లాక్‌డౌన్‌లో ప్రార్థనలు.. 40మందిపై కేసు

తాజా వార్తలు

Published : 11/04/2020 00:21 IST

లాక్‌డౌన్‌లో ప్రార్థనలు.. 40మందిపై కేసు

చింద్వారా: కరోనా వైరస్‌ పోరులో భాగంగా అమలవుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రార్థనా మందిరాలతో పాటు వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు మాత్రం గుంపులుగా కాకుండా సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తాజాగా మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రార్థనలకు హాజరైన 40మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్‌ చింద్వారా జిల్లాలోని చౌరాయిలో ఉన్న స్థానిక మసీదుకు హాజరై ప్రార్థనలు నిర్వహించారు అక్కడి ముస్లింలు. ఆ సమయంలో వారు సామాజికదూరం పాటించకపోవడంతో పాటు మాస్కులు కూడా ధరించలేదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెక్షన్‌ 144 అమల్లో ఉంది. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన 40మందిపై కేసులు నమోదు చేశామని స్థానిక పోలీసులు వెల్లడించారు. వీరిపై అంటువ్యాధుల చట్టం -1897తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మరోవైపు మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే కొవిడ్‌-19 వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. మర్కజ్‌ ఘటన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 397 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 24 మంది మరణించారని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి వెల్లడించారు. కేవలం ఇండోర్‌లోనే 221 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. భోపాల్‌లో 98 కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలుచేసేందుకు పలుచోట్ల ‌144 సెక్షన్‌ విధించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 15జిల్లాల్లో హాట్‌స్పాట్‌లను గుర్తించి సీల్‌ చేయాలని ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. 

క్వారంటైన్‌లో ఉన్నవారి ఇళ్లకు తాళం..

మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత పెరగడంతో పలుచోట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఛాతర్‌పూర్‌ జిల్లాలోని ఖజురహో, రాజ్‌నగర్‌లో క్వారంటైన్‌లో ఉన్నవారి ఇళ్లకు తాళం వేశారు. కరోనా తీవ్రత అధికంగా ఉండి డేంజర్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల నుంచి వారి ఇళ్లకు చేరుకోవడంతో వీరిని క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ, గత రెండు రోజులుగా నిబంధనలు అతిక్రమిస్తూ అధికారులకు సహకరించకపోవడంతో వీరి ఇంటికి తాళం వేయాలని జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. అయితే వీరికి కావల్సిన నిత్యవసర వస్తువులను అందించేందుకు అన్నిఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని