మరణమే ఇక శాసనమని..!

తాజా వార్తలు

Updated : 26/06/2021 05:29 IST

మరణమే ఇక శాసనమని..!

పెళ్లయిన మూడేళ్లకే తనువు చాలించిన వివాహిత

బిడ్డతో సహా నేలబావిలో దూకి ఆత్మహత్య 

న్యూస్‌టుడే, లావేరు గ్రామీణం

చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్న ఆ యువతికి తండ్రి, మేనమామలే అమ్మయ్యారు.. ఏలోటూ లేకుండా పెంచి పెద్దదాన్ని చేశారు.. ఓ అయ్యచేతిలో పెట్టి ఇల్లాలిని చేశారు.. ఆ బిడ్డ మరోబిడ్డకు జన్మనిచ్చిందని సంబరపడ్డారు.. కానీ ఆమె కలహాల కాపురంలో నలిగిపోతుందని అనుకోలేదు.. నిత్యం నరకయాతన అనుభవించింది.. బాధలను పంటి బిగువున భరించింది.. గొడవలతో మానసికంగా కుంగిపోయింది.. ఈ కూపం నుంచి బయటపడాలంటే మరణమే ఇక శాసనమని భావించింది.. తాను నిండు గర్భిణి అని కూడా ఆలోచించలేదు.. రెండేళ్ల బిడ్డ అనాథ కాకూడదనుకుంది.. ఇందుకు కఠిన నిర్ణయమే తీసుకుంది.. ఈ లోకాన్నే వీడింది.. వెళుతూ తన గారాలపట్టిని వెంట తీసుకెళ్లిపోయింది.. ఈ హృదయ విదారక ఘటన లావేరు మండలం చిన మురపాక గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల రాజేశ్వరి(28)కి అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహమైంది. ఈమె స్థానికంగా గ్రామ వాలంటీరుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. భార్యాభర్తల గొడవల కారణంగా ఈనెల 23న రెండేళ్ల పాప భువనేశ్వరిని తీసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చిన్నమురపాక సమీపంలోని నేలబావిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం సమీప గ్రామాలకు తెలియడంతో కేశవరాయుపాలెం నుంచి కొందరు ఘటనా స్థలానికి చేరుకొని అవి రాజేశ్వరి, భువనేశ్వరి మృతదేహాలుగా గుర్తించారు. బంధువులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. వీరిద్దరూ ఇంటి నుంచి బయలుదేరినరోజే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు ఇన్‌ఛార్జి ఎస్‌.ఐ. రాజేశ్‌ తెలిపారు. 

వేధింపులు తాళలేకే... అత్తవారింటి వేధింపులు తాళలేకే రాజేశ్వరి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపుకట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించేవారని, భర్త కోటేశ్వరరావు(రవి) నిత్యం మద్యం తాగి వచ్చి కొట్టేవాడని రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య, తండ్రి సూర్యనారాయణ చెబుతున్నారు. ఇంట్లో నరకం చూపిస్తున్నారంటూ బాధపడేదని వివరించారు. తన సోదరి వెళ్లిపోయినప్పటి నుంచి లావేరు పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని గన్నియ్య ఆరోపిస్తున్నారు. విషయాన్ని జేఆర్‌పురం సీఐ చంద్రశేఖర్‌ వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు తీసుకోకపోవడంపై విచారణ చేపడతామని తెలిపారు. 

కన్నవారింటికి వెళ్లకుండానే...  రాజేశ్వరికి సీమంతం చేసి తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు కన్నవారు ఈనెల 30న ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే ఇలా దారుణం జరగడంతో కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరవుతున్నారు. అందరితో సరదాగా ఉండే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని