కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా.. అందుకే 35 సినిమాలే చేశా: బి గోపాల్‌ - director b gopal interview about gopichand aaradugula bullet
close
Updated : 07/10/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా.. అందుకే 35 సినిమాలే చేశా: బి గోపాల్‌

హైదరాబాద్‌: స్క్రిప్ట్‌ బాగుంటే సినిమా హిట్‌ అవుతుందని లేకపోతే ఫ్లాప్‌ తప్పదని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ అన్నారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. నయనతార కథానాయిక. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి దర్శకుడు బి.గోపాల్‌ పంచుకున్న విశేషాలు..

‘‘ఆరడుగుల బుల్లెట్’ ఓ కమర్షియల్ మూవీ. తండ్రీ-కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. మరి ఆ కుటుంబానికి కష్టాలు ఎలా వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయి? అనేది తెరపై చూడాలి. ఈ కాన్సెప్ట్‌తో గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఇందులో భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగా కుదిరాయి’’

‘‘నరసింహనాయుడు’ విడుదలైన తరువాత పది నెలలు ఖాళీగా ఉన్నా. నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయొచ్చు. కానీ, నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను. అశ్వనీదత్ గారు, చంటి అడ్డాల ఒకేసారి నా దగ్గరకు వచ్చారు. అలా ఇంద్ర, అల్లరి రాముడు చిత్రాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్‌లు రెడీగా ఉంటే ఒకేసారి రెండు సినిమాలు కూడా చేశాను’’

‘‘ఇప్పటివరకూ నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు, కొత్త రచయితలను అందరినీ కథలు అడుగుతుంటాను. ‘మస్కా’తో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశా. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను’’

‘‘స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. ‘క్రాక్’ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. ఓటీటీ కంటెంట్లను కూడా జనాలు బాగానే చూస్తున్నారు. కానీ నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. పెద్ద తెరపై సినిమా చూసేందుకే జనాలు ఇష్టపడతారు’’

‘‘ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకూ నాకు తెలీదు. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్‌లో డైరెక్షన్ చేసేందుకు రెడీ. బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది’’

‘‘నాకు రీమేక్‌లు  చేయడం ఎక్కువగా నచ్చదు. ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’ చేశాను. కొత్త స్క్రిప్ట్‌తోనే సినిమాలు చేయడం ఇష్టం. కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులకు నచ్చేట్టుగా తీయాలని ప్రయత్నిస్తాను’’ అని బి.గోపాల్‌  చెప్పుకొచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని