు 25 ఏళ్ల తరువాత తొలిసారి నేను హైదరాబాద్‌ వచ్చాను. 25 ఏళ్ల తరువాత ఇదే నా మొదటి ఇంటర్వూ. ఆ సినిమా గురించి మేనేజర్‌ చలపతి నా వెంటపడి మరీ కథ వినడానికి ఒప్పించాడు. దర్శకుడు స్క్రిప్ట్‌ చెప్పాక చాలా బాగుంది అనిపించింది. ఈ మధ్య కాలంలో అంతమంచి కథ ఏ భాషలోనూ వినలేదు. దాంతో పాటు ఆ దర్శకుడి యాటిట్యూడ్‌ కూడా నచ్చింది. ఆ తర్వాత నిర్మాత గురించి కూడా విన్నాను. తెలుగు పరిశ్రమలో చాలా ముఖ్యమైన నిర్మాత. కొవిడ్ తర్వాత ఎప్పుడు సినిమా మొదలైనా, నేను ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా ఆ సినిమా చేస్తాను. అది నా బాధ్యత.. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్క్రిప్ట్‌ మహిమ అది.

ఆలీ: మీ డ్రీమ్‌ రోల్‌ ఏదైనా ఉందా?
అర్చన: శాస్త్రీయ నృత్యం నేపథ్యంలో సినిమా చేయలేకపోయాను అనే బాధ ఉంది. దాంతోపాటు నేను సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండే పాత్ర చేయాలనుకుంటున్నాను. సినిమాలో నా పాత్ర చూసి... ఇలాంటి అమ్మాయిని ఎక్కడో చూశాం అనిపించాలి. అలా ప్రతి కుటుంబంలో నేనుండాలి. అలాంటి పాత్రలు చేయాలి.. అంతేకాకుండా నాకు మూగ, చెవుడు ఉన్న అమ్మాయి పాత్ర చేయాలని అనిపిస్తుంటుంది. అలాగే కర్ణాటిక్‌ సింగర్ పాత్ర చేయాలనే డ్రీమ్‌ రోల్‌ ఉంది. 

ఆలీ: ఈ షోకే మీకు రావాలని ఎందుకు అనిపించింది?
అర్చన: నాలుగేళ్లుగా మీరు నన్ను ఇంటర్వ్యూకి రమ్మని అడుగుతున్నారు. మీరు షోను హోస్ట్‌ చేస్తున్న విధానం నాకు నచ్చింది. మీకు నటుల విలువ తెలుసు.

అలీ: ‘నిరీక్షణ’ సినిమా చూస్తున్నప్పుడు... మీలో రేఖను చూసుకున్నాను?

అర్చన: ధన్యవాదాలు. రేఖను చూస్తే ఓ దేవతను చూస్తున్నట్లు ఉంటుంది.

ఆలీ: మీ చిత్రాలకు మీరే డబ్బింగ్‌ చెప్పేవారా?
అర్చన: కొన్ని చిత్రాలకు చెప్పాను. కొన్ని చిత్రాలు మనసుకు అతకలేదు. అందుకే చెప్పలేదు.
 

ఆలీ: తెలుగు చిత్రాల్లో నటించడం మానేయడానికి ఒక చేదు అనుభవం కారణమని అన్నారు. ఏమిటది?
అర్చన: అందులో పెద్దగా నిజం లేదు. కొన్ని పాత్రలు నాకు నచ్చలేదు. ఆత్మాభిమానం నాకు ముఖ్యం. నా విలువ తెలిసినవాళ్లతో మాత్రమే నేను పనిచేయగలను. 30 సినిమాల్లో నటించాను. అందులో నాకు  రెండు సినిమాలు నచ్చాయి. నేనే కాదు... 300 సినిమాలు నటించిన కథానాయికకు కూడా రెండోమూడో సినిమాలే వాళ్ల మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. 

ఒక్క మాటలో... 

బాలు మహేంద్ర - నా గురువు, మిత్రుడు

నిరీక్షణ - నాకు గుర్తుండిపోయే చిత్రం

భానుచందర్‌ - మా అన్నయ్య

నలుపు - నేను

ఇళయరాజా - నా ప్రాణం

ఎస్పీ బాలసుబ్రమణ్యం - మాటలు లేవు

జాతీయ అవార్డు - ఇంకా ఆ నీడలోనే ఉన్నాను, ఆ నీడే నన్ను నిలబెడుతోంది

తెలుగు సినిమా - మంచి సినిమాలు వస్తున్నాయి. ఒక స్టేజీలో వంద సినిమాల్లో పది మాత్రమే మంచి చిత్రాలు.. మిగతావి చెప్పలేం అన్నట్టు ఉండేవి. ఇప్పుడు కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు బాగానే ఉన్నాయి. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.