
తాజా వార్తలు
మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు
ఈనాడు డిజిటల్, చిత్తూరు- మదనపల్లె (నేరవార్తలు): మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్లను మూఢ భక్తితో హత్య చేసిన దంపతులు పురుషోత్తంనాయుడు, పద్మజను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు మదనపల్లె సబ్‌జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలను పోలీసులు పేర్కొన్నారు. అందులోని సమాచారం మేరకు.. అలేఖ్య (27), సాయిదివ్య (22) కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాను చనిపోతాననే భావనతో సాయిదివ్య ఉండగా.. ఆ అనుమానం నిజమేనని అలేఖ్య బలపరుస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 23న తల్లిదండ్రులు మంత్రగాడితో తాయత్తు కట్టించారు. అప్పటికీ సాయిదివ్యలో ఈ భావన తగ్గలేదు.
మరుసటిరోజు తాను చనిపోతానని సాయిదివ్య బిగ్గరగా ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. ఈ క్రమంలో మరింత గట్టిగా ఏడవడంతో.. ఈసారి దెయ్యాన్ని వదిలించాలని డంబెల్‌తో తలపై మోదారు. తర్వాత నుదుటిపై కత్తితో కోశారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సాయిదివ్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెల్లిని తిరిగి ఈ లోకానికి తీసుకొస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పింది. పెద్ద కూతురు చెప్పినట్టుగానే పురుషోత్తంనాయుడు, పద్మజ కలిసి అలేఖ్య నోటిలో కలశం పెట్టి డంబెల్‌తో తలపై కొట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అలేఖ్య కూడా మరణించింది.
రెండు హత్యల తర్వాత గౌరీశంకర్ అనే విశ్రాంత అధ్యాపకుడి సూచన మేరకు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు.. పురుషోత్తంనాయుడు ఇంటికి వెళ్లారు. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గ్లాసు ముక్కలు కనిపించాయి. రాత్రి 9.30 గంటలకు తాలూకా స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. దంపతులిద్దరినీ తిరుపతిలోని మానసిక వైద్యశాలకు తరలిస్తే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని మదనపల్లె జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యురాలు రాధిక నివేదిక ఇచ్చారు. ఈ మేరకు వారిద్దరినీ వైద్యశాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక సబ్ జైలు సూపరింటెండెంట్ రామకృష్ణయాదవ్ కోరారు. న్యాయస్థానం నుంచి అనుమతి రాగానే.. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి..
మదనపల్లె ఘటన.. ఆహారం తీసుకోని నిందితులు
నేను కాళికను.. ఆయన నా భర్తే కాదు..