శాంతించిన కృష్ణమ్మ
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

శాంతించిన కృష్ణమ్మ

ఈనాడు, అమరావతి

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

కృష్ణమ్మ శాంతించింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి తగ్గింది. ముంపు ముప్పు దాదాపు తప్పిపోయింది. గత రెండు రోజులుగా కృష్ణా నదికి వరద వస్తున్న విషయం తెలిసిందే. శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 5.5లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందన్న హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పునరావాస ఏర్పాట్లు చేపట్టింది. పెద్దగా ముంపు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ నగరం పరిధిలో కృష్ణలంక ప్రాంతంలో మాత్రమే కొన్ని కాలనీల్లోకి నీరు వచ్చింది. గరిష్ఠంగా 2.6లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేశారు. మంగళవారం రాత్రి సమయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద 1,96000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి వరద క్రమేపీ తగ్గుతూ వచ్చింది. బ్యారేజీలోకి ఎగువ నుంచి 2.09లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రణాళికాబద్ధంగా బ్యారేజీ నిర్వహణ చేపట్టడం, ముందుచూపుతోనే జలాశయం నీరు సముద్రంలోకి భారీగా విడుదల చేయడంతో ముంపు లేకుండా పోయింది. ఎగువ ప్రాజెక్టు పులిచింతల వద్ద ప్రస్తుతం గేట్లు మూసివేసి నీటిని నిలిపివేశారు. పులిచింతల జలాశయానికి కేవలం 7వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా 13వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. రాత్రి 9గంటల ప్రాంతంలో గేట్లు మూసివేసినట్లు తెలిసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లు సుమారు 4 అడుగులు ఎత్తి 1,96,000 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. బుధవారం నాటికి వరద పూర్తిగా తగ్గిపోనుంది. ఎగువ శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులకు వరద తగ్గిపోయింది. కనీసం 5లక్షల క్యూసెక్కుల దాటితే ప్రమాదం పొంచి ఉండేది. ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కులు కూడా దాటలేదు. విజయవాడ నగరం వారధి సమీపంలో కొన్ని నివాసాల్లో నీరు చేరాయి. ఇవి ఆక్రమణలు కావడం గమనార్హం. భూపేష్‌గుప్తానగర్‌, తారకరామనగర్‌, రణదీవేనగర్‌ ప్రాంతాల్లో నీరు చేరింది. పునరావాసం ఏర్పాట్లు చేశారు. దిగువ ప్రాంతాల్లోనే పెద్దగా ముంపు ప్రభావం లేదు.


తారకరామానగర్‌ వద్ద నీట మునిగిన ఇళ్లు
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని