కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
logo
Published : 22/06/2021 04:13 IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

బాధితులను తక్షణం ఆదుకోవాలి
ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తిన అఖిలపక్ష నాయకులు

మచిలీపట్నం కలెక్టరేట్లో నిరసన తెలుపుతున్న అఖిలపక్ష నాయకులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ను అరికట్టే విషయంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం తక్షణం బాధిత వర్గాలకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ పక్షాల నాయకులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ  శాంతిభద్రతల విషయానికొస్తే ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఓ యువతిని అత్యాచారం చేసినా అతీగతీ లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, సీపీఐ నాయకుడు రామారావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్‌, తంగిరాల సౌమ్య, తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, పలువురు తెదేపా, ఇతర పక్షాల నాయకులు నిరసన పాల్గొన్నారు.  జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయకులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తు అనుమతి లేకుండా రాకూడదని, 144వ సెక్షన్‌ అమల్లో ఉందని పోలీస్‌ అధికారులు చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఉత్సవాలు, ఊరేగింపులు చేసినా అప్పుడు కరోనా నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని