హాస్టల్‌ గదిలో విద్యార్థుల ఘర్షణ..

ప్రధానాంశాలు

Updated : 26/09/2021 05:35 IST

హాస్టల్‌ గదిలో విద్యార్థుల ఘర్షణ..

కిటికీ నుంచి పడి ఒకరి దుర్మరణం

నర్సంపేట రూరల్‌, న్యూస్‌టుడే: విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో వసతిగృహం రెండో అంతస్తు నుంచి కింద పడి ఓ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారు బిట్స్‌లో చోటుచేసుకుంది. ఎస్సై రాంచరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం వంగపల్లికి చెందిన నకీర్త సంజయ్‌(18) బిట్స్‌లో పాలిటెక్నిక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ నెల 21న అతనితో పాటు శివసాయి(దుగ్గొండి మండలం మహ్మదాపురం), హరిరాజ్‌ (గూడూరు), మనోహర్‌ (హైదరాబాద్‌), కృష్ణంరాజు(చెన్నారావుపేట మండలం జల్లి) అనే విద్యార్థులు హాస్టల్‌లోకి వచ్చారు. 22న శివసాయి కిటికీని తీసే క్రమంలో అద్దం పగిలింది. దీంతో కళాశాల క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎవరు అద్దం పగలగొట్టారో చెప్పాలని.. లేదంటే గదిలో ఉండే అయిదుగురు రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తల్లిదండ్రులను పిలిపించి విషయాన్ని చెప్పి పంపారు. శుక్రవారం రాత్రి భోజనం చేశాక గదిలో ఉన్న హరిరాజ్‌, మనోహర్‌, కృష్ణంరాజులు అద్దం పగలగొట్టిన నువ్వే జరిమానాను భరించాలని శివసాయితో చెప్పారు. అందరం కలిసి చెల్లిద్దామని సంజయ్‌ సూచించాడు. తాను ఇవ్వలేనని శివసాయి వాదించడంతో వారి మధ్య గొడవ జరిగింది. పెనుగులాటలో కిటికీ సమీపంలో ఉన్న సంజయ్‌ అందులోంచి జారి కిందపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నర్సంపేటకు తరలించి, అక్కడి నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సంజయ్‌ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన