ఆనందం ఆవిరైంది

ప్రధానాంశాలు

Published : 01/08/2021 04:54 IST

ఆనందం ఆవిరైంది

 తమ్ముడి బారసాల రోజు.. కాలువలో పడి బాలుడి మృతి

కొత్తపల్లి, న్యూస్‌టుడే: ఆ కుటుంబంలో చిన్న కుమారుడి బారసాల ఆనందంగా చేసుకుంటున్నారు. అందరూ ఆ హడావుడిలో ఉండగా మూడేళ్ల వయసున్న పెద్ద కుమారుడు ఆడుకుంటూ వెళ్లి కాలువలో పడి... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అప్పటివరకూ ఉన్న ఆనందం కాస్తా క్షణాల్లో ఆవిరైపోయి ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తఇసుకపల్లిలో చోటుచేసుకుంది. సామర్లకోటకు చెందిన గంటా శంకర్‌రావుకు కొత్తఇసుకపల్లికి చెందిన సురేఖతో 2018లో వివాహమైంది. వీరికి 2019లో హేమహరీష్‌ నందన్‌ జన్మించాడు. జులై 3న మరో కుమారుడు పుట్టాడు. శనివారం రెండో కుమారుడి బారసాల చేశారు. అందరూ ఆ హడావుడిలో ఉండగా పెద్ద కుమారుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న కాలువలో పడిపోయాడు. అతడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించి డాగ్‌స్క్వాడ్‌ సాయంతో బాలుడు కాలవలో పడినట్లు గుర్తించారు. కాకినాడ డీఎస్పీ భీమారావు, సీఐ వైఆర్‌కే శ్రీనివాసులు సైతం కాలువలోకి దిగి గాలించి, బాలుడి మృతదేహాన్ని కనిపెట్టారు. బాలుడు అదృశ్యమయ్యాడని ఫిర్యాదు అందిన మూడు గంటల్లో కేసు ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన