close

తాజా వార్తలు

ఆలిని హతమార్ఛి..ఊపిరి ఉరికి ఇచ్ఛి...

● లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన భర్త

● తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు

పిల్లలతో నరసింహారెడ్డి, స్వాతి (పాత చిత్రం)

పాపం పుణ్యం తెలియని బుడతలు వారు కష్టం సౌఖ్యం ఎరుగని పిల్లలు వారు పచ్చిక మైదానాల్లో... పంట చేలల్లో ఆడిపాడే పువ్వులు వారు తండ్రి సందట్లో... తల్లి కౌగిలిలో ఒదిగే చేమంతులు వారు ముద్దులొలికే మాటలతో ఎందుకో మరెందెకో ఆ భగవంతుడి నిర్ణయం ఎందుకో కన్న తల్లిదండ్రులను హరించింది. కొమ్మను చెట్టే నరికేసినట్లు నదిని గట్టే తాగేసినట్లు భార్యను భర్తే కడతేర్చాడు ప్రాణం పోయినా పర్వాలేదు పంతం నెగ్గితే చాలనుకున్నాడు ముక్కు పచ్చలారని బిడ్డలను అనాథలు చేసి తనువు చాలించాడు చిన్న వయసులోనే కష్టాలపాలయ్యారు అమ్మా, నాన్న తోడులేని వారయ్యారు.

ఎమ్మిగనూరు గ్రామీణ: ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో భార్యను హతమార్చిన భర్త ఎమ్మిగనూరులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఎమ్మిగనూరు మండలంలోని కడివెళ్ల గ్రామంలో బుధవారం తుంగభద్ర గ్రామానికి చెందిన రామలింగారెడ్డి కుమారుడు డి.నరసింహారెడ్డి(36) కత్తితో తన భార్య స్వాతిని గొంతు కోసి హతమార్చి పరారైన విషయం విదితమే. పోలీసులు ఈయన కోసం గాలిస్తుండగా ఎమ్మిగనూరు మల్లికార్జున లాడ్జిలో విగత జీవుడై కనిపించాడు. విచారించిన పోలీసుల వివరాల మేరకు బుధవారం భార్యను హతమార్చిన నరసింహారరెడ్డి పట్టణానికి వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. గదిలో పైకప్పునకు ఉన్న ఇనుప చువ్వకు పంచెతో బుధవారం సాయంత్రమే ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం లాడ్జి గది తలుపు కింద నుంచి రక్తం బయటకి రావడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. భార్యపై దాడి చేసిన సమయంలో ఆమె పెనుగులాడడంతో నరసింహారెడ్డికి కాలుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగిందని, ఊరి వేసుకున్న అనంతరం రక్తం కారి గది బయటికి వచ్చిందని పోలీసులు తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. మృతుడి అన్న డి.సిద్ధారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.

పిల్లలకు దిక్కెవరు.?

తల్లి స్వాతి, తండ్రి నరసింహారెడ్డిల మృతితో చిన్నారులు శశిధర్‌రెడ్డి, శిరీష అనాథలయ్యారు. భర్త వేధింపులు తాళలేక గ్రామానికి వచ్చిన స్వాతి తల్లిదండ్రుల సాయంతో తాను కష్టం చేసైనా పిల్లలను చదివించాలనుకుంది. వారు పెరిగి పెద్దవుతున్నా భర్త తీరులో మార్పు రాలేదు. పిల్లలను కూడా తానే చదివించుకుంటోంది. ఈ క్రమంలోనే భర్త రావడంతో సంతోషించిన స్వాతి.. అతని చేతిలో హతమైంది. పసి పిల్లల గురించి ఆలోచించకుండా చేసిన తప్పునకు కుంగిపోయాడో ఏమో.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు శశిధర్‌రెడ్డి కడివెళ్ల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాప శిరీష నాలుగో తరగతి చదవుతోంది. దీంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అమ్మమ్మ, తాతయ్యలే వీరికి దిక్కయ్యారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.