చెత్త నుంచి విద్యుత్తు తయారీపై దృష్టి: మంత్రి
logo
Published : 18/06/2021 02:56 IST

చెత్త నుంచి విద్యుత్తు తయారీపై దృష్టి: మంత్రి

చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్లాంటును పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, యడ్లపాడు : గృహాలు, వాణిజ్య సంస్థల నుంచి వెలువడే చెత్త నుంచి విద్యుత్తు తయారు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోగలమని రాష్ట్ర పురపాలక- పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు గుంటూరు జిల్లాలోని 9 పురపాలికల నుంచి వచ్చే చెత్తతో గుంటూరు శివారు ఓబులనాయుడుపాలెం వద్ద తలపెట్టిన విద్యుత్తు తయారీ ప్రాజెక్టు పనులను గురువారం ఆయన మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హయాంలో జిందాల్‌ పవర్‌ ప్రాజెక్టుతో ఈ పనుల నిర్వహణకు ఒప్పందం కుదిరింది. 2016లో పనులు ప్రారంభించినా పది శాతమే జరిగాయి. తామొచ్చాక ఈ పనులను సమీక్షించి వేగవంతం చేశాం. ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని’ చెప్పారు. వచ్చే నెలలో సీఎం చేతులమీదుగా దాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని వెల్లడించారు. నగర, పట్టణాల నుంచి చెత్త తరలింపునకు కమిషనర్లు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. గుంటూరు, విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు తెనాలి, పొన్నూరు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట పట్టణాల నుంచి నిత్యం జిందాల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు వద్దకు చెత్తను తరలించడానికి వాహనాలు, మానవ వనరుల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగర, పురపాలికల్లో చెత్త సేకరణలోనే చాలా లోపాలు ఉన్నాయని ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మద్దాళి గిరిధర్‌లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్లు, లారీలతో సాధ్యపడదని, వాటి కోసం ప్రత్యేక వాహనాలు సమీకరించుకోవాలని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి పట్టణాల వారీగా కావాల్సిన వాహనాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, సంచాలకులు ఎం.ఎం.నాయక్‌, మేయర్‌ మనోహర్‌నాయుడు, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని