లింక్‌ క్లిక్‌ చేశారా.. ఖాతాలో సొమ్ము మాయం!

తాజా వార్తలు

Published : 09/06/2021 01:34 IST

లింక్‌ క్లిక్‌ చేశారా.. ఖాతాలో సొమ్ము మాయం!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘మీకు కారు బహుమతిగా వచ్చింది. చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పలువురికి షేర్‌ చేస్తే చాలు! బహుమతి మీ సొంతం’’ అంటూ ఎర వేస్తారు. ఈ విధంగా వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా వచ్చిన లింక్‌లను క్లిక్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే. వ్యక్తి గత సమాచారాన్ని తస్కరించడంతో పాటు, బ్యాంకు ఖాతాలోని సొమ్మునుకూడా కాజేస్తున్నారు. ఇలాంటి సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు పంథాను మార్చుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో అమెజాన్‌ స్పిన్‌ వీల్‌లో బహుమతులంటూ బోల్తా కొట్టించిన సైబర్‌ నేరస్థులు, తాజాగా మరో లింక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు చెబితే టాటా సఫారీ గెలుచుకోవచ్చనేది ఆ లింక్‌ సారాంశం. నిజంగానే కానుకలు వస్తాయని కొందరు ఆశతో  లింక్‌ను పలువురికి షేర్‌ చేస్తున్నారు. ఇలా చేయడం తాము వంచనకు గురికావడమే కాకుండా మరికొందరు మోసపోయేలా చేసినట్టేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు పంపిన లింక్‌లను ఓపెన్‌ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

సీజన్‌ను బట్టి సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో ప్రజల సొమ్ము దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐఫోన్‌ గెలుచుకోండి’’ అంటూ సైబర్‌ నేరగాళ్లు లింకులు పంపారు. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ గిఫ్ట్‌, డీమార్ట్‌ 20 ఏళ్ల ఉత్సవం అంటూ స్పిన్‌ వీల్‌ను వాట్సాప్‌ ద్వారా పంపించారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పందించి ఇలాంటివి నమ్మవద్దని హెచ్చరించారు. ఈ లింక్‌లు ఎవరు పంపిస్తున్నారన్న దాని మీద దర్యాప్తు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు ఇలాంటి సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా వచ్చే ఈ తరహా లింకులను ఓపెన్‌ చేయకపోవడమే మేలంటున్న పోలీసులు, అనుమానం వస్తే సమీప ఠాణాలో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని