తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత
eenadu telugu news
Published : 27/07/2021 05:08 IST

తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు

తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు, తోపులాట

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెదేపా జిల్లా కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, తెలుగు మహిళలు లాడ్జి సెంటర్‌ వద్దకు ప్రదర్శనగా బయల్దేరగానే పోలీసులు ముందుకు వెళ్లనివ్వలేదు. అడుగు ముందుకు వేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కరోనా నిబంధనల దృష్ట్యా నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని పోలీసులతో గుంటూరు పార్లమెంట్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రదర్శనకు వెళ్లేందుకు ముందుకు కదులుతున్న తెలుగు మహిళలు, పార్టీ నాయకులను అడ్డుకోవడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు తెగేసి చెప్పడంతో తెలుగు మహిళలు జిల్లా పార్టీ కార్యాలయం వద్దే నిరసన తెలియజేశారు. గ్యాస్‌ బండను పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు బాదుడే.. బాదుడు, గుదిబండగా మారిన గ్యాస్‌ బండ, తదితర ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎడాపెడా ధరలు పెంచుతూ జనం జేబులు గుల్ల చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్‌ పాలన సాగిస్తు న్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తెలుగు మహిళ ప్రధానకార్యదర్శి షేక్‌ రిజ్వానా, నాయకురాళ్లు మల్లె విజయ, పూల విజయలక్ష్మి, పానకాల వెంకట మహాలక్ష్మి, దాసరి జ్యోతి, నేపాక పద్మావతి, మల్లిక, మల్లినేని రుక్మిణి, రహమతున్నీసా, రమాదేవి, సావిత్రి, సుమతి, శశిసుధ, శైలజ, అనిత, హారిక, అనురాధ, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు, మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, పోతినేని శ్రీనివాసరావు, రావిపాటి సాయికృష్ణ, ఈరంటి వరప్రసాద్‌, కసుకుర్తి హనుమంతురావు, దయారత్నం, సుభాని పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని