Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహించినా, పందేలు కాసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగా తక్కువ సమయంలో ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపుతూ అక్రమార్కులు బెట్టింగ్‌లు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందన్నారు. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని సులువుగా పెద్ద మొత్తంలో నగదు సంపాదించవచ్చని నమ్మించి మోసాలు చేసిన ఘటనలు ఉన్నాయన్నాయని గుర్తుచేశారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల నడవడికపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

పోలీసుల కళ్ల నుంచి తప్పించుకోలేరు.. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త తరహా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నామని ఎస్పీ చెప్పారు. పోలీసులు అంతే దీటుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా కొత్త విధానాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎంత తెలివిగా, ఎన్ని మార్గాలలో బెట్టింగ్‌ నిర్వహించినా వారిపై రహస్య నిఘా ఉన్నదని, ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల కళ్ల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

సమాచారం ఇవ్వండి...గోప్యంగా ఉంచుతాం.. గ్రామీణ గుంటూరు జిల్లా పరిధిలో ఎక్కడైనా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నా, పందేలు కాస్తున్నా, వారికి ఆశ్రయం కల్పించినా ఆ సమాచారాన్ని జిల్లా పోలీసు కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8866268899కు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) కంట్రోల్‌ రూమ్‌ 9490619395కు ఫోన్‌, వాట్సప్‌ ద్వారా, డయల్‌ 100కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని