
తాజా వార్తలు
మద్యం మత్తులో ఎస్ఐ: కారుతో మహిళను ఢీకొట్టి..
ఎస్ఐపై కేసు నమోదు, అరెస్టు
దిల్లీ: మద్యం మత్తులో ఓ పోలీసు అధికారి వేగంగా కారును నడుపుతూ మహిళను ఢీకొట్టిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు దిల్లీలోని చిల్లా గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన ఓ కారు మహిళను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎగిరిపడిన ఈ మహిళ, కారుముందు కింది భాగంలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆమెను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ కారులో వున్న వ్యక్తి మళ్లీ వేగాన్నిపెంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇలా కారు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అడ్డుకున్న స్థానికులు కారు నడుపుతున్న వ్యక్తిని పోలీసులకు పట్టించారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలలో రికార్డయ్యాయి.
నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిని దిల్లీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ యోగేంద్ర(56)గా గుర్తించారు. వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఆ ఎస్ఐ మద్యం మత్తులో ఉన్నాడని దర్యాప్తు చేసిన అధికారులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతోపాటు వ్యక్తి ప్రాణహాని కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.