తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది. |
స్థలపురాణం
కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి ‘కల్యాణకట్ట’ వద్దనే తలనీలాలు సమర్పించాలి
|
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
|