నీటి కనెక్షన్లకు మీటర్లు
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

నీటి కనెక్షన్లకు మీటర్లు

త్వరలో తాగునీటి పథకాల పనులు ప్రారంభం

ఈనాడు - అమరావతి

జిల్లాలోని ఐదు పురపాలికల్లో తాగు నీటి సమస్య పరిష్కారానికి ఉద్దేశించిన ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండు ప్యాకేజీలకు సంబంధించి గుత్తేదారుల ఎంపిక పూర్తయింది. శాశ్వతంగా తాగునీటి సమస్యలను తీర్చేందుకు రూ.484.1 కోట్లతో పథకాలను డిజైన్‌ చేశారు. దీనికి ఏఐఐబీ (ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు) ఆర్థిక సాయం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 34వేల కనెక్షన్లు ఇవ్వాలని తలపోస్తున్నారు. ఇళ్ల కనెక్షన్లకు మీటర్లు బిగించనున్నారు.

జిల్లాలోని ఉయ్యూరు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, పెడన పురపాలికల్లో గతంలో నిర్మించిన నీటి పథకాలు ప్రస్తుత అవసరాలను తీర్చడం లేదు. ముఖ్యంగా ఎండా కాలంలో ఈ పట్టణాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా భూగర్భ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నీటిని తీసుకుని కొత్తగా పథకాలను నిర్మించనున్నారు. ఇళ్లకు కొళాయి ద్వారా రక్షిత నీటిని అందించాలన్నది లక్ష్యం. వచ్చే 18 ఏళ్లల్లో పెరిగే జనాభా, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం రూ.484.1 కోట్లలో ఏఐఐబీ 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం భరించనుంది. ఉయ్యూరుకు రూ.73.20, జగ్గయ్యపేట.. రూ.65.13, తిరువూరు.. రూ.162.43, నందిగామ.. రూ.89, పెడన పట్టణానికి రూ.94.34 కోట్లు చొప్పున వెచ్చించనున్నారు. పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ కింద నీటి వనరు నుంచి తాగునీటి ట్యాంకు వరకు, రెండో ప్యాకేజీ కింద ట్యాంకు నుంచి ఇళ్లకు నీటిని అందించే పనులను చేపట్టనున్నారు. తిరువూరు పురపాలికలో ప్రస్తుతం బోర్లపై ఆధారపడుతున్నారు. కొత్త పథకంలో ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ నుంచి కృష్ణా నీటిని ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా తిరువూరుకు తీసుకెళ్తారు. అక్కడ శుద్ధి చేసి రక్షిత నీటిని గృహాలకు అందిస్తారు. జగ్గయ్యపేట, నందిగామ పట్టణాలకు నేరుగా నది నుంచి తీసుకుంటారు. ఉయ్యూరు పట్టణానికి ప్రస్తుతం భూగర్భ జలాలే దిక్కు. దీంతో కొత్త పథకంలో పుల్లేరు కాలువ ద్వారా నీటిని తీసుకుంటారు.

* రెండేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇళ్లకు ఇచ్చే కనెక్షన్లకు మీటర్లను బిగించనున్నారు. నీటి వృథాను తగ్గించి, శుద్ధి చేసిన తాగునీటి నష్టాలను తగ్గించేందుకు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో తిరువూరు, నందిగామ మున్సిపాలిటీల్లో 5వేలు చొప్పున, జగ్గయ్యపేటలో 8వేలు, పెడనలో 9వేలు, ఉయ్యూరులో 7వేలు మేర గృహ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని