సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Updated : 18/09/2021 04:05 IST

సంక్షిప్త వార్తలు

ఫాస్టెస్ట్‌ స్ప్రింటర్‌ నరేష్‌కుమార్‌కు అభినందన

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: తెలంగాణలోని హనుమకొండలో జరుగుతున్న జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కె.నరేష్‌కుమార్‌ 100మీ పరుగును 10.30 సెకన్లలో పూర్తిచేసి పసిడి పతకంతో సత్తాచాటాడు. ఈ సందర్భంగా అతడిని శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అభినందించారు. సరికొత్త మీట్‌ రికార్డును నెలకొల్పడం చాలా గర్వించదగిన విషయమన్నారు. నరేష్‌కుమార్‌ గతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శాప్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో శిక్షణ పొందాడని వివరించారు.


ఉత్సాహంగా బెజవాడ వైట్‌బాల్‌ టీ20 క్రికెట్‌ టోర్నీ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: గోస్పోర్ట్స్‌ క్రికెట్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బెజవాడ వైట్‌బాల్‌ టీ-20 క్రికెట్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో పలు జట్లు ఉత్సాహంగా తలపడ్డాయి. మురళీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఎస్‌సీ క్రికెట్‌ క్లబ్‌ జట్టుపై విజయం సాధించగా, గోస్పోర్ట్స్‌ ఫాల్కన్స్‌ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో జాగృతి క్రికెట్‌ అకాడమీ జట్టుపై గెలుపొందింది.


20 నుంచి రాష్ట్ర స్థాయి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ నిర్వహిస్తామని ఆ సంఘం అధ్యక్షుడు ఎస్‌.రాధాకృష్ణమూర్తి తెలిపారు. టోర్నీలో అండర్‌-10, 12, 14, 16 బాలబాలికలకు సింగిల్స్‌ ఈవెంట్‌, స్త్రీ, పురుషులు, 45+, 65+ కేటగిరీల్లో డబుల్స్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 90325 30429 నంబరులో సంప్రదించాలన్నారు.


సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల పరీక్ష ఫలితాల వెల్లడి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 10 కోర్సుల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తీర్ణత ధ్రువపత్రాలను (ప్రొవిజనల్‌ సర్టిఫికెట్స్‌) వారి విద్యా సమయం (స్టడీ పిరియడ్‌) ముగిసిన తర్వాతే అందజేస్తామన్నారు.


బదిలీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ నిలుపుదల

మచిలీపట్నం: జిల్లాలోని పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్‌కౌన్సెలింగ్‌ కోసం విడుదల చేసిన షెడ్యూల్‌ను హైకోర్టు ఆదేశాలతో నిలుపుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు.


30 నుంచి పరీక్షలు

కృష్ణా విశ్వవిద్యాలయం (మచిలీపట్నం),న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల పరిధిలో నిర్వహించాల్సిన డిగ్రీ రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌, పీజీలోని ఎంబీఏ, ఎంసీఏ రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.డి రామశేఖరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.


సమగ్రశిక్ష ఏపీసీగా శేఖర్‌

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తగా డా.అమర్లపూడి శేఖర్‌ నియమితులయ్యారు. జిల్లా అగ్నిమాపకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ని సమగ్రశిక్ష ఏపీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఆర్జీయూకేటీసెట్‌కు 475 పరీక్ష కేంద్రాలు

నూజివీడు, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో ఈ ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఆర్జీయూకేటీసెట్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 467, తెలంగాణలో 08, మొత్తం 475 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల సహాయ కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు శుక్రవారం తెలిపారు. ఈ నెల 26న పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలియజేశారు.


పులిచింతలకు మళ్లీ వరద ప్రవాహం

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ఆ ప్రవాహాన్నంతటినీ దిగువకు పంపుతున్నారు. గత నెలలో ప్రాజెక్టు 16వ నెంబరు గేటు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి గేట్లకు మరమ్మతులు చేస్తున్నందున పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచడం లేదు. గురువారం రాత్రి నుంచి వరద నీరు భారీగా ప్రాజెక్టుకు చేరుకుంటోంది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ఎగువ నుంచి 2,09,344 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. పది రేడియల్‌ గేట్లు తెరిచి దిగువకు 1,61,267 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 13,000 క్యూసెక్కులు, లీకేజీ ద్వారా 400 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,74,667 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వెళ్తోందన్నారు. ప్రాజెక్టులో 32.92 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు.


ప్రారంభమైన బీఈడీ పరీక్షలు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 66 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. సరైన గుర్తింపు పత్రాలు లేవని పరీక్షలను వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి పత్రాలు సమర్పించిన కళాశాలలకు అప్పటికపుడు అనుమతులు మంజూరు చేసింది. అనుమతించిన కళాశాలల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రికి అన్ని కళాశాలలకు అనుమతులు వస్తాయని, శనివారం నుంచి పరీక్షలన్నీ సజావుగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం పరీక్షలు రాయలేకపోయిన సుమారు వెయ్యి మంది విద్యార్థులను శనివారం నుంచి రాసేందుకు అనుమతిస్తున్నట్టు పరీక్ష భవన్‌ అధికారులు వెల్లడించారు. మరోవైపు శుక్రవారం పరీక్ష భవన్‌ వద్ద హాల్‌టిక్కెట్లు రాని బీఈడీ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. సరైన సమయానికి హాల్‌టిక్కెట్లు ఇవ్వకపోవడం వల్ల తమ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయంలో అందరికీ హాల్‌టిక్కెట్లు పంపిస్తామని పరీక్ష భవన్‌ అధికారులు తెలిపారు.


ప్రభుత్వ పథకాల ప్రచారానికి దరఖాస్తులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి కోసం సాధారణ, సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల గురించి ప్రచారం చేసేందుకు అవసరమైన గ్రాంటును మంజూరు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి సహాయ సంచాలకులు మధుసూదన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల సేవా కార్యక్రమాల్లో పని చేస్తున్న సంస్థలు హిందీ, ఆంగ్ల భాషలో దరఖాస్తును పూర్తి చేసి గుంటూరులోని తమ కార్యాలయంలో ఈనెల 20 లోపు అందజేయాలన్నారు. వివరాలకు www.disabilityaffairs.gov.in వెబ్‌సైట్‌ని చూడాలని సూచించారు.


దివ్యాంగుల వసతి గృహంలో ప్రవేశాలకు అవకాశం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ 4 వీధిలోని ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య అభ్యసించే దివ్యాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆ శాఖ జిల్లా ఇన్‌ఛార్జి సహాయ సంచాలకులు మధుసూదనరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు వసతి గృహ సంరక్షకులు కె.యోగయ్యని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


ఐదుగురికి డీటీలుగా పదోన్నతి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఐదుగురు సీనియర్‌ సహాయకులకు డీటీలుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముప్పాళ్లలో పనిచేస్తున్న షేక్‌ జానీబాషాను ప్రత్యేక డీటీగా కలెక్టరేట్‌లోని సీ సెక్షన్‌కు, మంగళగిరి మండలంలో పని చేస్తున్న వై.ధర్మతేజను కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలోనూ, దాచేపల్లిలో పని చేస్తున్న షేక్‌ బాషాను మాచర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి, శావల్యాపురంలో పని చేస్తున్న బి.సుబ్బారావును రొంపిచర్ల మండలం డీటీగాను, తాడేపల్లిలో పని చేస్తున్న వి.వి.రమణరాజును అక్కడే డీటీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఫిజియోథెరపీ పరికరాల అందజేత

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని భవిత, నాన్‌ భవిత కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న మస్తిష్క పక్షవాతం, మేథో వైకల్యం, లోకోమోటార్‌ వైకల్యం, కండరాల బలహీనత, బహుళ వైకల్యంతో బాధ్యపడుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపయోగకరమైన 58 రకాల పరికరాలను జేసీ జి.రాజకుమారి శుక్రవారం ఆయా కేంద్రాలకు అందించారు. ముఖ్యంగా స్విస్‌ బాల్‌, షోల్డర్‌ వీల్‌, తేరాబ్యాండ్‌, హాండ్‌ గ్రిప్పర్‌, వెయిట్‌ కప్స్‌ తదితర పరికరాలను అందించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా ప్రాజెక్ట్‌ అదనపు సమన్వయ అధికారి మేకతోటి వెంకటప్పయ్య, జిల్లా సహిత విద్యా సమన్వయాధికారి కె.నాగేంద్రమ్మ, సహాయ సమన్వయాధికారి జి.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


20 నుంచి వీఆర్‌వోలకు శిక్షణ

కలెక్టరేట్‌: వీఆర్‌వోలకు సర్వే అంశాలపై ఈ నెల 20వ తేదీ నుంచి 15 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరగనుంది. చేబ్రోలులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతుందని సర్వే ఏడీ వై.నాగశేఖర్‌ తెలిపారు.


పాఠశాలల అభివృద్ధికి కృషి అవసరం

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్‌.ఎస్‌.గంగాభవాని తెలిపారు. గుంటూరులోని డీఈవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలో డ్రాయింగ్‌లో ఇద్దరు, జడ్పీ యాజమాన్యంలో నలుగురు, అగ్రికల్చర్‌ ఒకరు, వీవింగ్‌లో ముగ్గురికి బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డీఈవో కార్యాలయ పాలనాధికారి షేక్‌ సంధాని, ఉర్దూ పాఠశాలల డీఐ షేక్‌ ఖాసిం, ఐటీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.


సమస్యల పరిష్కారానికి త్వరలో చలో అసెంబ్లీ

నగరంపాలెం, న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి త్వరలో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నామని ఏఐటీయూసీ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారాయుడు కోరారు. మల్లయ్యలింగం భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ త్వరలో నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని