close

ప్రధానాంశాలు

Published : 24/02/2021 05:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇద్దరినీ మట్టుబెట్టి.. కారులోనే గుర్రుపెట్టి

కత్తులు, రక్తం అంటిన దుస్తులు సుందిళ్ల బ్యారేజీలోకి
వామన్‌రావు కేసు రిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: న్యాయవాదులు వామన్‌రావు దంపతులను అనుసరించి వచ్చిన నిందితులు కొద్దినిమిషాల్లోనే నడిరోడ్డు మీద వారిద్దరినీ ఘోరంగా నరికి చంపి ఏమీ జరగనట్లే అక్కడి నుంచి జారుకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా వెల్లడైంది. ఆ రాత్రికి కారులోనే ప్రశాంతంగా నిద్రపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి వారు మంథనిలో న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి. కల్వచర్ల సమీపంలో వామన్‌రావు, నాగమణిలను హత్య చేసిన అనంతరం నిందితులు నేరుగా కారులో సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు రక్తసిక్తమైన తమ దుస్తులను బ్యారేజీలో పడేశారు. బ్యారేజీ నుంచి కారులో వాంకిడి చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ఆ రాత్రికి నిందితులు వాహనంలోనే పడుకున్నారు. ప్రస్తుత రిమాండ్‌ రిపోర్టును బట్టి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. ఈ మొత్తం కేసులో బిట్టు శ్రీను పాత్ర ఏమిటి అనేది అతడికి సంబంధించిన రిమాండ్‌ డైరీ ద్వారా వెల్లడయ్యే అవకాశముంది.

కేసులు.. వివాదాలు
కుంట శ్రీనుపై కేసులు, ఫిర్యాదుల గురించి వామన్‌రావు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. కుంట శ్రీను దీనిపై ఫోన్‌లో బెదిరించడంతో వామన్‌రావు అతడిపై హైదరాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. మంథని ఠాణాలోనూ కుంట శ్రీనుపై పదుల సంఖ్యలో ఫిర్యాదులుచేశారు. శ్రీను గుంజపడుగు బస్టాండ్‌ వద్ద స్థలాన్ని కొని భవనం, సమీపంలోనే గుడిని నిర్మిస్తున్నాడు. దీంతో పాటు రాధాగోపాలస్వామి ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయగా.. వీటన్నింటినీ అడ్డుకునేందుకు వామన్‌రావు కేసులు వేయడంతో శ్రీనుకు అతడికి మధ్య వివాదం బాగా ముదిరింది. వామన్‌రావు విషయమై కుంట శ్రీను పలుమార్లు బిట్టు శ్రీనుతో చర్చించి చివరకు ఎలాగైనా, ఎప్పుడైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు. గుంజపడుగు గ్రామంలో ఈనెల 17న జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కుంట శ్రీను తర్వాత దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యాడు. మంథని చౌరస్తాకు వచ్చేసరికి వామన్‌రావు దంపతులు కారులో మంథని కోర్టుకు వెళ్తుండడం కనిపించింది. వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు హత్య చేయడానికి కత్తులు, కారు, డ్రైవర్‌ చిరంజీవితో పాటు కోర్టు వద్ద రెక్కీకి లచ్చయ్య, కుమార్‌లను ఏర్పాటు చేశాడు.

కాల్‌ రికార్డులో ఏం ఉంది?
ఈ నెల 17న (హత్యలు జరిగిన రోజు) కుంట శ్రీను, బిట్టు శ్రీను, లచ్చయ్య, అక్కపాక కుమార్‌ల మధ్య మొత్తం 18 సార్లు సెల్‌ఫోన్‌ సంభాషణలు నడిచాయి. బిట్టు శ్రీను-కుంట శ్రీను మధ్య 11 సార్లు, కుంట శ్రీను- వూదరి లచ్చయ్య మధ్య 5 సార్లు కాల్స్‌ వెళ్లాయి. బిట్టు శ్రీను, కుంట శ్రీను చెరోసారి కుమార్‌తో మాట్లాడారు.

కత్తుల తయారీదారుల విచారణ
మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: హత్యల కోసం బిట్టు శ్రీను మంథనిలో కత్తులు తయారు చేయించాడు. వాటిని తయారుచేసి ఇచ్చిన రఘు, శ్రీను, బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కులవృత్తిపరంగా కత్తులు తయారు చేశామే తప్ప హత్యకు ఉపయోగిస్తారనే విషయం తమకేం తెలుసంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విలేకరి నుంచి వాంగ్మూలం!
వామన్‌రావు తండ్రి కిషన్‌రావుతో పాటు ఘటనా స్థలంలో హత్యను వీడియో చిత్రీకరించిన ఓ విలేకరి నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్‌
హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనును మంగళవారం అర్ధరాత్రి మంథని అడిషనల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్‌ విధించారు. అతడిని కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. కరీంనగర్‌ కారాగారంలో ఉన్న కుంట శ్రీనివాస్‌, చిరంజీవి, కుమార్‌లను వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.


వీడియో పుటేజీలో సాక్ష్యాలు

నెల 17న మధ్యాహ్నం 2.26కి పన్నూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి నిందితుల కారు కల్వచర్ల వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కనిపిస్తోంది. మధ్యాహ్నం 2.29కి వామన్‌రావు దంపతుల కారు కల్వచర్లకు వెళ్లింది. మధ్యాహ్నం 2.41కి నిందితులు తిరిగి (హత్య తర్వాత) వారి కారులోనే మంథనికి వెళ్తున్నట్లు తెలంగాణ చౌరస్తా ఉన్న సీసీ కెమెరాలో లభ్యమైంది. అంటే అంతా కొద్దినిమిషాల్లోనే పూర్తి చేసేసినట్లు అర్థమవుతోంది. అయితే మొత్తంగా ఘటనకు సంబంధించి ప్రణాళిక పూర్తయ్యేసరికి రెండు గంటలు పట్టింది.


అన్నీ బాగుంటే యాగం జరిగేది

వామన్‌రావు కారులో పోలీసులకు పలు దస్తావేజులు, పదులకొద్దీ ఫిర్యాదు పత్రాలు, సమచార హక్కు దరఖాస్తులు దొరికాయి. వాటిలో మంథని ఎంపీడీవో, తహసీల్దార్‌లకు, గుంజపడుగు పంచాయతీ కార్యదర్శికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన పత్రాలు ఉన్నాయి. గుంజపడుగులో ‘ఆయుత చండీయాగం’ కోసం బందోబస్తు కోరుతూ వామన్‌రావు తమ్ముడు ఇంద్రశేఖర్‌ పేరుతో రాసిన వినతిపత్రాలు లభించాయి. అంతా బాగుంటే సరిగ్గా ఈ మంగళ, బుధవారాల్లో (ఈనెల 23, 24 తేదీల్లో) యాగం జరిగి ఉండేది. అలాగే వెల్ది వసంతరావు అనే వ్యక్తి వాట్సప్‌ గ్రూపుల్లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంద్రశేఖర్‌ పేరుతో 24 పేజీల ఫిర్యాదు పత్రాలు లభించాయి.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన