విషాదాంతం
logo
Published : 23/06/2021 05:36 IST

విషాదాంతం

ముగ్గురు చిన్నారుల కథ

చెరువులో మునిగి దుర్మరణం

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆ ముగ్గురు చిన్నారుల కథ విషాదాంతమైంది. సోమవారం అదృశ్యమైన పిల్లలు మంగళవారం చెరువులో విగతజీవులై కనిపించారు. కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరుగాడే పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రెండు కుటుంబాలను తీరని శోకాన్ని మిగిల్చారు. మండలంలోని ఈదర గ్రామానికి చెందిన చిన్నారులు కగ్గా శశిక(11), కగ్గా చంద్రిక (9) సోమవారం తమ నాన్న దగ్గరకు వెళ్తున్నామని తోటి స్నేహితులకు చెప్పి ఇంటి పక్కనున్న గండికోట జగదీష్‌ (8)తో కలిసి ఊరి నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. చిన్నారుల ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం నుంచి 7 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో వెతికాయి. వాస్తవానికి ఈదరకు సుమారు 2 కి.మీ దూరంలో ఉండే బొద్దనపల్లి గ్రామంలోని ఆల్లూరమ్మ చెరువులోకి సోమవారం సాయంత్రం చిన్నారులు దిగడాన్ని కాపలాదారుడు ఒంగూరి బాబు చూశారు. అక్కడ నుంచి వెళ్లాలని గద్దించి అతను వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం కాపలాదారుడు మళ్లీ చెరువు వద్దకు వెళ్లాడు. చిన్నారుల మృతదేహాలు నీటిలో తేలియాడటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, సీఐ కె.సతీష్‌, ఎస్సై ఎన్‌.చంటిబాబు, తహసీల్దారు వి.వి.భరత్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని